ఈ గణాధిపత్యం అంటే ఏమిటి.?
ఓం గణానాం త్వా గణపతిగ్o హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!
జ్యేష్టరాజం బ్రహ్మణాo బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !
మహాగణపతియే నమః ।।
గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలమునుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత , వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు. "గ" శబ్దం బుద్దికి "ణ " శబ్దం జ్ఞానానికి ప్రతీక.
సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరించబడేదే "ఓంకారము " అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము " లో వర్ణించారు. గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి ". అంతేకాకుండా "బ్రహ్మణస్పతి " అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.
గణపతి విష్ణుస్వరూపుడు :
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోప శాంతయే !
ఇక్కడ వినాయకుడు "విష్ణుం" అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబదినాడు. విష్ణుం అంటే సర్వవ్యాపకుడు, స్థితి కారకుడు. అంతేకాకుండా క్షీర సాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీ మహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.
సృష్టి ఆది లో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందుఅన్నమాట . అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది . ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయకకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం.
గణేశుని (4) అవతారాలు:-
గణేశ పురాణం ప్రకారం గణేషుడు (4) అవతారాలుగా ఆవిర్భవిస్తాడని అవి (4) యుగాలలో ఒకొక్క యుగానికి ఒకొక్క అవతారం గా చెప్పబడ్డాయి.
1. మహోత్కట వినాయక : -
ఈయన కస్యపప్రజాపతి - అదితి ల కొడుకుగా కృత యుగంలో అవతరించారు. పది చేతులతో, ఎఱ్ఱని శరీర ఛాయతో సింహ వాహనుడై -- నరాంతక, దేవాంతక అనే రాక్షసులని సంహరించినట్లు చెప్పబడింది.
2. మయూరేశ్వర వినాయక :-
ఈయన శివపార్వతుల కొడుకుగా త్రేతాయుగం లో అవతరించారు. ఆరు చేతులతో, తెల్లని ఛాయతో, నెమలి వాహనంగా సిన్దురాసురుడు మొదలైన రాక్షస సంహారం కావించాడు.
3. గజానన వినాయక :-
ఈయన శివపార్వతుల కొడుకుగా ద్వాపరయుగం లో అవతరించారు. ప్రస్తుత మన విఘ్న వినాయకుడు ఈయనే. ఎర్రని శరీర చాయతో, నాలుగు బాహువులతో, మూషిక వాహనముతో. కుడివైపు రెండు చేతులలో ఏక దంతమును, అంకుశమును ధరించి, ఎడమ వైపు రెండుచేతులతో పాశమును, మోదకమును ధరించి గజవదనంతో, తొండము కుడివైపు వంపుతిరిగి ఉండును.
4. ధూమ్రకేతు వినాయకుడు :-
ఈయన బూడిద రంగులో, నాలుగుచేతులతో, నీలంరంగు గుర్రం వాహనంగా, కలియుగాంతంలో, విష్ణుమూర్తి, కల్కి అవతారంలో అవతరించినప్పుడు, ధూమ్రకేతు వినాయకుడు కూడా అవతరిస్తాడు.
No comments:
Post a Comment