కృష్ణా జిల్లా : " అకిరిపల్లి (శోభనాచలం)"
👉 శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
💠 కోరిన కోరికలు నెరవేర్చడంలోను ... పుణ్య ఫలాలను అందించడంలోను కార్తీకమాసంతో సమానమైన మాసం మరొకటి లేదనేది మహర్షుల మాట.
కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం వలన, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కారణంగా ఆ మాసంలో అటు శివాలయాలకు .. ఇటు వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు.
💠 అయితే సమానమైన ప్రాశస్త్యంగల శివ క్షేత్రం ... విష్ణు క్షేత్రం ఒకే ప్రాంతంలో ఆవిర్భవించడం అరుదుగా జరుగుతుంటుంది. అలా శివకేశవులు కొలువైన క్షేత్రాన్ని కార్తీకమాసంలో దర్శించడంవలన, పాపాలు పటాపంచలై సంపదలు ... సంతోషాలు కలుగుతాయని అంటారు.
అలాంటి మహిమాన్వితమైన హరిహర క్షేత్రం, కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలోని 'అకిరిపల్లి' గా దర్శనమిస్తోంది.
💠 స్వామి వెలసిన ఈ శోభనాద్రి కృతయుగం లో “ కళ్యాణాద్రి” యని,
త్రేతాయుగం లో “ శోభాచల “మని, ద్వాపరయుగం లో “ స్వప్న శైల” మని,
కలియుగం లో “శోభనాద్రి “ అని పిలువ బడుతున్నట్లు స్థలపురాణం చెపుతోంది.
💠 అమృతత్వాన్ని’ (అ) ‘ అందిస్తూ ప్రవహించే వరహ ‘(కిరి)’ పుష్కరినికి ఆనుకుని ఉన్న గ్రామం ” అకిరిపల్లి” గ్రామం అని కొంతమంది వర్ణిస్తే, శోభనగిరిని ప్రధాన చిరునామాగా చూపిస్తూ పిలిచే పల్లె గ్రామం “ఆ-గిరిపల్లి “ అని కొంతమంది కొనియాడారు.
💠 ఇక్కడ శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారని చెబుతారు.
ఈ అగిరిపల్లి దక్షిణ సింహాచలం అని ప్రసిద్ధి పొందినది.
💠 విజయవాడ సమీపంలోని అకిరిపల్లిలో కొండమీద ఆలయ ప్రాంగణం ఉంది. అక్కడి గుహాలయంలో వ్యాఘ్ర నరసింహులవారు, మరో గుడిలో మల్లేశ్వర శివుడు కొలువుతీరి ఉన్నారు.ఇక్కడ రాజ్యలక్ష్మిbఅమ్మవారికి కూడా గుడి ఉంది.
🔆 స్థలపురాణం :
💠 శుభవ్రతుడనే మహారాజు సనత్కుమారుని వలన నారసింహ మంత్రాన్ని పొంది, రాజ్యాన్ని కుమారుల కప్పగించి, తపస్సు చేసు కోవడానికి బయలుదేరాడు.
ఇక్కడ శివకేశవుల కోసం తపస్సు చేసి, వారు ఈ కొండపై తనకు దర్శనమివ్వవలసిందిగా కోరాడు.
ఆ విధంగా శివుడు, విష్ణువు కొండపై వెలవగా, శుభవ్రతుడి పేర కొండ శోభనాద్రిగా సార్థకమైంది.
శోభనాద్రికి పశ్చిమంగా వరాహ తీర్థం ఉంది. విష్ణువు వరాహావతారంలో ఈ పుష్కరిణిని తవ్వినట్టు చెపుతారు.
కిరి అనే మాటకు వరాహమనే అర్థం కనుక ఈ ప్రాంతానికి అకిరిపల్లి అనే పేరు వచ్చినట్టు చెబుతారు.
💠 భక్తుడి అభ్యర్థనను కాదనలేని శివకేశవులు...శ్రీమన్నారాయణుడు వ్యాఘ్ర ముఖుడై లక్ష్మీసమేతంగా నరసింహస్వామిగా, పరమశివుడు మల్లేశ్వరుడుగా కొండపై వెలిశారు.
కొండమీద మీద స్వయంభువు ఐన స్వామి వ్యాఘ్రరూపుడు గానే దర్శనమిస్తాడు.
కొండ క్రింద ఆలయం లో లక్ష్మీ సమేతంగా కొలువు తీరి ఉంటాడు.
క్షేత్రపాలకుడు గా పర్వత శిఖరాగ్రం పై మల్లేశ్వరస్వామి పూజ లందుకొంటున్నాడు.
💠 నవ నారసింహ రూపములలో కాకుండా వ్యాఘ్ర (పెద్దపులి ముఖం) రూపంలో దర్శనమిచ్చే ఏకైక నారసింహ క్షేత్రం ఈ ఆగిరిపల్లి క్షేత్రం .
💠 సుమారు 800 మెట్లు కలిగిన ఈ కొండకు పై భాగం లో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తే , కొండకు సరిగ్గా మధ్యభాగంలో ప్రధాన స్వామి అయిన నరసింహ స్వామి వ్యాఘ్ర రూపంలో భక్తులకు కనువిందు చేస్తారు.
💠 తిరుమలలో లాగానే నాలుగు తిరుమాడ వీధులతో , మైసూర్ నగరాన్ని తలపించేలాగా నాలుగు వీధులలో నాలుగు ఆస్థాన మండపములతో, కొండకి నాలుగు దిక్కులా గల కోనేరులతో , ప్రధానంగా గ్రామానికి పశ్చిమాన నాలుగువైపులా మెట్లు, మధ్యలో ముఖమండపం కలిగి, తిరుమల కంటే నాలుగు రెట్లు పెద్దదైన వరాహ పుష్కరిణితో, స్థానిక వేదపాటశాలలో జరిగే నిత్య వేదఘోషతో, చక్కటి సుగంధాన్ని అందించే స్వామి వారి పూల తోటలతో ఆగిరిపల్లి గ్రామం నిత్య శోభాయమానంగా ప్రకాశిస్తున్నది.
💠 కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల క్షేత్రంలో నిర్వహించే మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీ వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి పూజలు జరుగుతుంది.
💠 ఇక్కడ ప్రతిరోజు స్వామివారి నివేదనలో ఎండుమిరపకాయలు తిరగమోతలో వేసిన చింతపండు బండ పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. చక్రపొంగలి,పులిహోర భోగాలు ఉంటూనే ఉంటాయి.
ప్రతి రోజూ కొండమీద స్వామి కి సాయంత్రం పూట నివేదనగా ఇతర భోగాలు ఉన్నా లేకపోయినా సతాయించిన(తాలింపు పెట్టిన) శనగలు మాత్రం తప్పని సరిగా ఉంటాయి.
💠 ఇక్కడ శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి గుడి, శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం ముఖ్యమైనవి, చూడవలసినవి.
వీటితో పాటు దుగ్గిరాల రావమ్మ తల్లి తిరునాళ్ళ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, కోదండరామ స్వామి ఆలయం చూడవచ్చు.🙏
J N RAO 🙏🙏🙏
No comments:
Post a Comment