Tuesday, November 10, 2020

శ్రీ గంగా పార్వతీ సమేత జలపాలేశ్వరస్వామి వారి దేవస్థానం.... వేములూరిపాడు:

 శ్రీ గంగా పార్వతీ సమేత జలపాలేశ్వరస్వామి వారి దేవస్థానం.... వేములూరిపాడు:


       శ్రీ గంగా పార్వతీ సమేత జలపాలేశ్వరస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది.   గుంటూరు నుండి నరసరావుపేట వెళ్ళే మార్గంలో,  మెయిన్ రోడ్డు ప్రక్కనే ఈ ఆలయం ఉంటుంది.   అమీనాబాద్ కొండమీద ఉన్న మూలాంకురేశ్వరీదేవి అమ్మవారికి దగ్గరలో (కాలి నడకన చేరుకునేంత దగ్గరలో..) ఈ దేవాలయం ఉంటుంది.  ఈ ఆలయానికి చైర్మన్ బీమనాథుని అంకమ్మరావుగారు. ఈ దేవాలయానికి అర్చకత్వం చేస్తున్న ఉమాపతి గారు 20 సం:ల నుండి స్వామివారి సేవలో తరిస్తున్నారు.  కార్తీకమాసంలో అర్చకులు ఉమాపతిగారి ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు,  అర్చనలు విశేషంగా జరుగుతాయి.    ఈ శివాలయానికి ఒక విశిష్టత ఉంది.   పూర్వకాలంలో కొండవీటి రెడ్డి రాజులు ఈ గ్రామాన్ని పరిపాలించేవారు. వారు అమరావతి ప్రయాణించే క్రమంలో, సైన్య పరివారంతో రాత్రిళ్ళు ఇక్కడ విశ్రాంతి కోసం బస చేసేవారు.  వారికి దాహం వేస్తే తాగటానికి మంచినీరు దొరకలేదు.  మంచినీటి కోసం ఎన్నో బావులు తవ్వారు. అయినా మంచినీరు పడలేదు.   గంగాదేవి శివుని శిరస్సుపై ఉంటుంది కనుక,  ఆ గంగాదేవిని ప్రార్థించి, పరమేశ్వరుడి అనుగ్రహంతో,  ఈ ప్రదేశంలో బావిని తవ్వగా మంచినీళ్ళు పడ్డాయి.   మంచినీళ్లు పడ్డ సందర్భంగా,  "శ్రీ జలపాలేశ్వరస్వామి" అని నామకరణ తోటి స్వామివారిని ప్రతిష్టించారు.   అక్కడ జలం ఉద్భవించింది కనుక,  ఆ స్వామి మనల్ని పరిపాలించేవాడు కనుక, " జలపాలేశ్వరస్వామి" అన్న పేరుతో ఇక్కడ వెలిశారు.   అప్పటినుండి స్వామివారికి నిత్యపూజా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి.  దేవస్థానం ముందు గణపతి ఉపాలయం కనిపిస్తుంది.   ఎదురుగా ఎలుక వాహనం తోటి గణపతిని దర్శించుకోవచ్చు.   పక్కనే మంచినీటి బావి కనిపిస్తుంది.   ఈ బావిలోని నీటితోనే స్వామివారికి అర్చనలు,  అభిషేకాలు నిర్వహిస్తారు.   ముఖద్వారం నుంచి లోపలికి వెళితే,  ఎదురుగా పురాతనమైన చక్కని శివపార్వతుల మూర్తితో ధ్వజస్తంభం కనిపిస్తుంది.   ఈశాన్య భాగంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిపే ముఖమండపం కనిపిస్తుంది.   పక్కనే నవగ్రహాలు దర్శనమిస్తాయి.   ధ్వజస్తంభం ఎదురుగా ఆలయంలోకి వెళ్ళేమార్గంలో ఒకపక్క భద్రకాళి అమ్మవారు కనిపిస్తుంది.  స్వామివారికి ఎదురుగా రెండు నందులు కనిపిస్తాయి.   (శివాలయంలో ఎక్కడైనా ఒక్కటే నంది ఉంటుంది...) దీనికి ఒక కారణం ఉంది.   పూర్వకాలంలో ఈ గ్రామంలో గర్భిణీ స్త్రీలు ప్రసవవేదనతో ఇబ్బంది పడుతుంటే,  శివుని దృష్టి పడకుండా నందిని పక్కకు తిప్పేవాళ్ళు.   సుఖప్రసవం జరిగాక తిరిగి నందిని యథాస్థానానికి తిప్పేవాళ్ళు.   (శ్రీశైలంలో నందిని తిప్పినట్లుగా...).  గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఒకేసారి ప్రసవానికి వస్తే ఇబ్బందని రెండు నందులను ప్రతిష్టించారు.   ఇది ఒక విశేషమైన సాంప్రదాయం.  ఆ రెండు నందులను దర్శించి, ముందుకి వెళితే స్వామిని తదేకంగా చూస్తూ ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆలయం లోపలికి వెళితే గర్భాలయంలోని స్వామివారి ఎదురుగా నందీశ్వరుడు,  ఒకపక్క గణపతి (గణపతి విగ్రహం ప్రత్యేకమైన రంగుతో ఉంటుంది.. ఈ శిల చాలా విశేషకరమైనది..) దర్శనమిస్తారు.   గర్భాలయంలో  "జలపాలేశ్వరస్వామి" వారి దర్శనం జరుగుతుంది.   స్వామి వెనుక ఉత్సవ విగ్రహాలు,  అమ్మవారు, అయ్యప్పస్వామి విగ్రహం దర్శనమిస్తుంది.   పక్కనే అమ్మవారు పార్వతిదేవి,  దుర్గాదేవి, పార్వతీదేవికి ఎదురుగా "శ్రీ చక్రమేరువు" దర్శనమిస్తుంది.   ఆలయం లోపల ఒక ప్రక్క షిరిడి సాయిబాబా విగ్రహం దర్శించుకోవచ్చు.  "హే!పరమేశ్వర దీనదయాళో, సాయినాథ గురుదేవ కృపాళో!   రక్ష రక్ష జగదీశ్వర సాయి, ఆర్తత్రాణ పరాయణ సాయి!!..."అని ప్రార్థిస్తూ, సాయినాథుని దర్శించుకోవచ్చు.   ఇంతటి విశేషాలు గల ఈ దేవాలయాన్ని దర్శించి,  ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు,  ఆ సాయినాధుని ఆశీస్సులు పొందగలరు..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS