Tuesday, November 10, 2020

శ్రీ మూలాంకురేశ్వరీ దేవి-- అమీనాబాద్-- గుంటూరు జిల్లా: (పెళ్ళికాని యువతీ,యువకులు ఇక్కడికి వచ్చి 9వారాలపాటు శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయించుకుంటే వివాహం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం... అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి మంగళ, శుక్ర, ఆదివారాలలో కుంకుమార్చన చేయించుకుంటారు..


శ్రీ మూలాంకురేశ్వరీ దేవి-- అమీనాబాద్-- గుంటూరు జిల్లా:


     ఈ ఆలయం గుంటూరు నుండి నరసరావుపేట వెళ్లే మార్గంలో,  గుంటూరు నుండి 18 కి.మీ ప్రయాణం చేసి, ఎడమ వైపు రోడ్డులో 1 కి.మీ ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.   పచ్చని ప్రకృతి మధ్య శ్రీ మూలాంకురేశ్వరీ దేవి అందమైన చిన్నకొండ.  శ్రీ మూలాంకురేశ్వరి దేవి కొలువైన అమీనాబాద్ ను 'ములుగురు' అని పిలుస్తారు.    ఈ ఆలయాన్ని 13-14 శతాబ్దాల మధ్యకాలంలో కొండవీటిని పాలించిన అనవేమారెడ్డి నిర్మించినట్లుగా,  జారుడుబండ శిలా శాసనం ద్వారా తెలుస్తోంది.   యుద్ధంలో తనకు చేకూరిన విజయానికి చిహ్నంగా అమీనాబాద్ లో కొండమీద ఈ ఆలయాన్ని నిర్మించాడు.   1415వ సం:లో కొండవీటి రాజులలో చివరివాడైన రాచవేముని కాలంలో నిర్మించబడిన సంతాన సాగరం (ఇప్పటి మల్కాచెరువు) కొండకు సమీపంలోనే ఉంది.  ఆది పరాశక్తే ఈ  మూలాంకురేశ్వరి దేవి.   ఈ తల్లి రెడ్డి రాజుల కులదైవం. ఈ ఆలయాన్ని కట్టించినప్పుడు అనవేమారెడ్డి నిత్య ధూప- దీప- నైవేద్యాల కోసం 5 గ్రామాల పంటభూమిని దానంగా ఇచ్చారట. కాలక్రమంలో ఆలయ పంట భూములన్నీ హరించుకుపోగా,  అమ్మవారికి నిత్య ధూప- దీప- నైవేద్యాలు కరువయ్యాయి.   అటువంటి సమయంలో శ్రీ శంకరమంచి రాఘవయ్య గారి కుమారుడు,  శ్రీ శంకరమంచి రాధాకృష్ణ మూర్తి గారు ఆలయ అర్చక బాధ్యతలు స్వీకరించారు.   ఆలయ ట్రస్టు చైర్మన్ గా శ్రీ పెద్ది అక్కయ్యగారు నియమితులయ్యారు.   సుమారు 40 సం:ల నుండి వీరే ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు.   'అనినుల్ ముల్క్'అనే గవర్నరు తన పేరుమీద ఉన్న ఈ గ్రామం పేరుని అమీనాబాద్ గా మార్చారట.  ఈ గ్రామంలో అధిక జనాభా ముస్లింలే అయినా,  వారంతా అమ్మవారిపై విశ్వాసంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారు.  

        ఈ దేవాలయం గురించి ఇక్కడి స్థానికులు చెప్పే కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది.   రుక్మిణి కళ్యాణం గురించి మనందరికీ తెలుసు!!  రుక్మిణీ కల్యాణానికి ముందు అమ్మవారి గుడికి వెళ్లడం,  అక్కడ నుండి శ్రీకృష్ణుడు ఆమెని రథం మీద తీసుకుని వెళ్లడం,  రుక్మిణి సోదరుడు  రుక్మి అడ్డగించడం ఇవన్నీ ఎక్కడ జరిగాయని! అంటారు.  తమ కులదేవత అయిన ఈ అమ్మవారిని పూజించిన రుక్మిణిని,  శ్రీకృష్ణుడు రథం మీద తీసుకు వెళుతుంటే డోకిపర్రు దగ్గర రుక్మిణి సోదరుడు అడ్డుకున్నారని, శ్రీ కృష్ణుడు వారికి శిరోముండనం (గుండు) చేసి తర్వాత రుక్మిణిని వివాహమాడాడని ఇక్కడి కథనం. (పెళ్ళికాని యువతీ,యువకులు ఇక్కడికి వచ్చి 9వారాలపాటు శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయించుకుంటే వివాహం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం... అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి మంగళ, శుక్ర, ఆదివారాలలో కుంకుమార్చన చేయించుకుంటారు..) అంతేకాదు 2001లో జరిగిన ఒక సంఘటనతో ఇక్కడ భక్తులకు అమ్మవారి మీద మరింత నమ్మకం పెరిగింది.   ఆ సంవత్సరం దసరా ఉత్సవాలలో 14 సం:ల అమ్మాయి పొరపాటున యజ్ఞ మంటపం నుంచి జారి,  80 అడుగుల క్రింద ఉన్న బండమీద పడింది.   అంత ఎత్తు నుండి పడ్డా ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాలేదు.   అమ్మ దయ వల్లనే ఆ అమ్మాయికి ఏమీ జరగలేదని గ్రామస్తులు విశ్వాసం.

         గ్రామానికి ముందుగా కొండపై ఉన్న ఈ ఆలయం, ఇక్కడికి వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా!! నిర్మించడం అప్పటి వాస్తు ప్రావీణ్యానికి ఒక ఉదాహరణ. చూపరులను ఆకట్టుకునే యజ్ఞమంటపం ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మితమైంది.  అప్పటి రాజులు ఈ మంటపంలోనే ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు. ఇప్పటికీ ఈ మండపంలో యజ్ఞాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.   ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునే మార్గమధ్యంలో,  తొలి పూజలందుకునే వినాయక మందిరం ఉంటుంది.   సర్వశుభంకరుడైన ఆ స్వామిని దర్శించి అమ్మ దర్శనానికి చేరుకోవచ్చు.   గర్భగుడిలో భక్తులకు దర్శనమిచ్చే ఆ తల్లి సర్వాభరణ భూషితురాలై దేదీప్యమానంగా కాంతులీనుతూ దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం స్వర్ణ కిరీటంతో, పెద్ద పెద్ద కళ్ళతో, ముక్కుకు పెద్ద అడ్డబాసరతో, నుదుట కుంకుమ, మెడలో రత్నాభరణాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.   అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో శూలం ధరించి దర్శనమిస్తుంది.   ఆ తల్లి ముందర "శ్రీ చక్ర మేరువు"ను కూడా దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో అమ్మవారి పాదాల మంటపం కనిపిస్తుంది.   కొండమీద అమ్మవారి ఆలయానికి సమీపంలో శివాలయం ఉంది.  ఆ మహేశ్వరుడికి దర్శనం వల్ల మానసిక శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం.   ఈ అమ్మవారికి ఆలయ సమీపంలోనే శ్రీ పోలేరమ్మ అమ్మవారి సన్నిధి ఉంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో పోలేరమ్మ తల్లి శిలారూపంలో,  సమస్త భాగ్యప్రదాతగా దర్శనమిస్తుంది. పసుపు వర్ణంతో,  నుదుట సింధూరంతో దేదీప్యమానంగా ఉంటుంది.   పోలేరమ్మ అమ్మవారి ముందు భాగంలో రెండు జతల పాదాలు దర్శనమిస్తాయి.   వీటిని అమ్మవారి పాదాలుగా భక్తులు భావిస్తారు.  ఆలయానికి మరో భాగంలో నాగేంద్రుని పుట్ట (సుబ్రహ్మణ్యస్వామి స్వామి) ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి,  ఆలయ ప్రాంగణంలోనే వున్న వేప, రావిచెట్లుని దర్శించి, పూజించి, ప్రదక్షణలు చేసిన మహిళా భక్తులకు సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.   ఆలయ ప్రాంగణంలో మరొక ప్రక్క వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నారు.   సమీపంలోనే నవగ్రహాలను దర్శించుకోవచ్చు.   భక్తులు పరిహారాలలో భాగంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. ఇక్కడ అయ్యప్పస్వామి ఆలయం కూడా ఉంది. హరిహర సుతుడైన ఆ స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోతారు.   ఈ ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి.   అభీష్ట ఫలదాయిని అయిన శ్రీ మూలాంకురేశ్వరి దేవి తనను దర్శించి, శరణు వేడిన భక్తుల మొర ఆలకించి,  వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.   ఈ తల్లి దర్శనం సర్వమంగళ కరం, సర్వసిద్ధి ప్రదాయకం.   కాబట్టి ఈ తల్లిని దర్శించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు, సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు పొందాలని ఆశిస్తూ....

           శ్రీ మాత్రే నమః🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS