Thursday, July 12, 2018

ఆంధ్రా శబరిమల (ద్వారపూడి)

ఆంధ్రా శబరిమల (ద్వారపూడి)
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ఈ గ్రామానికి ఒకప్పుడు హోల్‌సేల్‌ వస్త్రవ్యాపార కేంద్రంగా పేరు. కానీ ఇప్పుడా వూరి గురించి అడిగితే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని చెబుతారు.
తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు చిన్నతిరుపతిలో వెుక్కు తీర్చుకున్నట్టే... శబరిమలలో కొలువై ఉన్న మణికంఠుని ఆలయానికి ద్వారపూడి అయ్యప్పగుడిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు.
అవును! ఆ వూరు ఆంధ్రా శబరిమల. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, అయ్యప్ప శరణు ఘోషతో వూరూవాడా మార్మోగుతాయి. లక్షలాది మంది మాలధారణ చేసి కఠోర నియమాలు పాటిస్తూ స్వామి కరుణాకటాక్షాల కోసం శబరిమలకు బయలుదేరుతారు. గతంలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య ప్రస్తుతం అరకోటిపైగా ఉంటోంది. అయితే అందరూ అందాకా(శబరిమల) వెళ్లడం లేదు.
రాజమండ్రికి సుమారు 25 కి.మీ. దూరంలో ఉన్న ద్వారపూడికీ వెళ్లేవారున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచే కాక ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్దఎత్తున వచ్చే అయ్యప్ప దీక్షాధారులు ఇక్కడ ఇరుముడులు సమర్పించుకుంటున్నారు.
మకరజ్యోతినాడయితే దాదాపు 30వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. పంచలోహ విగ్రహంతో చేసిన ఇక్కడి అయ్యప్ప విగ్రహాన్ని 1989లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ప్రతిష్ఠించారు.
ఇక స్వామి సన్నిధికి దారితీసే పద్దెనిమిది మెట్లనూ తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయడం విశేషం. శబరిమల తరహా ప్రసాదం ద్వారపూడి ఆలయానికున్న మరో ప్రత్యేకత.
తమిళుడి సంకల్పం... 1969లో తన 23వ ఏట వస్త్రవ్యాపారం కోసం తమిళనాడు నుంచి ఓ యువకుడు ద్వారపూడి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆయన పేరు ఎస్‌.ఎల్‌.కనకరాజు. 1976లో మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించి, శబరిమల వెళ్లారు. అయ్యప్పస్వామికి మొక్కుకున్న ఫలితంగా 1980లో తనకు కొడుకు పుట్టాడన్న ఆనందంతో ద్వారపూడిలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారాయన.
భక్తులూ..దాతల విరాళాలతో 1983లో శంకుస్థాపన జరిగింది. ఇక్కడి 'పదినెట్టాంబడి'కీ ఒక ప్రత్యేకత ఉంది. తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కిన 18 మెట్లనూ బంగారంతో తాపడం చేశారు. ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే వీటిని ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇక, ఆలయప్రాంగణంలోనే ఉన్న హరిహరుల విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
ఎన్ని ఆలయాలో... అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని 6 ఎకరాల విస్తీర్ణంలో..
కనకదుర్గాదేవి..
పంచముఖ ఆంజనేయస్వామి..
షిర్డీసాయిబాబా..
గోవిందరాజస్వామి..
దేవతలకు ఆలయాలను నిర్మించారు.
ఇంకా ఇక్కడి భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం, నవగ్రహ శనీశ్వర స్వామి ఆలయం,
అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వరస్వామి దేవాలయం, పాపవిమోచన దేవాలయాలకు నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు.
అంతేకాక ఆలయ తూర్పుభాగాన కొత్తగా రూ.10 కోట్లతో దశావతారాలతో కూడిన వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్నారు. అయ్యప్ప దేవాలయానికి తూర్పుదిశలో నాలుగు అంతస్తుల్లో పాలరాయితో అందంగా తీర్చిదిద్దిన ఉమావిశ్వేశ్వరస్వామి ఆలయానిది మరో విశిష్టత. గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌,
బ్రహ్మకపాలం, అమరనాథ్‌, ఓంకార్‌, కాశీ, రుషికేశ్‌, హరిద్వార్‌, గౌరీకుండం, ఖాట్మండు (నేపాల్‌) తదితర పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన 18 శివలింగాలను 4 అంతస్తుల్లో ప్రతిష్ఠించారు.
పై అంతస్తులోని చతుర్ముఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి 18 శివలింగాలపై అభిషేక ద్రవ్యం పడటం కన్నులపండువగా ఉంటుంది. ఈ ఆలయానికి ముందు భాగంలో ఏర్పాటు చేసిన భారీ నటరాజు విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
అలాగే దేవాలయానికి ఒక పక్కన ఏర్పాటు చేసిన అతిపెద్ద నంది విగ్రహం కూడా సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వెండి శివలింగం అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలోనే ఈశాన్యదిశలో 200 అడుగుల పొడవు, 12 అడుగుల లోతున భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా అక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
భూగర్భ దేవాలయానికి వెళ్లే మార్గంలో కంచి తరహాలో వెండి బల్లి, బంగారుబల్లి ప్రతిమలను ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రవేశానికి కఠిన నిబంధనలు ఉంటాయి.
పురుషులు చొక్కా తీసేసి పంచెకట్టుతోనే ఈ ఆలయంలోకి ప్రవేశించాలి. పిల్లలకు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. స్త్రీలు కూడా సంప్రదాయ దుస్తులతోనే గుళ్లో అడుగుపెట్టాలి.
దీనికి పక్కనే పాపవిమోచన ఆలయం ఉంది. అందులో దేవి, కరుమారియమ్మ, నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి శుక్ర, మంగళవారాలు నాగదోష, గ్రహబాధల నివారణకు పూజలు జరిపిస్తుంటారు భక్తులు.
స్వస్తి..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS