మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము యొక్క పనిని కలిగి ఉంటాయి. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే ఆ దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు.
వేదమునకు మూలము నాదము.దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి ?
యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి
1) ఇచ్ఛాశక్తి
2) జ్ఞానశక్తి
3) క్రియాశక్తి.
ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.
చరాచర సృష్టి మొత్తం మూడు శక్తుల కలయికే ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే
నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే
విజ్ఞాన వేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని 'పరాశక్తి' అని 'అవ్యక్తం' 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి.
త్రిమూర్తులకు దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం
ఉండేది బ్రహ్మమొక్కటే ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగాఉన్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను,విమర్శను పరాశక్తిగాను భావించారు.
కాంతి స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవలన నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది.
సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
1 శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న బిందువు, 2) అచేతనంగా ఉన్న 'శివుడు, 3) చేతనా స్వరూపమైన శక్తి ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము.
త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం కనీసం ఊహించలేం కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.
పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు శ్రీ దేవియే శ్రీ చక్రము శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
శ్రీ చక్ర నిర్మాణం
బిందువు త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము - బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రం.
శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర,శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదు శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు.
ఈ చక్రం లోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీ చక్రము అష్టాచక్రా అవుతుంది.
.నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం.
శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.
1. భూపుర త్రయం - త్రైలోక్య మోహన చక్రం
2. షోడశ దళ పద్మం - సర్వాశా పరిపూర చక్రం
3. అష్ట దళ పద్మం - సర్వ సంక్షోభిణీ చక్రం
4. చతుర్దశారము - సర్వ సౌభాగ్య చక్రం
5. బహిర్దశారము - సర్వార్థ సాధక చక్రం
6. అంతర్దశారము - సర్వ రక్షాకర చక్రం
7. అష్ట కోణము - సర్వ రోగహర చక్రం
8. త్రి కోణము - సర్వ సిద్ధిప్రదా చక్రం
9. బిందువు - సర్వానందమయ చక్రం
ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు.
శ్రీ చక్రం - మానవ శరీరం
గమనించవలసిన విషయమేమంటే ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవుని యందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే - నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరు దండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో మన మేరు దండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.
మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.
శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు.
కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.
దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవస్సనాతనః
త్యేజేదజ్ఞాన నిర్మాల్యం
సోహంభావేన పూజయేత్ !
శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.
కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి.
విశ్వంలోని శక్తులన్ని తొమ్మిది ఆవరణముల ద్వారా ఉత్పతై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.
నిరంతర సాధన మార్గం
శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత అదృష్టంగా అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు - వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం.
ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!
త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు తొలగించుకో వలసిన తెరలు అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్ని శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి, వాటిని లేకుండా చేయలేం.మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవా వరణములను నిర్లిప్తతతో, నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలి...
.
.
శ్రీ చక్ర పూజ విధానం.
శ్రీ చక్రం అనేది విశ్వానికి ప్రతి రూపం, అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు, శ్రీ చక్రం పూజ అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడం, వేరు వేరు శక్తులలో కూడా బాసిస్తున్న అమ్మవారిని పూజ చేయడం, ఈ పూజను మనము మూడు రకాలుగా చెప్పచ్చు .
ప్రతిష్ఠ చేసి పూజించే విధానం, అంటే శ్రీశైల భ్రమరాంబిక దేవి ఎదుట ఉన్న విధంగా మహమేరువు, అర్ధ మెరువు, కూర్మవృస్టమ్, భూప్రస్తారం అనే పేర్లతో, దోరికేటివి ఇంట్లో అర్చించు కోవడం..
(శ్రీ చక్ర పూజ సుదీర్ఘమైనది అందులోని ప్రతి దేవతని నమస్కరించడం ,తర్పణం చేయడం తర్వాత పూజించడం..
( ex:హృదయ దేవి తర్పయామి ఆలా) దీన్నే సామగ్రంగా నవర్ణావ అర్చన అంటారు. 9 ఆవరణలోని దేవతలను అర్చన చేయడం ఇది సూదీర్ఘమైనది ఇందులో కొన్ని మంత్రాల ఉపదేశము, ఆచరణ,అందులో సిద్ధి ఉన్న వారు మాత్రమే ఆచరిస్తారు..
విధానం విశ్వమంతా వ్యాపించిన అమ్మవారిని ప్రక్రుతి స్వరూపిణి అయిన జగన్మాతను శ్రీ చక్రంలో భావించడం, పూజ గదిలోని మిగతా విగ్రహాలతో సమానంగా భావించి చేసే పూజ అందులో నవర్ణావ పూజ మంత్రాలు ఉండవు, నియమాలు కూడా తక్కువగా ఉంటాయి..
(నియమాలు అన్నవి మన నిగ్రహం కొసం కానీ విగ్రహం కోసం కాదు అని గుర్తించాలి) నియమ నిష్ఠలు కాచితంగా పాటించే ఉదేశం ఉంటేనే శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవాలి..
ఎందుకంటె శ్రీ చక్రం జగన్మాత రూపం, ఆ తల్లికి నాలుగు రూపాలు, స్థూల రుపం అంటే బొమ్మల్లో వేసుకొని చూపించే రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మ తర ,సూక్ష్మ తమ రూపం అని నాలుగు విధాలా రూపాలలో ఆ తల్లి ఉంటుంది..
శ్రీ చక్రం లో అమ్మవారు పరివార దేవతలతో సూక్ష్మ రూపంలో ఉంటుంది , అమ్మవారు సూక్ష్మ రూపం లో ఉండేది యంత్రం లోనే కాబట్టి ,స్థూల రూపం కన్నా సూక్ష్మ రూపానికి మరింత నియమాలు ఉండాలి ,
నియమాలు అంటే ఏమిటో అనుకోని కంగారు పడకండి ,ఇల్లు శుభ్రము గా ఉంచాలి, స్త్రీ మైలు నియమాలు పాటించాలి, ఉతికిన వస్త్రాలు ధరించాలి శుభ్రంగా స్నానం చేసి శ్రీచక్రం ఉన్న గదిలోకి వెళ్లి చక్రం ముట్టుకోవాలి,
వారానికి ఒక్కసారి అయినా పసుపు నీళ్లు పాలు తో అభిషేకం చేయాలి... కచ్చితంగా రోజు నైవేద్యం పెట్టాలి.. బెల్లం కి నిలువ దోషం లేదు కనుక రోజు బెల్లం ముక్క పెట్టడం మంచిది, వడపప్పు రోజు కొద్దిగా నివేదన చేయగలితే మంచిది, కుదరకపోతే ఏదైనా పండు పెట్టచ్చు కానీ కచ్చితంగా నివేదన చేయాలి..
ఎందుకంటే శ్రీ చక్రం శక్తి కేంద్రం అందులో ఆహుతులను సమర్పించాల్సిన అవసరం ఉంది అందుకే నైవేద్యం రోజు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ను శ్రీచక్రం మురికి చేరకుండా శుభ్రపరచాలి..
ఈ నియమాలను పాటిస్తూ రోజు నిత్యా పూజ శ్రీచక్రం కి ఎలా చేయాలో చూద్దాము........
శ్రీ చక్రం వీలైతే రోజు అన్ని పసుపు నేటితో అభిషేకం చేయండి... అభేషేకం చేస్తున్నపుడు శ్రీ మాత్రే నమః అనే మంత్రం జపిస్తూ చేయఁడి, రోజు కుదరక పోతే వరకు ఒకసారి శుక్రవారం రోజు పౌర్ణమి రోజు చేయచ్చు...
శ్రీ చక్రానికి గంధం పసుపు కుంకుమ పుష్పలు పెట్టి అలకరించండి...
మీ గోత్రం నామం చెప్పుకొని యధాశక్తి నిన్ను పూజించు కుంటున్నాము తల్లి అని సంకల్పించుకొని నమస్కారం చేసుకోండి.
ధూపము ఇవ్వాలి, సాంబ్రాణి(ఉంటే) ఇవ్వాలి
లలితా సహస్త్రనామం ,లేక (లలిత అష్టోత్తరం కానీ, ఖడ్గ మాల లోని ,ఉపదేశం లేని వారు ఎక్కడ నుండి ఎక్కడ వరకు చదవచ్చు నేను ఇంకో పోస్టులో పెడతాను. ) మీ సమయం విలును పట్టి నిర్ణయించుకొని ఆ నామాలు జపిస్తూ కుంకుమాతో అర్చన చేయాలి.
మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి నివేదన చేసి... హారతి ఇవ్వాలి.
( శ్రీ సూక్తం తెలిసిన వారు శ్రీసూక్తంతో అభేషేకం చేస్తారు తెలియక పోయినా శ్రీ మాత్రే నమః అనుకుంటూ అభేషేకం చేయచ్చు..)
అష్టోత్తరం అయ్యాక కూడా మీకు సమయము ఓపిక ఉన్నంత వరకు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఎంత సేపైన కుంకుమ పూజ చేసుకొని హారతి ఇవ్వొచ్చు...
ఏదైనా పని ఉంది బయటకు వెళ్లి వస్తే మాత్రం ఆ వస్త్రాలు మార్చకుండా శ్రీ చక్ర పూజ చేయకూడదు పూజ వరకు ఒక రెండు జతలు విడిగా ఉంచుకోవడం మంచిది....
ఓం శ్రీమాత్రే నమః.....
No comments:
Post a Comment