Thursday, July 12, 2018

అలంపురే జోగులాంబా జోగులాంబ - శక్తి పీఠం ..అలంపురం.

అలంపురే జోగులాంబా
జోగులాంబ  -   శక్తి పీఠం ..అలంపురం.
లంభస్ధనీం  విక్రృతాక్షీం గోరారూపాం మహా బలాం
ప్రేతాసనా సమారుడాం జోగులాంబ నమామ్యహం
అలపురం సికింద్రాబాద్ – ద్రోణాచలం రైలు మార్గము లో వుంది . అలంపురం రైల్వేస్టేషన్ నుండి దేవాలయము సుమారు 6 కి.మీ దూరములో వుంది. అలంపురం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పటికి కర్నూలుకి చాలా దగ్గర .
కర్నూలు నుండి ౩౦ కి.మీ దూరములో వున్నది . కర్నూలు నుండి అలంపురానికి ప్రతి అర్దగంటకి బస్సులు వున్నాయి అలంపురం చిన్న పెల్లెటూరు .
మన దేశములో సుప్రసిద్ద మైన అష్టాదశ శక్తీ పీఠములలో ఒకటి అలంపురంలోని జోగులాంబదేవి శక్తీ పీఠంని.. . అలంపురముని దక్షిణకాశీగా కొందరు పిలుస్తారు .. కాశీకి అలంపురంకి కొన్ని పోలికలు వున్నాయి అందువలనే దీనిని  దక్షిణ కాశీ గా పిలుస్తారు .
ఆ పోలికలో కొన్ని ముఖ్యమైనవి :-
1) కాశీలో గంగానది ఉత్తరదీశగా ప్రవహిస్తుంది . అలంపురం లో ఉత్తరదిశగా తుంగభద్రానది ప్రవహిస్తుంది .
2) కాశీకి దగ్గరలో త్రివేణి సంగమము వుంది . అలంపురము కి దగ్గరలో తుంగ , భద్ర, కృష్ణ నదుల సంగమము వుంది .
3) కాశీలో వరుణ , అశి అనే రెండు నదులు కలుస్తున్నాయి . అలంపురములో తుంగ , భద్ర అనే రెండు నదులు కలుస్తున్నాయి .
4) కాశీలో అన్నపూర్ణ , విశ్వేశ్వరులు ఉన్నట్లు , అలంపురములో జోగులాంబ , బాల బ్రహ్మేశ్వరులు ఉన్నారు .
5) కాశీలో విశాలాక్షి శక్తి పీఠము వున్నట్లు , అలంపురములో జోగులాంబ శక్తి పీఠము వుంది .
సకల దేవతలచే పూజింపడిన దేవత జోగులాంబ దేవి . ఈ జోగులాంబ దేవి శక్తి పీఠము 18 శక్తి పీఠములో 5 వ శక్తి పీఠము . దక్ష యజ్ఞములో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి దంత పై వరుస ఇక్కడ పడింది .
యోగ అనే శబ్దము నుండి జోగులాంబ అనే పేరు వచ్చింది అని కొందరి భావన. ఈ అమ్మవారిని ఇక్కడ మహా కాళి , మహా లక్ష్మి , మహా సరస్వతి అని పిలిచి , పూజించే వారు కూడా వున్నారు . ఈ దేవికి విశృంఖాలదేవి అనే పేరు కూడా వున్నది .. ప్రపంచ బంధాలు లేనిది అని అర్ధము.
భక్తులని ఈ ప్రపంచ బంధాలనుండి విముక్తి చేసే దేవత అని కూడా భావిస్తారు . భక్తులను పాపాలనుండి విముక్తి చేసి , వారి కోరికలని నెరవేర్చి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించే పరమ పావని జోగులాంబ దేవి.
యోగులకు యోగీశ్వరీగా..
తాంత్రికులకు సిద్దిప్రదాయినిగా..
రససిద్దులకు ఆరాధ్యా దేవతగా..
జోగులాంబ ప్రసిద్ది చెందినది .
ఈ క్షేత్రములోని ఆలయములు చారిత్రాత్రకము గా  మొదటి బాదామి చాళుక్యుల కాలములో అంటే క్రీ.శ 6 వ  శతాబ్దము నుండి నిర్మితమయినాయి . ఆ తరువాత రాష్ట్రకుటలు , కల్యాణి చాళుక్యులు , కాకతీయుల కాలములో కూడా ఈ దైవ సన్నిధి అభివృద్ది చెందినది .
ఈ క్షేత్రము పరుశురామ క్షేత్రముగా కూడా ప్రసిద్ది చెందినది . శ్రీశైలానికి పడమటి ద్వారముగా కూడా అలంపురం అందరికీ తెలిసిన పుణ్య క్షేత్రము . ఈ క్షేత్రము చాలా ప్రాచీన మైనది అని శాసనాల వల్ల , ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తుంది .
ఈక్షేత్రముకి హాలంపుర , హతంపుర, హేమలాపురం అనే పేర్లు కూడా వున్నాయి .
పరుశురాముడి తల్లితండ్రులు అయిన జమదగ్ని , రేణుక , ఇక్కడే ఆశ్రమములో వుండేవారు అని...ఒక రోజు రేణుక , అక్కడికి వేటకు వచ్చిన రాజును చూచి , మనస్సు చలించి  ఆశ్రమానికి కుండలో నీళ్ళు తీసుకు పోవడం ఆలస్యము అయినది .
జమదగ్ని మహర్షి భార్య రేణుకా పై ఆగ్రహించి తల్లిని వధించమని కుమారులని శాసిస్తారు . వారిలో పరుశురాముడు మాత్రమే అందుకు అంగీకరించి తల్లిని వదిస్తాడు. దానికి మెచ్చి వరము కోరుకోమని అడగడటముతో పరుశురాముడు తల్లిని మళ్ళీ బ్రతికించమని అడుగుతాడు .
స్థలపురాణము ప్రకారము ఇదంతా అలంపురములోనే జరిగింది .ఇక్కడ ఇప్పటికీ గ్రామస్తులు రేణుకా తల్లిని యెల్లమ్మగా పూజిస్తారు.రేణుకమ్మ మొండాన్ని బ్రహ్మేశ్వరాలయములో భూదేవిగా పూజిస్తున్నారు .
బహమనీ మహ్మదీయ రాజుల కాలములో అంటే 14, 15 శతాబ్దాలలో ఇక్కడి దేవాలయాలు , మహ్మదీయుల దాడులకు గురి అయినాయి .. అపుడు..అమ్మవారి శక్తి రూపాలైన చండీ ముండీలను బాల బ్రహ్మశ్వరాలయంలో దాచి పెట్టారు.తిరిగి 16 వ శతాబ్దములో కృష్ణ దేవరాయల కాలములో ఈ దేవాలయము పునర్మిత మైనది ..
ఆతరువాత ఇటీవల కాలములో ఇప్పుడు వున్న స్థలములో పునర్నిర్మించి . 2005 సం లో ఫిబ్రవరి 13 వ తేదీన దేవి విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు . శక్తి పీఠాలలో ఈ దేవాలయము మాదిరి ఈ దేవాలయము  పూర్తి గా  పునః నిర్మితము కాలేధు . ఇప్పుడున్న దేవాలయము ఆధునికము గా నిర్మితము అయిన ఈ క్షేత్రమునకి ప్రాచీన వైభవము కొనసాగుతుంది .
జోగులాంబ పూర్వము ఉగ్ర రూపములో వుండేధి . చేతులలో ఖడ్గం , గొడ్డలి , మెడలో కపాలం , ఒంటి మీద తేలు , బల్లి ,గుడ్ల గూబలతో , భయంకరముగా వుండేధి . ఇపుడు మనము చూసే జోగులాంబ ప్రసన్న ముఖముతో అనుగ్రహ రూపములో కనబడుతుంది . శంకరాచార్యుల పూజల వల్ల దేవి రూపములో ఈమార్పు వచ్చిందంటారు.
అలంపురములో శక్తిపీఠానికి ప్రసిద్ది చెందినప్పటికి ఇక్కడ ముఖ్యమైన దేవలయం బాల బ్రహ్మేశ్వరాలయము ఇక్కడ తొమ్మిది బ్రహ్మేశ్వరాలయాలు వున్నాయి . అంధుకే ఈ క్షేత్రానికి బ్రహ్మేశ్వర క్షేత్రము అని అంటారు .
బ్రహ్మ దేవుడే ఇక్కడ శివలింగములని ప్రతిష్టించాడు . . ఇక్కడ చాలామంది అనుకున్నట్లు బ్రహ్మ దేవాలయములు లేవు . ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగాలు వున్నాయి . బ్రహ్మేశ్వర ఆలయములు ముఖ్యముగా బాదామి చాళుక్యుల కాలములో క్రీ.శ 8 వ శతాబ్దములో  నిర్మించారు .
బాల బ్రహ్మేశ్వర స్వామి  దేవాలయములోని శివలింగము జ్యోతిర్లింగాము అని స్థల పూరాణము తెలియజేస్తుంది . భక్తుల కోర్కెలు అన్నిటిని నెరవేర్చే దైవముగా బాల బ్రహ్మేశ్వరుడు ప్రసిద్ది చెందాడు .
ఇక్కడ వున్న మిగతా బ్రహ్మేశ్వరాలయములు.
బాల బ్రహ్మేశ్వరాలయము కాక..8ఉన్నాయి..
1) కుమార బ్రహ్మేశ్వరాలయము , 
2) ఆర్క బ్రహ్మేశ్వరాలయము ,
3) వీర బ్రహ్మేశ్వరాలయము ,
4) విశ్వ బ్రహ్మేశ్వరాలయము ,
5 ) గరుడ  బ్రహ్మేశ్వరాలయము ,
6 ) స్వర్ణ  బ్రహ్మేశ్వరాలయము ,
7 ) తారక  బ్రహ్మేశ్వరాలయము , 
8 )పద్మ    బ్రహ్మేశ్వరాలయము.
అలంపురంలోని దేవాలయ నిర్మాణం గురించి ఒక పౌరాణిక కథ వుంది .
పూర్వము కాశీలో పుణ్యవతి అనే వితంతువు వుండేధి . ఆమె తపస్సుకి ఫలితముగా ఒక కుమారుడు జన్మించాడు అందరూ తండ్రీ లేని పిల్లవాడు అని హేళన చేశారు .
ఆఅబ్బాయి తపస్సు చేస్తే కాశీని వొదిలి అలంపురము కి వెళ్ళమని శివుడు ఆదేశిస్తాడు . పరమేశ్వరుని ఆదేశము ప్రకారము , తల్లితో అతను అలంపురమునకి వచ్చి ఇక్కడి దేవాలయముల నిర్మాణము పనిని చేసుకుంటాడు .
అలా చేస్తున్నపుడు రాళ్ళను బంగారముగా మార్చే శక్తి అతనికి లభించినది . ఈ విషయము తెలుసుకున్న రాజు  శిల్పితో తనకు రాళ్ళను బంగారము చేసే విద్యను చెప్పమని కోరాడు .. కానీ శిల్పి చెప్పక పోవడముతో .. రాజు శిల్పిని నిర్బందించి..తాను కట్టిన దేవాలయము లన్నిటిని పడగొట్టాడు .. పరమేశ్వరునికి ఆగ్రహానికి లోను అయిన రాజుకి రాజ పదవి నుండి బ్రష్టుడు చేశాడు  ఆప్పుడు రాజుకి తాను చేసుకున్న తప్పులు తెలిసి పరమేశ్వరుని ప్రార్దించగా రాజుకి పదవి లభించి , శిల్పిని విడుదల చేసి ,  మళ్ళీ తాను పడగొట్టిన దేవలయములని మళ్ళీ కట్టిించాడు రాజు .ఈ కథ బాల బ్రహ్మేశ్వర దేవాలయము గోడల మీద చెక్కబడినది .
అలంపురానికి సమీపముగా కూడలి సంగమేశ్వర ఆలయము వుంది . ఈ సంగమేశ్వర ఆలయము అలంపురమునకి ౩ కి.మీ దూరములో వుంది . ఇక్కడ తుంగభద్రానది , కృష్ణా నదిలో కలుస్తుంది . అంధుకే ఈ ప్రాంతము కి కూడలి సంగమేశ్వరం అనే పేరు వచ్చినది .
ఈ దేవాలయాన్ని  కూడా చాళుక్య రాజులు నిర్మించారు .  శ్రీ శైలం ప్రాజెక్టు నిర్మాణములో ఈ దేవాలయము ముంపుకి గురి అవుతుంది అని దేవాలయాన్ని ఇక్కడి నుంచి తరలించి ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత దేవాలయాన్ని పునర్నిర్మించారు . ఇది మన దేశ పురావస్తు శాఖావారు సాధించిన ఘన విజయం.
పూర్వము అలంపురం ఒక విద్యా కేంద్రముగా కూడా వుంది . ఆ విద్యా కేంద్రములో  ఆయుర్వేదము , యోగశాస్త్రము , రసాసిద్ది శాస్త్రము , మొదలయిన అధ్యయనం జరిగేది .
ఆలయ స్థల పురాణంలో..కథ..
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది.
భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.
ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది.
దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు.
కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి,
వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి.
ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని,
ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం.
ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం,
ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం.
దేవతల పూజలు అంధుకుంటున్న జోగులాంబ..
శక్తి పీఠముగా..
నవ బ్రహ్మ దేవాలయములు నిలయముగా.. విద్యాపీఠముగా..
ప్రపంచ విఖ్యాత చెందిన చాళుక్యుల శిల్పకళకు ఆలవాలంగా..
దక్షిణ కాశీగా..
ప్రసిద్ది చెందిన అలంపురంని అందరూ సందర్శించవలసిన పుణ్య క్షేత్రము..స్వస్తి..!!
పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS