Wednesday, July 18, 2018

దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనం లో ఏమి చేయాలి?(17-07-2018 నుండి 14-01-2019 వరకు దక్షిణాయనం.)

దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనం లో ఏమి చేయాలి?(17-07-2018 నుండి 14-01-2019 వరకు దక్షిణాయనం.)
భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది.అవి దక్షిణాయనం,ఉత్తరాయణం. దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు.ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు.దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు.అందుకే విష్ణుమూర్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు.జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.
దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు.ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు(జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది.
ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు,విశేష తర్పణాలు తీసుకునేందుకు భూమి పైకి వస్తారని చెబుతారు.ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి.శ్రాద్ధాదులు మానివేయడం కూడా సంతానం కలగక పోవడానికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.శ్రాద్ధాదులు చేయక పోవడమే పిల్లలు లేక పోవడానికి కారణమని భావించి,వాటిని యధావిధిగా చేయడం మొదలు పెట్టి సంతానం పొందమని చెప్పినవారు కూడా ఉన్నారు.
బతికుండగా తల్లిదండ్రులసేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి,ఎంతో ముఖ్యం, శుభప్రదం.పితృరుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు మనను కన్న తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.ప్రతి దక్షి ణాయనంలో చలి వంటివి పెరగడం వల్ల ఎక్కువగా మర ణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఉత్తరాయణాన్ని పుణ్య కాలంగా భావిస్తారు.ఆ సమయంలో మరణించడం మంచిదనే అభిప్రాయం ఉంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న వాడు కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉండి అప్పుడు ప్రాణం వదిలాడు.( *ఇక్కడ  నా మాట జాగ్రత్తగా ఆకళింపు చేసుకోండి.దక్షిణాయనంలో ఎవరైనా మరణిస్తే వారిని పాపాత్ములుగా భావించే వారు నేడు అనేకం ఉన్నారు. అలా భావించడమే మహా పాపం.భీష్ముడు ఉత్తరాయణం కోసం వేచి చూడలేదా?అని ఇక్కడ ఒక   ఉదాహరణ చెబుతారు.అంతకుముందు మహా మహులు   కురుక్షేత్రం యుద్ధంలో మరణించారు అని   మాత్రం ఆలోచించరు. ద్వాపర యుగానికి కలియుగానికి ధర్మంలో ఎంతో మార్పు చోటుచేసుకుంటుంది. దయచేసి మరణించినవారి గురించి వికారంగా మాట్లాడకండి* )
అయితే దక్షిణాయనంలో కూడా చాలా మంది గొప్ప వారు మరణించారు. అంతమాత్రాన వారికి ఉత్తమ గతులు రావని కాదు. మహాత్ముల విషయంలో వారు ఏ అయనంలో మరణించారన్నది ముఖ్యం కాదని,వారు ఉత్తమ లోకాలు పొందేందుకు దక్షిణాయనం అవరోధం కాబోదని అంటారు. మరణం అనేది మానవుల చేతుల్లో ఉన్నది కాదు.అది దైవ నిర్ణయం.కర్మను బట్టి,వారి ఆయుర్దాయాన్ని బట్టి వారు మానవుల మరణాలు ఉంటాయి.మరో విధంగా చూస్తే కాలం చెడ్డది కాదు. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెప్పేవారూ ఉన్నారు.నిజానికి దీక్షలు,పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.
నాలుగు నెలల దీక్ష అయిన చాతుర్మాస్యం దక్షిణాయనం లోనే వస్తుంది.చాతుర్మాస్యం నాలుగు మాసాలూ కూడా ఈ కాలంలోనే ఉండడం వల్ల ఈ సమయంలో విష్ణు మూర్తి ఆరాధన విశేష ఫలాలు ఇస్తుంది.దక్షిణాయనంలో ముఖ్యంగా చేపట్టవలసిన కార్యక్రమాలు కొన్ని పెద్దలు చెబుతారు.వాటిలో కొన్ని ఇవి:
*ధ్యానం*:-గురూపదేశం ఉన్నవారు మంత్ర జపాలు చేయడం,సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం,పిండ ప్రదానాలు,పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం(శాకాహారం) తీసుకోవడం,అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం,తిల(నువ్వుల ) దానం,వస్త్ర దానం,విష్ణు పూజ,విష్ణు సహస్రనామం చేయడం,సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి,మనస్సుకు మంచి చేస్తాయి.పాపాలు తొలగిపోతాయి అని శాస్త్ర వచనం.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS