Friday, November 13, 2020

దీపావళి--- అమావాస్య-- లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి?


దీపావళి--- అమావాస్య-- లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి?


     దీపావళి అంటే దీపాల వరుస.   నరక చతుర్దశి రోజున నరక సంహారం జరిగింది.   మర్నాడు అమావాస్య కనుక,  చీకటిని పారద్రోలడానికి అందరూ దీపాలు వెలిగించి,  టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు.   వామనుడు బలి చక్రవర్తిని 3వ పాదంతో పాతాళానికి పంపించిన రోజు.   విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైన రోజు.  అమావాస్య రోజు చీకటిని పోగొట్టి ఈ జగత్తుకు వెలుగును ప్రసాదించేదే దీపావళి.   చీకటి వెలుగుల సమాహారమే దీపావళి. (కష్ట సుఖాల కలయికే ఈ జీవితం అని అంతరార్థం..)

     దీపావళి 5 రోజుల పర్వదినం.   ధన త్రయోదశి-- నరక చతుర్దశి-- దీపావళి-- బలి పాడ్యమి-- భగినీ హస్త భోజనం (యమ ద్వితీయం).  భగినీహస్త భోజనం రోజు అక్క-తమ్ముడు, అన్నా-చెల్లెలు ఉన్నవారు తప్పనిసరిగా సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని శాస్త్రం.   ఎవరైతే సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారో! వారి సోదరులకి అపమృత్యు దోషం ఉండదు, రోగాలు దరిచేరవు.   భోజనం పెట్టిన సోదరికి సంపూర్ణ ఐదోతనం ప్రాప్తిస్తుంది. హిందూ సాంప్రదాయంలో బంధువుల తోటి కుటుంబమంతా కలవడమే పండగంటే.   పాడ్యమి రోజు కేదార గౌరీ నోము నోచుకుంటారు. కొండ ప్రాంతంలో గౌరమ్మ నోములు అంటారు. 

    (ఈరోజు మగవారి పితృ తర్పణం చేస్తే చాలా మంచిది.  3 సార్లు దోసిటతో "యమ దేవాయ నమః తర్పయామి" అంటూ తర్పణం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు..) 

   ఈరోజు సాయంత్రం ఇంటి ముందు,  దేవుని దగ్గర దీపాలు వెలిగిస్తారు.   కొంతమంది మైనపు కొవ్వొత్తులు వెలిగిస్తారు.   అది మన సాంప్రదాయం కాదు.   దీపం అంటే మట్టి ప్రమిదలో నూనెతో దీపారాధన చేయాలి.  (మానవ శరీరమే మట్టి ప్రమిద.  మట్టి ప్రమిదలో వెలిగే జ్యోతి స్వరూపమే మన ప్రాణం.  దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు..)  దీపపు వెలుగులో లక్ష్మీ ఉన్నట్లుగా భావించాలి.   దీపాలు వెలిగించి అలాగే భూమి మీద పెట్టకూడదు.   మనందరినీ భరించే భూమాత వేడిని భరించలేదు.   అందుకే ప్రమిదలలో దీపారాధన చేస్తారు. దీపాలు వెలిగించేటప్పుడు కొత్త ప్రమిదలు వాడాలి. ముందు సంవత్సరం ప్రమిదలు వాడరాదు.   ఒక్కొక్క ప్రమిదలో చేయడంవల్ల,  ఒక్కొక్క ఫలితం ఉంటుంది.  పిండితో చేసిన ప్రమిదలు గణేశుడుకి వాడతారు.   ఆషాడమాసంలో చలిమిడి పిండితో ప్రమిద తయారుచేసి,  తిరుపతి వెంకటేశ్వరుడికి దీపారాధన చేస్తారు. (ఇది కేవలం ఆషాడ మాసంలోనే చేస్తారు..) పిల్లలకు ఎవరికైనా జ్వరాలు, అనారోగ్యాలు వస్తే బియ్యపుపిండి ప్రమిదలో( 2 కానీ, 5 కానీ, 7 కానీ, బేసి సంఖ్య..) దేవాలయంలో దీపాలు వెలిగిస్తానని మొక్కుకుంటే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి.   వెండి ప్రమిద,  ఇత్తడి ప్రమిదలో (ఇత్తడి కుందులు..నిత్యం వాడేవి..) దీపారాధన చేస్తే చంద్రుడి అనుగ్రహంతో పాటు,  మానసిక సమస్యలు తొలగిపోతాయి.    బంగారు ప్రమిదలో దీపారాధన చేస్తే బృహస్పతి (గురువు) అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది.   ప్రాణాంతకమైన వ్యాధులు తగ్గిపోయి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి సాధిస్తారు.   శని త్రయోదశి రోజున ఇనుప ప్రమిదలో దీపారాధన చేస్తే, (తమిళనాడు-- తిరునల్లార్ లో వెలిగిస్తారు..) శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. మట్టి ప్రమిదలో కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తారు. (దీపాలు ఎప్పుడూ కూడా వాకిలికి ఇరువైపులా పెట్టాలి...) రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేస్తే, దుర్గా దేవి అనుగ్రహం కలుగుతుంది. కుజ గ్రహ ఇబ్బందుల నుండి బయటపడటానికి,  రక్త శుద్ధి కావడానికి బీట్రూట్లో దీపారాధన చేస్తే,  రక్త వృద్ధి కలుగుతుంది.   కుజ దోషాలు పోతాయి.   గుమ్మడికాయ లో దీపం వెలిగిస్తే దేవి కటాక్షం కలుగుతుంది.   కొబ్బరి చిప్పలో కొబ్బరినూనెతో కానీ,  ఆవునేతితో కానీ దీపం వెలిగిస్తే సంతానం కలుగుతుంది.   మామిడాకు మీద (పత్ర దీపాలు..) దీపారాధన చేస్తే సమృద్ధి కలుగుతుంది. నేరేడు ఆకు మీద చేస్తే శని దోషాలు తొలగుతాయి. తమలపాకు మీద చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి.  రావి ఆకుల మీద చేస్తే రోగ నాశనం కలుగుతుంది.   సన్నజాజి నూనెతో దీపారాధన చేస్తే హనుమంతుడి, శ్రీదేవి వారి అనుగ్రహం కలుగుతుంది.   నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని బాధలు తొలగిపోతాయి.   గణపతికి, కుబేరుడికి ఆవునేతితో, కొబ్బరినూనెతో దీపాలు వెలిగించాలి.   వనస్పతి నూనెలు దీపారాధనకు వాడకూడదు..  

        దీపావళి అనగానే ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పూజ చేస్తారు.   దీపావళి రోజున ఇంటిముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టాలి.   లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి,  ఆ తల్లికి ఆహ్వానం పలకాలి.   ఈరోజు సూర్యోదయానికి 4 ఘడియల ముందే లేచి,  ఒక టపాసులు కాల్చి,  జ్యేష్ఠా లక్ష్మీదేవిని దూరం చేయడం కోసం నువ్వుల నూనెతో తలస్నానం చేయాలి.   స్నానం చేసిన తర్వాత తీపి తినాలి.   దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు- కుంకుమ- గంధం- అక్షింతలతో అర్చించి, పంచామృతాలతో అభిషేకం చేసి, లక్ష్మీ శతనామ స్తోత్రం,  లక్ష్మీ సహస్ర నామాలతో పూజిస్తారు.   శ్రీ సూక్తంతో షోడోపచార పూజ చేస్తారు.   ఈరోజు 108 రూపాయి నాణేలు (రూ.1/- రూ2/- రూ5/- నాణాలు) శుభ్రంగా పాలతో కడిగి,  సాయంత్రం 6 గంటలకి ఒక్కొక్క నాణెంతో లక్ష్మీ అష్టోత్తర పూజ చేస్తారు.   పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన నాణాలు ఎర్రటి వస్త్రంలో భద్రపరచి,  వాటిని బీరువాలో దాటిపెడితే! సంవత్సరమంతా వారి ఇంట ధనానికి లోటు ఉండదు. ఈ రోజు లక్ష్మి పూజ చేసేవారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండ కలుగుతుంది.. 

    పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు.  దీపావళి రోజున కాల్చే టపాసులు,  మతాబులు అన్ని వెలుగులు చిమ్ముతూ ఉంటాయి.   ఈ వెలుగులకి, శబ్దాలకి మనకున్న దారిద్ర్య, దుఃఖాలను పోవాలని పండగ చేసుకుంటారు.   దీపావళి పండగ వర్షాలు తగ్గి, చలికాలం వచ్చే సమయం కనుక జ్వరాలు, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.   కాబట్టి టపాసులు కాల్చడం ద్వారా, క్రిమికీటకాలు నశిస్తాయి. పూర్వం దీపావళికి మట్టి ప్రమిదలు వెలిగించి,  కాగడాలు (దివిటీలు) పట్టుకొని గ్రామమంతా తిరిగేవారు. ఆటపాటలతో గడిపేవారు.   ఈ విధంగా పండగ చేసుకోవడం వల్ల శబ్ద, ధ్వని కాలుష్యం, మందుల యొక్క కాలుష్యం ఉండేది కాదు.   టపాసులు కాల్చినాక  పెద్దలు తీపి తినిపిస్తారు.. 

    దీపావళికి సంబంధించి ఒక కథ ఉంది.  ఒకసారి దూర్వాసుడు ఇంద్రసభకి వెళ్లి,  అప్పుడే బయటకు బయలుదేరుతున్న ఇంద్రుడికి ఒక పూలహారాన్ని బహూకరిస్తాడు.   ఆ పూలహారాన్ని ఇంద్రుడు అందుకుని ప్రక్కనే ఉన్న ఐరావతం మీద వేస్తాడు. ఆ పూలహారం విలువ తెలియని ఐరావతం,  దానిని కాలితో తొక్కివేస్తుంది.   ఈ సంఘటన చూసిన దూర్వాసుడు క్రోధంతో,  "నీవు ఇంద్ర పదవికి తగవు!" అని శపిస్తాడు.   ఇంద్రుడి ఐశ్వర్యం, పదవి అంతా పోయి కొన్ని సంవత్సరాల పాటు శ్రీహరి గురించి తపస్సు చేస్తాడు.   శ్రీహరి ప్రత్యక్షమై "పోయిన ఇంద్రపదవి దక్కాలంటే! నీకు లక్ష్మి దూరమైంది కనుక ఒక దీపాన్ని వెలిగించి,  ఆ దీపంలో లక్ష్మీదేవి ఉన్నట్లుగా భావించి పూజించు" అని చెప్తాడు.   ఇంద్రుడి లక్ష్మీదేవిని పూజించ గానే పోయిన ఇంద్రపదవి తిరిగి దక్కింది.   అప్పుడు ఇంద్రుడు "అమ్మా! నీవు చంచల మనస్కురాలివి,  శ్రీహరి దగ్గర ఉంటావు! నీ అనుగ్రహం ఎలా పొందాలి? ఎలా ప్రార్థించాలి?" అని అడుగుతాడు.   వెంటనే లక్ష్మీదేవి "కోరికలు కోరుకునే వారికి వరలక్ష్మిగా-- చదువుకునే వారికి విద్యాలక్ష్మిగా-- విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా-- ఐశ్వర్యం కోరేవారికి ధనలక్ష్మిగా-- అష్టలక్ష్ముల రూపంలో ఉంటాను.   ఏ కోరికతో నన్ను పూజిస్తారో! ఆ కోరికతో అనుగ్రహిస్తాను--" అంటూ వరం ఇస్తుంది.   కాబట్టి దీపావళి నాడు ఎవరైతే దీపలక్ష్మీ పూజ చేసుకుంటారో! వారందరికీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని అభయం ఇస్తుంది.   ఆనాటినుండి ఈరోజు వరకు దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.  కనక ఈరోజు లక్ష్మీ దేవి పూజ చేసుకున్న అందరికీ లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS