Tuesday, August 25, 2020

సంతానాన్ని ప్రసాదించే... గోవిందరాజస్వామి!. రోడ్డు మార్గంలో వచ్చేవారు వరంగల్‌ బస్టాండులో దిగితే అక్కడి నుంచి కళ్లెదుటే కనిపించే కొండపైకి కాలినడకన చేరుకోవచ్చు.

సంతానాన్ని ప్రసాదించే... గోవిందరాజస్వామి!

      ఎక్కడ నుంచి చూసినా ఆ కొండ, దానిపైన కట్టిన గోపురం కనిపించడం వరంగల్‌జిల్లాలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం ప్రత్యేకత. ఏడాదికోసారి రథోత్సవం పేరుతో కొండ దిగి కిందకొచ్చే స్వామి నగర వీధుల్లో తిరగడం... ఇక్కడి విశేషం. సంతానం ప్రసాదించే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్న ఈ దేవుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు.
గోవిందరాజస్వామి గుట్టగా గుర్తింపు పొందిన కొండపైన వెలసిన ఈ స్వామి తిరుపతి కొండల్లో కొలువైన గోవిందరాజ స్వామిని పోలినట్లుగా కనిపిస్తాడు.
కాకతీయులు ఎక్కువగా శివాలయాలను కట్టించినా వారికంటే ముందే ఈ ఆలయం ఓరుగల్లులో ఉండటంతో అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన జైనులే ఈ గుడి కట్టించారని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా జరిగే విశేష పూజలూ, అర్చనలతో ఈ ఆలయం నిత్యం కళకళలాడుతుంటుంది.

స్థలపురాణం...
ఒకప్పుడు వరంగల్‌లో వర్షాలు లేక కరవు కాటకాలు రావడంతో ఆ సమస్యలన్నీ తీరి... ప్రజలు మళ్లీ ఆనందంగా ఉండాలని భావించిన అప్పటి జైన మునులు వర్షాలు పడాలని ఈ గుట్టపైన తపస్సు చేశారట. కొన్నాళ్లకు వాళ్లకు ఆ గుట్టపైన ఉన్న రెండు భారీ రాతి కొండల మధ్య కుంచంపై తలవాల్చినట్లుగా గోవిందరాజస్వామి కనిపించాడని చెబుతారు. ఆ తరువాత అక్కడ విస్తారంగా వర్షాలు కురిశాయనీ అంటారు. దాన్ని గుర్తించిన జైనులు అక్కడే ఆలయాన్ని నిర్మించారట. ఆ గుట్టపైన ప్రస్తుతం శయన భంగిమలో ఉన్న స్వామితోపాటు ఆదిశేషుడు, నారదుడు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి కూడా కనిపిస్తారు. ఈ గుడి కట్టించిన కొన్నాళ్లకు వరంగల్‌లో ప్లేగు, కలరా వ్యాధులు
విపరీతంగా ప్రబలడంతో అక్కడి ప్రజలు ఇళ్లు విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట. అది చూసిన ఓ భక్తుడు గుట్టపైకి వెళ్లి స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆ జలాన్ని గుట్టపై నుంచే కింద ఉన్న ఇళ్లపైన చల్లాడట. తరువాత ఆ వ్యాధులు పూర్తిగా పోయి... భక్తులు వలస వెళ్లడం మానేశారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ స్వామికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అప్పటి నిజాం ప్రభువు సైతం పూలు పంపించేవారని ఆలయ ఆర్చకులు చెబుతారు.

రథోత్సవం...
ఈ స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రధానంగా సంతానం లేనివారు పిల్లలు పుట్టాలని కోరుతూ ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ స్వామిని నిష్ఠగా పూజిస్తే సంతానభాగ్యంతోపాటూ అష్టైశ్వర్యాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇలా తమ కోరికలు తీరిన భక్తులు కొండపైన ఆలయానికి చేరుకోవడానికి మెట్లు కట్టించారని చెబుతారు. భక్తుల కోర్కెలు తీర్చే ఈ స్వామికి ధనుర్మాసంలో ప్రతిరోజూ విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత మకర సంక్రాంతి రోజున గోదాదేవి -రంగనాయకుల కల్యాణాన్నీ ప్రత్యేకంగా చేస్తారు. అలాగే నవరాత్రుల సమయంలోనూ జరిగే ప్రత్యేక పూజలు చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం, గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో రథోత్సవం పేరుతో నగరంలోని వీధుల్లో మేళతాళాల మధ్య స్వామి విగ్రహాన్ని ఊరేగిస్తారు. అలా కొండ దిగే స్వామి వరంగల్‌ వీధులన్నీ తిరిగి... నాలుగు రోజుల తరువాత మళ్లీ ఆలయానికి చేరుకుంటాడు. దాంతో పాటు నిర్వహించే గిరి ప్రదర్శనలో భాగంగా గుడి చుట్టూ ఆ రథం తిరగడం ఓ విశేషంగా జరుగుతుంది. వీటన్నింటితోపాటూ కార్తిక మాసంలో గుట్టపైన ఏర్పాటుచేసే సహస్ర దీపోత్సవాన్నీ ఆకాశదీపాన్నీ చూసేందుకు రెండుకళ్లూ చాలవు.


ఎలా చేరుకోవచ్చంటే...
ఈ ఆలయం రైల్వేస్టేషన్‌కూ, బస్టాండుకూ ఎదురుగానే ఉంటుంది. రైలు మార్గంలో చేరుకోవాలంటే హైదరాబాద్‌తోపాటూ విజయవాడ, చెన్నై, దిల్లీల నుంచి వరంగల్‌కు వెళ్ళొచ్చు. రోడ్డు మార్గంలో వచ్చేవారు వరంగల్‌ బస్టాండులో దిగితే అక్కడి నుంచి కళ్లెదుటే కనిపించే కొండపైకి కాలినడకన చేరుకోవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS