దీపావళి--(ధన త్రయోదశి) ఎలా జరుపుకోవాలి?..ఎలా పూజించాలి?..
దీపావళి పండుగని 5 రోజులు జరుపుకుంటారు. దీపావళికి 2 రోజులు ముందు ధన త్రయోదశి-- నరక చతుర్దశి-- దీపావళి-- బలి పాడ్యమి-- యమ ద్వితీయ-- గా 5 రోజుల పండగ జరుపుకుంటారు. ముఖ్యమైన మొదటి రోజు పండగ ధన త్రయోదశి. ఈరోజు అందరూ కుబేరుడికి (చిత్ర పటం లేదా కుబేర యంత్రం) అష్టోత్తరంతో పూజ చేస్తారు. (మోహన్ పబ్లికేషన్స్ వారి 'లక్ష్మీకుబేర వ్రతం' అనే పుస్తకంలో కుబేరుడు పూజ అష్టోత్తరం ఉంటాయి) కుబేర యంత్రాన్ని పూజిస్తే, అక్షయ సంపదలు కలుగుతాయి. ఈ పండుగనాడు ఇతరులకు రుణాలు ఇవ్వకపోవడం, వృధా ఖర్చులు చేయకపోవటం సాంప్రదాయంగా భావిస్తారు. ధన త్రయోదశిని ధన్ తేరస్... యమ త్రయోదశి... ధన్వంతరి త్రయోదశి... అని కూడా పిలుస్తారు.
ధన త్రయోదశి (ధన్ తేరస్):- ఈ రోజు చాలామంది బంగారాన్ని, వెండిని, రాగిని, పంచలోహ పాత్రలను కొనుగోలు చేస్తారు. అమేధా జ్యోతిష్య గ్రంథంలో ధన త్రయోదశి అంటారు. శనివారం త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటారు. దీపావళి 2 రోజుల ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. త్రయోదశి అంటే 13 సంఖ్య. ఈ సంఖ్యని అందరూ ఇష్టపడరు(పాశ్చాత్యులు కూడా) కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వాళ్లకి 13 సంఖ్యని మంచి సంఖ్యగా భావిస్తారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు "గోత్రి-- ధాత్రి" వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం "చతుర్వర్గ చింతామణి పుస్తకం"లో ఉంటుంది. దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది (మనకు ఉగాది పండుగ లాగా..) పండుగ. మన సంవత్సరాదిని చైత్రమాసం నుండి జరుపుకుంటాం. గుజరాత్ లో దీపావళి నుండి కొత్త సంవత్సరాది జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజు ఉదయాన్నే లేచి స్నానమాచరించి, ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను పాలతో కడిగి శుద్ధి చేస్తారు. మాళవ దేశంలో ఈరోజు వర్తకులు లెక్కలు (ఖర్చు-- జమ) చూసుకుంటారు. శ్రీహరి బలిచక్రవర్తిని 3 అడుగుల నేలని అడిగిన రోజు కూడా ఇదే. ధన త్రయోదశి నాడు శ్రీహరి బలిని 3 అడుగుల నేలని అడిగితే వెంటనే బలిచక్రవర్తి దానం చేస్తాడు. శ్రీహరి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడవ అడుగు బలి తలపై ఉంచి పాతాళానికి తొక్కేస్తాడు. అప్పుడు బలి చక్రవర్తి "నేను ఎప్పుడైనా భూలోక సందర్శనానికి వచ్చినప్పుడు లక్ష్మి శోభితంగా ఉండాలని వరం కోరాడు. లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా ఉంటుందని లక్ష్మీపతి వరమిచ్చాడు. అశ్వనీ నక్షత్రంతో కూడిన (పౌర్ణమి) ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ మాసంలో వచ్చే చివరి 2వ రోజున ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ పండుగను ఉత్తరాది వారు ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించి, గోక్షీర పాయసాన్ని (ఆవు పాలతో చేసిన పాయసం) అమ్మవారికి నివేదన చేసి, ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, ఎరుపు-- పసుపు రంగు పుష్పాలు, వస్త్రాలు సమర్పించి, ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ అమ్మవారికి అలంకరిస్తే, ఎంతో ఆనందించి సంవత్సరమంతా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈరోజు మధ్యప్రదేశ్ లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నడుచుకుంటూ ఇంటికి వస్తుందని భావించి, ఒక గదిలో ఆవునేతితో దీపాన్నుంచి, ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టి, కొంతసేపటి తర్వాత లక్ష్మీదేవి వచ్చినట్లుగా భావించి, తలుపులు మూస్తారు. ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి అక్కడే ఉండి పోతుందని వారి విశ్వాసం. పాయసంతో పాటు పులిహోర, పులగం కూడా నైవేద్యంగా పెడతారు. లక్ష్మీదేవి సంఖ్య 8 కనుక, 8 మంది ముత్తయిదువలని పిలిచి వారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో పాటు పెరుగన్నాన్ని ఇస్తారు. అంతేకాదు ఈరోజు శ్రీహరి లక్ష్మీదేవిని అధిష్టాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషేకం చేశారు. సకలైశ్వర్యాలు, సిరలు ప్రసాదించే ధనలక్ష్మి దేవిని ధన త్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజించాలి... (ధన త్రయోదశి ఉత్తరాది పండుగ అయినా ఇప్పుడు ఈ పండగ దేశమంతా వ్యాపించింది..)
యమ త్రయోదశి:- ధన త్రయోదశికి యమ త్రయోదశి అని కూడా పేరు. పూర్వం హిమవంతుడు అనే రాజుకి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. పుట్టిన వెంటనే జాతకాన్ని చూసిన జ్యోతిష్కులు, వీరికి వివాహ దోషం ఉంది, వివాహమైన 4వ రోజున ఖచ్చితంగా మరణిస్తాడు అని చెబుతారు. ఆ విషయం తెలిసి కూడా రాజు కుమారుడికి వివాహం చేస్తాడు. వివాహం జరిగిన వెంటనే తన కుమారుడికి ఉన్న దోషాన్ని యువరాణికి (పెండ్లి కుమార్తెకు) చెప్తాడు. ఈ విషయం తెలిసిన యువరాణి తమ పెళ్ళి జరిగిన 4వ రోజు (ఆరోజు ధనత్రయోదశి) రాత్రి భవంతి నిండా దీపాలు వెలిగించి, ఆ దీప కాంతుల మధ్య బంగారం, వెండి... అక్కడక్కడ రాసులుగా పోయిస్తుంది. యమధర్మరాజు మృత్యుపాశం సర్పరూపంలో రాజభవనంలోకి ప్రవేశించగానే, ఆ దీపపు కాంతులకి బంగారం, వెండి రాశుల వెలుగుకి కళ్లు చెదిరిపోతాయి. అంతేకాదు మరొక ప్రక్క భగవన్నామ కథా సంకీర్తనలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటే, ఇవన్నీ చూస్తూ మైమరచి వచ్చిన పని మర్చిపోతుంది. తెల్లవారిపోతుంది,మృత్యు ఘడియలు దాటిపోతాయి. మృత్యుదోషం తొలగిపోతుంది. ఆ విధంగా యువరాణి దీపాలు, బంగారు--వెండి రాశుల కాంతిలో, భగవన్నామ సంకీర్తనతో, భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. దానికి సూచికగా స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా ధన త్రయోదశిని భావిస్తారు. ఈ రోజు నుండి ఇంటి ముందు దీపాలు వెలిగించి, కార్తీకమాసం అంతా కూడా వెలిగిస్తారు. యమలోకంలో పితృదేవతలు తమ పూర్వ గృహాలకు వస్తారనే నమ్మకం. అందుకే ఇంటి ముందు దక్షిణ దిక్కుగా ఒక దీపాన్ని పెడతారు. తల్లిదండ్రులు లేనివారు, రోడ్డుమీద దక్షిణ దిక్కుకి దీపాన్ని పెడతారు. అపమృత్యు దోష నివారణార్థం దీపాన్ని వెలిగించి, గంధ-- పుష్ప-- అక్షింతలతో అర్చిస్తారు. (దీనినే యమ దీపం అంటారు) సాయంకాలం ఇంటిముందు దక్షిణ దిక్కగా అన్నపురాశిపై ఈ దీపాన్ని ఉంచుతారు.
ధన్వంతరి త్రయోదశి:- క్షీరసాగర మధనం నుండి ధన్వంతరి (జలుడు) అమృత కలశంతో జన్మించాడు. ఈయన ఆరోగ్య ప్రదాత. ఔషధాలను ఇస్తాడు. ఔషదాలలో స్వర్ణమయ భస్మానికి ఎంతో విశిష్టత ఉంది. దీనిని సేవించిన వారికి పూర్తి ఆరోగ్యం ఉంటుంది. ధన త్రయోదశి నాడు బంగారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ త్రయోదశిని ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు. కేరళ, వారణాసి, తమిళనాడు, శ్రీరంగం, కంచిలో ధన్వంతరి విగ్రహాలున్నాయి. ఆ ఆలయాల్లో ఈరోజు విశేషంగా పూజలు, ఆరాధనలు చేస్తారు..
Tuesday, November 10, 2020
దీపావళి--(ధన త్రయోదశి) ఎలా జరుపుకోవాలి?..ఎలా పూజించాలి?..
Subscribe to:
Post Comments (Atom)
RECENT POST
నవ విధ శాంతులు
నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...
POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...
No comments:
Post a Comment