నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న ఎత్తిపోతల వెలసిన స్వామి వారే నిజరూపుడు అని చెపుతున్న పురాణాలు,పండితులు:
మన పల్నాడు మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ప్రముఖ పర్యాటకస్తలం ఎత్తిపోతల వెలసిన దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర :
పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం యతులు(బుషులు) దైవ కృప కోసం ఈ ప్రశాంత వాతావరణం(ఎత్తిపోతల) లో తపస్సు చేసేవారట,ఆనాటి నుండే దత్తాత్రేయ ఆలయ ఆనవాళ్లు ఉండేవని కధనాలు ఉన్నవి. ఎత్తిపోతల జలపాతం అభిముఖంగా కొండపై వెలసిన దత్తాత్రేయస్వామి వారు ఏకముఖ దత్తాత్రేయుని గా స్వయంభూగా వెలసినట్లు పురాణాల కధనం , లక్ష్మీ దేవి వారి అంశతో జన్మించి దత్తాత్రేయునికి ప్రియ శిష్యురాలి గా మారి ఆయన లో ఐక్యం అయిన మధుమతి అమ్మవారి ఆలయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎత్తిపోతల దత్తాత్రేయుని కొలిస్తే కోరిన కోర్కెలు తీరతాయని,సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు చెపుతారు .కొండల్లో,నల్లమల్ల అటవీ తీరం లో వెలసిన దత్తదేవున్ని గిరిపుత్రులు ఎక్కువగా ఎత్తిపోతల ప్రాంతానికి వచ్చి ఆరాదిస్తారు. .పూర్వకాలం నుండే దత్తాత్రేయ ఆలయానికి పక్కనే గల గుహల నుండి శ్రీశైలం,దైద,గుత్తికొండ బిలాలకు మార్గమున్నట్లు ఈ ప్రాంతాల గుండా గుహల మార్గం ద్వారా బుషులు వచ్చి దత్తాత్రేయ స్వామిని కొలిచేవారని ప్రతీతి,నేటికి ఆ గుహలు ఉన్నను గబ్బిలాల కంపుతో ఉంటుంది.దానిలోపలికి వెళ్లటం ప్రమాదకరం కావున ఎవరు వెళ్లుటకు సాహసించరు. అలనాడు దైద,గుత్తికొండ బిలాల్లో కూడా దివ్యర్షులు తపస్సు చేసేవారని చారిత్రక ఆదారాలు చెపుతున్నాయి.బ్రహ్మనాయుడు కూడ పల్నాడు యుద్ద సమయం లో వీరులతో కలసి గుత్తికొండల గుహాల్లో ఉన్నట్లు మరియు అనేక మార్లు ఎత్తిపోతల సందర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. నక్కల వాగు,సూర్యవంక,చంద్రవంక లు పవిత్ర త్రివేణి సంగమంగా కలసి ప్రవహించే ఎత్తిపోతల అతి పవిత్ర మైనది కావునే ఈ ప్రాంతం లో దివ్యర్షులు తపస్సు చేసేవారట. ఇలాంటి అద్బుత త్రివేణి సంగమం ఇక్కడ మరియు కాశీ క్షేత్రం లో మాత్రమే ఉన్నదని చెపుతారు. దత్తాత్రేయ స్వామి ఆలయం పక్కనే ఉండే రంగనాధ స్వామి వారి దేవాలయం కూడా అతి పురాతన మైనది . రంగనాధ స్వామివారిని పూర్వ కాలం లో విశ్వామిత్ర,పరశురామ,వశీష్ట మహర్షులు వచ్చి దర్శించి పూజలు చేసారట. కృత యుగం,త్రేతాయుగం,ద్వాపర యుగాల కాలం నుండే ఎత్తిపోతల ప్రాంతం లో ఋషులు తపస్సు చేసారని ఇక్కడి స్తల పురాణం చెపుతుంది.
దత్తాత్రేయ స్వామి నేటికీ సంచరిస్తున్నారా ?
అవును. ఇది యదార్ధము. ముమ్మాటికీ నిజం., ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాలోని మాచర్ల దగ్గర వున్న "ఎత్తిపోతల" క్షేత్రంలో స్వయంభువై ఏకముఖి దత్తాత్రేయ స్వామిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రంలో ఈ సంఘటనలు ఆశ్చ్యర్యాన్నీ, మరింత విశ్వాసాన్ని కల్గిస్తోంది. ఈక్షేత్రానికి మాచర్ల గ్రామ చుట్టుప్రక్కల వున్న "తండా" ల నుండి వేలమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. వారికి ఆచారాలు ఏమి తెలియవు. చదువు లేదు. మంత్రాలు అసలే రావు. కేవలం మూఢ భక్తి. నెయ్యితో చేసిన అన్న పరమాన్నముతో స్వామిని దర్శిస్తారు. దత్తుని మీద అపారమైన విశ్వాసం, నమ్మకం. అవే వారిని ఆరోగ్యదాయకమైన, ఆనందమయమైన జీవితాన్ని నడిపిస్తున్నాయి. గర్భాలయాల్లో రుద్రాభిషేకాలు, పంచ సూక్తాలు, శాంతిమంత్రాలు చదువుతున్న మనం, వీళ్ళను చూస్తే ఆ స్వామే వీరి చెంత ఉండడానికి ఇష్టపడుతున్నాడా? అని భావించక తప్పదు. వీరికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు సర్వం దత్తాత్రేయుడే. " మాకు నీవే దిక్కు. అనారోగ్యం వచ్చినా, ఆర్ధిక ఇబ్బంది వచ్చినా, ఏమి కావాలన్నా నువ్వే శరణు, నువ్వే దిక్కు" అని దత్తాత్రేయుడిని ప్రార్థిస్తున్న వారి మధ్య ముసలివాని రూపంలో, చిన్న పిల్లవానిగా, పిచ్చివాడిలాగా అనేక రూపాలలో దర్శనం ఇస్తారని భక్తులు చెపుతుంటారు..
ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు ‘హైహయ’ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని(నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్నపరుశురాముడు (కార్త్యవీర్యార్జునుడి సంహరించినవాడు మరియు రేణుకామాత – జమదగ్నిల కుమారుడు) కార్త్యవీర్యార్జునుడి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసాడు. ప్రపంచంలోని ఏకైక సింధూరలేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు, అలాగే ప్రపంచంలోని ఏకైక ‘నాగకిరిటాభారణ’ (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు ఏకముఖ, చతుర్భుజుడుగా కనిపిస్తాడు. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస మరియు నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు. భక్తులు ఇక్కడి దత్తాత్రేయుడుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్త్యవీర్యార్జున విరచిత దత్తస్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడట.
మధుమతీ దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా ‘తేనెవంటి హృదయం’ గలది అని అర్ధం. మధుమతీ దేవి కుడా స్వయంభూ గానే ఉద్భవించారు. విష్ణు కుండినుల కాలం లో ఈ ఆలయం జీర్ణోద్ధారణ గావింపబడినది. వారు, వారి తరువాత వచ్చిన రాజులందరూ అమ్మ వారికి భక్తులే. ఈవిడ లక్ష్మీ స్వరూపురాలు మరియు అష్ట సిద్ధులకు తల్లి. ఈవిడ పనసచుట్టులో కుటుంబ సమేతంగా ఉంటారు. ఎత్తిపోతల దత్తక్షేత్ర దర్శనానికి వచ్చిన వారు ముందుగా మధుమతీ దేవిని దర్శించి ఆ తరువాత కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితి. ఎంతోమంది ఋషులకి,దత్త ఉపాసకులకి, దత్త భక్తులకీ మధుమతీ దేవి దర్శనం కలిగిందని చెబుతారు. ఈ తల్లి ప్రతినిత్యం రెండు నుండి మూడు సార్లు పైన గల కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడానికి వెళతారట.ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు అమ్మ వారి పాదాలు మెట్లకు ఆనకుండా, మెట్లకు కొద్దిగా పైన గాలిలో నడుచుకుంటూ వెళ్ళడం అనేక మంది చూసారు.
దత్త శిల
‘దత్త శిల’ ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు త్రాగువాని వలె కుర్చుని కల్లు తాగుతూ కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.
ఇచ్చటి దత్తాత్రేయుడు మధుమతి సహితం గా ఉంటారు. మధుమతి సహిత దత్త క్షేత్రం ఇదొక్కటే. కొండ కింద ఔదుంబర వృక్షం ఎదురుగా మధుమతి దేవి ఉంటుంది. కొండ పైన గుహలో దత్తాత్రేయుల వారుంటారు. ముందుగా మధుమతి తల్లిని దర్శించి తరువాత దత్తుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడ దత్తుడు ఏకముఖుడు, విష్ణురూపుడు మరియు అలంకర ప్రియుడు. సింధూరం పూసుకొని ఉండే దత్తాత్రేయుడు. ఈయన విష్ణురూపుడే అయినా నాగసర్ప ప్రియుడు.ఇచ్చటి గుహ వంటి దేవాలయం లో ఖచ్చితంగా దత్తుడి విగ్రహం వెనుక పైకి పుట్టలాగా కనిపించ కుండా కేవలం కన్నాలతో ఉండే దేవ సర్పగృహము కలదు. ఇందునుండి నాగసర్పాలు వెళ్ళడం రావడం ఇక్కడ సాదారణం గా జరిగే ప్రక్రియ.
దత్తాత్రేయ ని స్వామి జ్ఞానాన్ని ఇచ్చే గురువుగా అంధకారాన్ని తొలగించే దేవుని గా భక్తులు కొలుస్తారు.దత్తాత్రేయ స్వామి యోగ దీక్షలో మౌన మునిగా ఈ ప్రాంతం లో వెలసాడని మార్కాండేయ పురాణం చెపుతుంది ఇప్పటి కలియుగం లో కొందరు మహర్షులు అదృశ్య రూపం లో కూడా తపస్సు చేస్తుంటారని భక్తుల నమ్మకం భక్తుల నమ్మకం .అద్బుతంగా 70 అడుగుల నుండి జాలువాలే జలపాత అందాలు,నల్లమల్ల అటవీ,మొగలి పొదలు,కొండల మధ్య ఉండే దత్తాత్రేయుని ఆలయం రమణీయంగా ఉంటుంది. ఆలయం లో గణేష్ విగ్రహం,శివలింగ రూపాలు,నాగ ప్రతిమలు ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతాయి,నాగు పాముల సంచారం ఈ ప్రాంతం లో ఎక్కువ కావున జంట నాగూ ప్రతిమ ఈ ఆలయ దిగువన ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎత్తిపోతల లో మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి ఘనంగా జరిపి గొప్ప తిరునాళ్ల ఉత్సవం చేస్తారు,వేలాది గా భక్తులు వచ్చి స్వామి వారి కృప పొందుతారు. ఎత్తిపోతల జలపాతం లో మొసళ్ళు కూడా మనకు కనిపిస్తు ఉంటాయి. మొసళ్లు ఆ ప్రాంతం లో తిరుగుతున్నను ఇంతవరకు ఏ భక్తునికి హాని జరగకుండా ఉండటం,అలాగే మొగలి పొదలు మధ్య ఎక్కువగా ఉండే సర్పాల వల్ల కూడా ఎవరికి ఇబ్బంది కలగకపోవటం దత్తాత్రేయుని మహిమగా భక్తులు చెపుతుంటారు. ఇంతటి మహిమాన్విత దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంతం లో స్వయంభూ గా వెలవటం మన క్షేత్రానికే గర్వకారణం. దత్తాత్రేయస్వామిని దర్శనానికి వచ్చే భక్తులు కోసం కొండ గుహల కింద చిన్న విరామ గృహాలు నిర్మించినను తగిన సౌకర్యాలు లేవు.పూర్తి స్తాయి సౌకర్యాలు ఈ ప్రాంతం లో కల్పిస్తే కొండలు,కోనలు,పచ్చని అటవీ,మొగలి పొదల సువాసనలు,జాలువారే తెల్లనిజలపాతం,ఆలయం ను తాకుతూ పక్కనుండే వెళ్లే పవిత్ర త్రివేణి సంగమం కలిగిన ఈ ప్రాంతం దేశం లో మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుంది.పర్యాటక శాఖ,ప్రభుత్వం ఈ దిశ గా చర్యలు చేపట్టాలని కోరుచున్నాం.
శ్రీ వేముల.