Tuesday, May 16, 2023

కాళికామాత చిత్రంలో- ఆమె పాదాలక్రింద ఈశ్వరుడున్నట్లు కొన్ని చోట్ల కనిపిస్తుంది. దయచేసి ఆ కథను కాస్త తెలుపగలరు.

 ధర్మసందేహాలు- సమాధానం



ప్ర :  కాళికామాత చిత్రంలో-  ఆమె పాదాలక్రింద ఈశ్వరుడున్నట్లు కొన్ని చోట్ల కనిపిస్తుంది. దయచేసి ఆ కథను కాస్త తెలుపగలరు.



జ :  'కాళిక ' అంటే కాలస్వరూపిణి. 

' కలయతీతి కాలః '- సర్వజగత్తును ఏర్పరచి పోషించి, లయంచేసే శక్తి కాలం. ఈ కాలం పరమేశ్వరుని శక్తి. పరమేశ్వరునిపై ఆధారితమై నడుస్తుంది. అందుకు సంకేతమే శివుని అధిష్ఠించిన ఈ శక్తి రూపం.

 పురాణ కథలు, ఉపాసనా రూపాలు  దివ్య శక్తుల తత్త్వానికి సంకేతాలు.

 ఒకసారి దక్ష యజ్ఞానికి వెళ్ళాలని పట్టుబడుతుంది సతీదేవి ( ఆదిశక్తి ). పిలువని పేరంటానికి వెళ్లరాదంటాడు  శివుడు. శివనింద చేసే దక్షునికి ఇంక పుత్రికగా ఉండరాదనీ, ఆ దక్షునికి బుద్ధి చెప్పాలని అమ్మవారి సంకల్పం. శివుడెంత చెప్పినా అమ్మవారు తన పట్టువీడదు. దానితో "నీవు దక్షపుత్రికవు కనుక, నా మాట వినడం లేదు" అంటాడు. భార్యాభిమానం చేతనో, లేక 'దక్షపుత్రికాభావాన్ని' త్యజించమని సూచించాలనో  శివుడు ఆ మాట అన్నాడు. అది విన్న జగదంబ సతీదేవి, ' ఈ స్వామి నేను పరాశక్తిననే అంశాన్ని విస్మరిస్తున్నాడు' అని భావించి, తానేమిటో స్పష్టపరచాలని సంకల్పించుకుంటుంది. ఆ సంకల్పంచేత  - మహాకాళీ స్వరూపంగా మారుతుంది. ఆమె నుండి మరో తొమ్మిది శక్తులు ఆవిర్భవిస్తాయి. అవే 'దశమహావిద్యలు '. ఆ రూపాలను చూసాక శివుడు తిరిగి స్వస్థితికి చేరుకుంటాడు. ఆ రూపాలకు సంబంధించిన మంత్ర, తంత్ర, యంత్రాది ఆగమ  విధులను ఏర్పరచమని శివునితో చెప్తుంది. శక్తితత్త్వం గురించి చెప్పగలిగేది శివుడొక్కడే కదా!

 ఆ తరువాత మిగిలిన రూపాలను ఉపసంహరించుకొని దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి, అక్కడ యోగాగ్నితో తన శరీరాన్ని త్యజించుతుంది. పిమ్మట గౌరిగా హిమవంతుని పుత్రికగా ఆవిర్భవిస్తుంది. ఆ రూపంలో శివుని తపస్సుకి సహకరిస్తూ అర్చించిన గౌరమ్మను, మన్మథ దహనానంతరం చూసిన శివుడు " నువ్వు దక్షయజ్ఞానికి వెళ్ళేముందు చూపించిన కాళీరూపాన్ని ఇప్పుడు చూడాలని ఉంది" అంటాడు. వెంటనే ఆదిశక్తి కాళీరూపాన్ని చూపిస్తుంది. అది చూసి పరవశించిన పరమశివుడు, భూమిపై శయనించి తన హృదయం పై అధిష్ఠించమని ప్రార్థిస్తాడు. శక్తి శివునిపై అధిష్ఠించి ప్రకాశిస్తుంది. మరో రూపంలో శివుడు కాళీదేవికి ఎదురుగా నిలిచి,     'కాళీసహస్రనామస్తోత్రాన్ని' పఠిస్తాడు. ఇది దేవీ భాగవత ఉపపురాణంలోని కథ. ఇందులో సంకేతం- పరబ్రహ్మనిర్గుణంగా, నిరంజనంగా ఉంటే ఆయన శక్తి ఆయనను అధిష్ఠించి ఈ జగత్తును నిర్వహిస్తోంది....అని తెలియజేయడమే. ఉపాసనకి సంబంధించిన ఈ దివ్యమూర్తిలో శివశక్తుల సామరస్యమే స్ఫురిస్తుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS