*ప్రత్యంగిరా దేవి ఆలయం - దిల్ సుఖ్ నగర్*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
➡️ తెలంగాణ రాష్ట్రములోని హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలోని కుర్తాళం పీఠంలో శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయం ఉంది.
➡️ ఈ ప్రత్యంగిరాదేవి గొప్ప శక్తిమంతురాలు. త్రిమూర్తులకు సాధ్యపడని రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అంతటి అరుదైన ప్రత్యంగిరా మాత ఆలయం హైదరాబాద్లో ఉంది.
➡️ శ్రీరాముడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు నరకాసురుడు, జరాసంధుడు, ఘంటాకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలగువారు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. కాని ఉగ్ర స్వరూపిణి కావడంతో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారి సంఖ్య చాలా తక్కువ.
➡️ఈ ప్రత్యంగిరాదేవి ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో 'కృత్య'గాను దక్షిణాదిన తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలోని అయ్యావరే అడవిలో నికుంభిలగాను పూజలందుకుంటుంది.
➡️ కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర, భైరవి, భగళాముఖి, ధూమవతి, మాతంగి, షోడశి, కమలాత్మిక మొదలగు అమ్మవార్లను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. శత్రుసంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే ఏలినాటి శని ప్రభావం తొలగి పోతుందని, సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. భక్తి శ్రద్ధలతో పూజించేవారినీ దుష్టగ్రహ పీడల నుంచి కాపాడే తల్లి ఈ ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం. ఇచ్చట నిత్యపూజలతో పాటు ప్రత్యేక సందర్భాలలో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి.
🙏 *వరలేఖరి.నరసింహశర్మ*🙏
No comments:
Post a Comment