సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు,
గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు,
ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు.
దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు.
అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు
ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు.
ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి,
ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు..
1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.
2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు
"కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం
అభివృద్ధి చెందుతుందట.
3. ఇక మంచి విద్య రావాలన్నా,
చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ..
హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి.
అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.
4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.
5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు
"గోపాల స్తోత్రం " చదివితే మంచిదట.
అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.
6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి
మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.
7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట.ఆదిత్యయోగీ.
అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.
8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట..ఓం నమః శివాయ..*
.
#కేశవనామాల విశిష్టత.*
మనము ఏ శుభకార్యం చేయాలన్నా,
ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా,
ఏ యజ్ఞము చేయాలన్నా
సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ
కేశవాయనమః,,
నారాయణాయనమః,,
మాధవాయనమః
అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.
ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి?
దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.
ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే
ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.
ప్రీతితో కార్యము చేస్తాము.
1. ఓం కేశవాయనమః.
(శంఖం _చక్రం_గద_పద్మం)
బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,
నియామకుడూ అయినందువల్ల
శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.
ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న
మొదటి అక్షరానికీ,
ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న
మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,
ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన
అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,
శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,
మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.
2. ఓం నారాయణాయనమః.
(పద్మం_గద_చక్రం_శంఖం)
నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’
ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.
ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.ఆదిత్యయోగీ.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,
గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,
వృషభరాశికీ, పరమాన్నానికీ,
ప్రాతఃకాలానికీ నియామకుడు.
3. ఓం మాధవాయ నమః.
(చక్రం_శంఖం_పద్మం_గద)
మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,
రమాదేవికీ పతి అయినందువల్లా,
సర్వోత్తముడు అయినందువల్లా,
శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని
‘మో’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,
అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,
శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,
మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.
4. ఓం గోవిందాయ నమః.
(గద_పద్మం_శంఖం_చక్రం)
వేదాల మూలంగా పొందబడేవాడూ,
భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,
మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.
ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’
గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,
మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,
శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,
కర్కాటక రాశికీ, నేయికీ నియామకుడు.
5. ఓం విష్ణవే నమః.
(పద్మం_శంఖం_చక్రం_గద)
జ్ఞానానందాది సమస్త గుణాలతో,
దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.
ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,
సింహరాశికీ,పాలకూ నియామకుడు.
6.ఓం మధుసూదనాయ నమః. (శంఖం_పద్మం_గద_చక్రం)
మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు.
ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని వ’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని ‘రే’అన్న అక్షరానికీ,
త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,
శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,
కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.
ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు
7. ఓం త్రివిక్రమాయ నమః.
(గద_చక్రం_శంఖం_పద్మం)
మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,
సత్త్వాది మూడు గుణాలనూ,
భూరాది మూడు లోకాలనూ,
త్రివిధ జీవులనూ,
చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ
తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా
శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.
వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,
నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,
శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,
తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.
8. ఓం వామనాయ నమః.
(చక్రం_గద_పద్మం_శంఖం)
అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,
మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,
శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,
వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు.
9. ఓం శ్రీధరాయ నమః.
(చక్రం_గద_శంఖం_పద్మం)
శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా, పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,
ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,
శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,
ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.
10. ఓం హృషీకేశాయ నమః.
(చక్రం_పద్మం_శంఖం_గద)
ఇంద్రియ నియామకుడూ,
రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,
వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,
శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,
మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.
11. ఓం పద్మనాభాయ నమః.
(పద్మం_చక్రం_గద_శంఖం)
నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,
భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,
సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,
పాణితత్త్వానికీ, ఆశ్వయుజమాసానికీ,
శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,
కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.
12. ఓం దామోదరాయ నమః.
(శంఖం_గద_చక్రం_పద్మం)
యశోదచేత పొట్టకు బిగించబడిన తాడు గలవాడూ,
ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,
దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,
దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందు వల్ల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,
గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,
పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,
శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,
మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.
13. ఓం సంకర్షణాయ నమః.
(శంఖం_పద్మం_చక్రం_గద)
భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందు వల్ల శ్రీహరి ‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,
పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,
ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,
మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,
ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,
ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,
త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.
14. ఓం వాసుదేవాయ నమః.
(శంఖం_చక్రం_పద్మం_గద)
త్రిలోకాలకూ ఆవాసస్థానమైనవాడూ, సర్వాంతర్యామీ, సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,
యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,
వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,
ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,
పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.
15. ఓం ప్రద్యుమ్నాయ నమః.
(శంఖం_గద_పద్మం_చక్రం)
అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,
శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,
వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,
స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ, లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,
ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.
16. ఓం అనిరుద్ధాయ నమః.
(గద_శంఖం_పద్మం_చక్రం)
ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ, గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,
జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,
వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,
కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,
చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,
భోగ్యవస్తువులన్నింటికీ, అబ్దానికీ, నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ, గ్రీష్మఋతువుకూ నియామకుడు.
17. ఓంపురుషోత్తమాయనమః.
(పద్మం_శంఖం_గద_చక్రం)
దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.
ఏ విధమైన నాశనమూ లేని అప్రాకృత శరీరం గల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.
ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు
ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,
కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,
ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.
18. ఓం అధోక్షజాయ నమః.
(గద_శంఖం_చక్రం_పద్మం)
ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదుల వల్ల ప్రాదుర్భవించినవాడూ, నిత్యజ్ఞానస్వరూపుడూ,
అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,
రసతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిస్తనం మీద ధరించే నామానికీ, పాలకూ,పానకమూ,మజ్జిగకూ, పచ్చిపులుసుకూ, నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.
19. ఓం నారసింహాయ నమః.
(పద్మం_గద_శంఖం_చక్రం)
నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి‘నారసింహుడు’అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,
గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,
బూడిద గుమ్మడికాయ, నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,
ఈశాన్య దిక్కుకూ నియామకుడు.
20. ఓం అచ్యుతాయ నమః.
(పద్మం_చక్రం_శంఖం_గద)
శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,
సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.
ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ, ఆకాశతత్త్వానికీ, కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,
ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు.
21.ఓంజనార్థనాయనమః.
(చక్రం_శంఖం_గద_పద్మం)
సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,ఆదిత్యయోగీ.
మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ,
సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,
సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.
ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,
వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ, ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.
22.ఓంఉపేంద్రాయనమః.
(గద_చక్రం_పద్మం_శంఖం)
ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.
ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,
తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,
వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.
23. ఓంహరయేనమః.
(చక్రం_పద్మం_గద_శంఖం)
భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.
ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,
అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.
24. ఓంకృష్ణాయనమః.
(గద_పద్మం_చక్రం_శంఖం)
సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి.. కృష్ణుడు”అనబడుతున్నాడు.
ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,
పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ,
దైహిక కర్మకూ నియామకుడు.
ఓం..నమో...శ్రీవేంకటేశాయా..*
.
#తెలియకుండా చేసిన పాపాలకి శిక్ష.*
మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు.
కానీ తెలియకుండా కొన్ని,
తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం.
ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది.
మనం చేసే అన్ని తప్పులు (పాపాలు)
మూడిటితోనే చేస్తాం.
(1) కాయిక (శరీర గత);
(2) వాచిక (మాటతో); మరియు
(3) మానసిక (మనసుతో).
ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం.
ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు.
ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.
(1) కాయిక (శరీరగత) పాపములు:
మనుధర్మ శాస్త్ర ఆధారంగా…
శ్లోకం:
అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.
అర్థం:
అన్యాయముగా డబ్బు సంపాదించడం,
హింస చేయడం,
శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం,
పరస్త్రీ సంగమం..
ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.
అర్థము:
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం,
శరీరమును శుచిగా ఉంచడం,
పవిత్రమైన ఆచారములు,
డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం,ఆదిత్యయోగీ.
బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం),
ఇతరులను హింసించకుండా ఉండడం..
ఇవి శారీరిక తపస్సులు.
(2) వాచిక (మాటతో) పాపములు:
శ్లోకము:
పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ
వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.
అర్థం:
కఠినముగా మాట్లాడడం,
అబద్ధాలు చెప్పడం,
ఇతరులను నిందిస్తూ మాట్లాడడం,
వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం..
ఇవి వాక్కుతో చేసే తప్పులు.
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.
అర్థము:
ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం,
ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం,
వేద శాస్త్రములను పఠించడం,
పరమేశ్వరుని నామ జపం చేయడం..
ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.
(3) మానసిక పాపములు:
శ్లోకము:
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.
అర్థము:
ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన,
శరీర అభిమానము..
ఇవి మనసుకి సంబంధించిన పాపములు.
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.
అర్థము:
మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం,
శాంత భావం,
సదా భగవచ్చింతన చేసే స్వభావం,
మనోనిగ్రహం,
అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము..
ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి.
అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది.
ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాం.
సర్వే జనా సుఖినోభవంతు.....*
.

No comments:
Post a Comment