Tuesday, August 25, 2020

పూరీలో జగన్నాథునికి రకరకాల వంటలను రోజులో ఆరుసార్లు నివేదిస్తారు

🌺🌸🏵️పూరీలో జగన్నాథునికి రకరకాల వంటలను రోజులో ఆరుసార్లు నివేదిస్తారు.🌺🌸🏵️

పండగలు, పర్వదినాల్లో స్వామికి 56 నుంచి 64 పిండి వంటలను అర్పిస్తారు. వేల ఏళ్ల నుంచి మహాప్రసాదం రుచిలో ఏ మాత్రం మార్పు ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయత్లు వీటిని నియమానుసారం గర్భగుడిలోకి తీసుకెళతారు. వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవరూ ఎదురు పడకూడదు. దేవుడికి ఆహారాన్ని ఓ రకమైన నాట్యం ద్వారా అర్పణచేస్తారు. ముగ్గురు మూర్తులకు నైవేద్యం అయ్యాక ప్రసాదాలను ఆనంద బజారు (ఆలయం ముందున్న ప్రధాన వీధి)కు తరలిస్తారు. స్వామికి సమర్పించిన ప్రసాదానికి దైవత్వం సిద్ధించి మరింత రుచి వస్తుందని విశ్వసిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పూరీ ఆలయ పాకశాలను చెబుతారు. ఆంగ్లేయులు దీన్ని మిరకిల్ హోటల్గా పేర్కొన్నారు. ఈ పాకశాలలో 500 మంది పాకశాస్త్ర నిపుణులు, 300 మంది సహాయకులు ఉంటారు. వారికి కావాల్సిన సామగ్రిని అందజేయడానికి మరో 200 మంది ఉంటారు. 

వంటలు చేసే వారిని మినహాయించి ఇతరులను పాకశాలలోకి అనుమతించరు. పొరపాటున ఎవరైనా వచ్చినా, ఇతర విఘ్నాలు ఎదురైనా వండినదంతా భూమిలో పాతి పెట్టి పాకశాల శుద్ధిచేసి మళ్లీ వండుతారు.
అక్కడి వంటను లక్ష్మీదేవి అదృశ్యరూపంలో పర్యవేక్షిస్తుంటుందని, అందుకే ఆ వంటకాలు అంత రుచిగా ఉంటాయని భక్తులు చెబుతారు. దీనివల్ల పూరీలోని ప్రసాదాలను మహాలక్ష్మీ పాకమని కూడా పిలుస్తారు. ఆలయంలోని గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. రోజూ లక్ష మందికి సరిపడా అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది.

వంటశాలలో షడ్భుజాకారంలో మట్టి, ఇటుకలతో నిర్మించిన 752 పొయ్యిలు ఉంటాయి. రోజూ సూర్యుణ్ణి, అగ్ని దేవుణ్ణి స్తుతిస్తూ హోమం చేశాక మాత్రమే ఈ పొయ్యిలను వెలిగిస్తారు. నవ గ్రహాలు, నవ దుర్గలు, నవ ధాన్యాలను సూచిస్తూ కుండ మీద కుండ.. ఇలా తొమ్మిది కుండలను పెట్టి వండే విధానం నిన్న, మొన్నటి వరకు ఉండేది. అందరికీ ఈ పద్ధతి కుదరకపోవడంతో ఇటీవల వరుసగా ఉన్న పొయ్యిలపైనే వండుతున్నారు. 

ఒకసారి వండిన కుండలపై మరోసారి వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే. ఆ కుండలు కూడా పూరీ సమీపంలోని కుంభారు గ్రామస్తులు చేసినవే అయ్యుండాలి. విదేశాలకు చెందిన ఆలు, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయల్ని అసలు వాడరు. ఉల్లి, వెల్లుల్లి కూడా నిషేధమే. ఆకుకూరలు, కొబ్బరి, నెయ్యి, బియ్యం, పప్పు, పాల ఉత్పత్తులతోనే చేస్తుంటారు. తాటిబెల్లం, మిరియాలు కూరల్లో వినియోగిస్తారు.

స్వామి ప్రసాదాల్లో ఆరోగ్యప్రదమైంది ఒబాడా. 
ఇది అందరూ కలిసి ఆరగించేది అని లక్ష్మీ పురాణం చెబుతోంది. దీన్నే మహాప్రసాదమని అంటారు. ఇందులో అన్నం, ముద్ద పప్పు, పొంతులా (కూరగాయల ఇగురు), పక్కోడో (తీపి పులుసు), ఖారి (పాయసం) వంటివన్నీ ఉంటాయి. కక్కరా, అరిసె, పూరి, చక్కోరి, బాల్సా, రసాబోలి, రసమలై... వంటి తీపి పదార్ధాలు ఉంటాయి. 

భక్తులు శుభ కార్యాల్లోనే కాకుండా, శ్రాద్ధ కర్మల్లోనూ మహా ప్రసాదాన్ని వడ్డిస్తుంటారు. పూరీ ఆనందబజారులో ఆర్డరు చేస్తే ఎంత మందికి సరిపడే ప్రసాదాలనైనా సిద్ధం చేస్తారు. ఒబాడా మిగిలితే దాన్ని శుభ్రమైన ఆవరణలో ఎండబెట్టి నిర్మాయిల్ (ఎండు అన్నం)గా మారుస్తారు. ఇవన్నీ ఆయుర్వేదపరంగా కూడా గుర్తింపు పొందాయి.

🌺జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.🌺

పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు ఇవే 

1. అన్నం
2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
6. నేతి అన్నం 
7. కిచిడీ
8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
10. కాజా 
11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
12. లడ్డు 
13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)
21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
27. పూరీ 
28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)
30. దొహిబొరా (పెరుగు గారెలు)
31. అరిసె 
32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)
35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)
36. కోవా 
37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)
39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)
40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)
41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)
43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 
44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 
45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 
46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)
47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)
48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)
49. బేసొరొ (కలగూర వంటకం) 
50. సగొ (తోటకూర వంటకం)
51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)
52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)
53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)
54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)
55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 
56. బైగని (వంకాయలతో చేసే వంటకం)

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS