రాయగడ మజ్జిగౌరీ దేవీ అమ్మవారు... ఒరిస్సా
పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకున్నాడు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల 'మజ్జిగరియాణి'(మధ్య గదిలో వెలసిన తల్లి)గా పేరొచ్చింది. తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడంవల్ల మజ్జిగరియాణి కాస్తా మజ్జిగౌరమ్మగా మారిపోయింది.
కళింగ చారిత్రక కథనం ప్రకారం... 1538 లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని హతమారుస్తాడు. ఆయన మృతితో 108 మంది రాణులూ అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఆ ప్రదేశం ప్రస్తుత మందిరం పక్కనే ఉంది. దీన్నే 'సతికుండం' అంటారు. రాజు మరణం తరువాత అమ్మవారి ఆలనా పాలనా చూసేవారే కరవయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో ఆలయ వైభవం మరుగునపడిపోయింది. 1930లో బ్రిటిష్‌వారు విజయనగరం నుంచి రాయ్‌పూర్ వరకూ రైల్వేలైను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే, రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంఝావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సగంలో ఉండగానే... మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కలలో కనిపించి, 'నాకు ఆలయం నిర్మిస్తేనే... వంతెన నిలబడుతుంది' అని సెలవిచ్చింది. ఆప్రకారం, జంఝావతి సమీపంలో ఆలయంను నిర్మించారు.
No comments:
Post a Comment