Tuesday, November 10, 2020

దీపావళి--- (నరక చతుర్దశి).. ఏలా జరుపుకోవాలి? ఎలా పూజించాలి?..

 దీపావళి--- (నరక చతుర్దశి).. ఏలా జరుపుకోవాలి?  ఎలా పూజించాలి?..


   ఒక రాక్షసుడి మరణాన్ని పండగ చేసుకోవడమే నరకచతుర్దశి యొక్క విశిష్టత.   దీపావళి పండుగ  జరుపుకునే 5 రోజుల పండుగని "పంచపర్వాలు" అంటారు.   నరక చతుర్దశి రోజున నువ్వులనూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి.   నువ్వుల నూనెలో లక్ష్మి ఉంటుంది, మంచినీటిలో గంగాదేవి ఉంటుంది.   పూర్వకాలంలో మన పెద్దలు నూనె రాసుకొని తలారా స్నానం చేసేవారు.   కాలక్రమేణా ఈ ఆచారాలు కనుమరుగవుతున్నాయి.   ఈరోజు అభ్యంగన స్నానం చేసి, దీపదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.   నరకచతుర్దశి రోజు యమతర్పణం చేసిన వారికి నరకప్రాప్తి ఉండదు.   దీనినే "ప్రేత చతుర్దశి" అని కూడా అంటారు.   ఈ విధానం "వ్రత చూడామణి" అనే గ్రంథంలో ఉంది.  గుజరాతీయులు ఈ పండుగను కాలా చతుర్థశని, కాలా చౌదేశ్ (అంధకార చతుర్దశి) అని అంటారు.  నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన రోజు కనుక నరకచతుర్దశి అన్నారు.   నరకం నుండి ఉద్దరించేది కనుక నరక చతుర్దశి అని శాస్త్ర వచనం.   ఈరోజు అభ్యంగన స్నానం చేసి యముడికి తర్పణాలు ఇవ్వాలి. తర్పణం చేసేటప్పుడు ఉత్తరేణి ఆకగాని, నాగలి దున్నిన మట్టిగడ్డగాని, ఆముదం చెట్టు కొమ్మనుగానీ తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని పారేయాలి.   దానివల్ల అపమృత్యు దోషం నివారణ పోతుంది.   ఈరోజు ప్రదోష వేళ (సాయంత్రం) దీపదానం చేయాలి.   చతుర్దశి అనేది 14 సంఖ్య కాబట్టి, ఇంటి ముందర 14 దీపాలు వెలిగించి, 14 నామాలతో యమధర్మరాజుని పూజించాలి.   దక్షిణాభిముఖంగా కూర్చోని "యమధర్మరాజా తర్పయామి!!" అంటూ 3 సార్లు, "యమాయనమః తర్పయామి!!" అంటూ 3 సార్లు నువ్వులతో యముడికి తర్పణం ఇవ్వటం ఆచారం.  మినుములతో చేసిన పదార్థాలను తినటంతో పాటు, సూర్యాస్తమయ సమయంలో ముంగిట్లో దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు.  పూర్వం కాగడాలు వెలిగించేవారు.   కాగడాలు వెలిగించడంలో ఉద్దేశం ఏమంటే?  పిడుగుపాటు వల్లగాని, అగ్ని ప్రమాదం వల్లగాని చనిపోతే వారందరికీ ఉత్తమగతి లభించడానికి కాగడాలు వెలిగిస్తారు.   కాగడాలు వెలిగించి దానిని పట్టుకొని గ్రామం చుట్టూ తిరిగేవారు.   ఇప్పుడు ఆ అవకాశం లేదు కనుక, బాణాసంచాని వెలుగుల రూపంలో పంపిస్తున్నాం.   దానివలన పితృదేవతలకు ఉత్తమ లోకాలకి మంచి మార్గం లభిస్తుందని భావిస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాటి రాత్రి రెండవ జాములో నరక సంహారం జరిగింది.   కాబట్టి మూడవ జాములో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయం ఉండదని శాస్త్ర వచనం.   నరక చతుర్దశి నాడు దీపదానం చేస్తే,  వారివారి పితృదేవతలందరికీ స్వర్గప్రాప్తి కలుగుతుంది.  అంతేకాదు ఈరోజు దేవాలయాల్లోనూ, ఉద్యానవనాల్లోను వందల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. 

      నరక చతుర్దశి గురించి ఒక కథ ఉంది.  కృతయుగంలో హిరణ్యాక్షుని వధించడానికి విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతరించి,  భూదేవిని అసురుడైన హిరణ్యాక్షుని నుండి కాపాడాడు.   అసుర సంధ్యవేళలో వరాహస్వామికి,  భూదేవికి నరకుడు జన్మించాడు.  భూదేవిక పుట్టిన నరకాసురుడు ఎంతోమందిని హింసించాడు.   16 వేల మంది రాచకన్యలను చెరపట్టాడు.   సాధుజనులను హింసించాడు.   ఒకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరట్టాడు.   విష్ణుద్వేషై దేవతలను హింసించాడు.  దేవమాత అదితి కర్ణాభరణాలు,  వరుణ ఛత్రాన్ని అపహరిస్తే,  శ్రీకృష్ణుడు ద్వంద్వయుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అదితికి అందజేశారు.   తర్వాత నరకాసురుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, తన తల్లి ద్వారా తప్ప మరెవ్వరి ద్వారా మరణం లేకుండా వరం పొంది లోక కంటకుడయ్యాడు. ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు.   నరకాసుర సంహారం సమయంలో నరకుడు వదిలిన బాణం, శ్రీకృష్ణుడికి తగిలి కొద్దిసేపు మూర్ఛిల్లిపోతాడు.   అది చూసి సత్యభామ క్రోధంతో,  నరకాసురునిపై యుద్ధం చేసి వధించింది.  నరకాసురుడు తన కుమారుడే! అని తెలుసుకుని కుమారుడి పేరు శాశ్వతంగా ఉండాలని శ్రీకృష్ణుని ప్రార్ధించింది.   అప్పుడు శ్రీహరి ఆ రోజు నరక చతుర్దశి పర్వదినంగా ప్రకటించారు.  16వేలమంది రాజకన్యలు, సాధుజనులు నరకుడి చెరనుండి విడిపించబడ్డారు కాబట్టి, ధర్మం రక్షించబడింది కనుక పండుగ జరుపుకున్నారు.  నరకుడి బాధ నుండి విముక్తి దొరికినందుకు మరుసటి రోజున కూడా, పండగ జరుపుకున్నారు.  ఆరోజు అమావాస్య కనుక దీపాలు వెలిగించి, చీకటిని పారద్రోలటం ద్వారా దీపావళి జరుపుకున్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS