ఆషాఢమాసంలో ఔషధాల గోరింటాకు
ఆషాఢమాసంలో అతివల అరచేతిలకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఐదోతనమని ముత్తైదువుల నమ్మకం. కొత్తగా పెళ్ళయిన యువతులు ఈనెలలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శుభసూచకమని వివాహాలు, వివిధ శుభకార్యాలయాలకు అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారాణీ, అరచేతులకు అలంకరణగా గోరింటాకు సుపరిచితమే. తొలకరి ఆరంభం ఆషాఢమాసం కావడంతో గోరింటాకు చిగురిస్తుంది. లేతగోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. పెళ్ళికాని అమ్మాయిలకు ఎర్రగా పండితే మంచిమొగుడొస్తాడని నానుడు. ఈ గోరింటాకు ఎర్రగా పండి శరీర ఛాయల నుంచి కళ్ళకు ఇంపుగా కనిపిస్తాయి. ఆషాఢమాసంలో దొరికే గోరింటాకు లేలేతగా ఉండి శరీరంలో రసం త్వరగా ఇంకి చేతులు, కాళ్ళు ఎర్రగా పండుతాయి.
ఔషధాల గోరింటాకు
గోరింటాకులో సౌందర్య సాధనంగానే కాక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కాళ్ళు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పడుతుంటాయి. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. ఆయుర్వేదంలో గోరింటాకును చర్మరోగాలకు, కాలేయ రోగాలకు, నోటిపూతకు, గనేరియా వంటి రోగాలకు వాడతారు. కీళ్ళనొప్పులు, వాపు ఉన్నవారు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచిగుణం కనబడుతుంది.
గోరింట చెట్టు ఆకును రుబ్బి దానిని కాలిగోళ్లు, చేతిగోళ్ల చుట్టూ పెట్టుకొని రెండు, మూడు గంటలు నాని ఆరిన తరువాత తీసివేస్తే అది ఎర్రగా పండుతుంది. ఆ విధంగా ఆ ఆకును గోళ్లకు పెట్టుకోవడం వల్ల ఆకురసం గోళ్లు పుచ్చి పోకుండా, పాడై పోకుండా, గోళ్లకు, వేళ్లకు ఏ విధమైన అంటు వ్యాధులు సోకుండా రక్షిస్తుంది. (గోర్ల అంతట) గోర్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దానిని గోరంటాకు, గోరింటాకు అన్నారు. అందుకే మన జీవన విధానంలో దానిని ఒక ఆచారంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేశారు. ఈ పద్ధతి కూడా ప్రకృతి కనుగుణంగా వాతావరణ పరిస్థితుల కనుగుణంగా ప్రవేశపెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్పథం తేట తెలమౌతుంది.
శ్రావణ భాద్రపద మాసాలు వర్షబుుతువులు వర్షాలు బాగా కురవడం వల్ల స్త్రీలు తమ తమ పనులన్నిటినీ ఆ నీళ్లల్లో నానుతూ చేసుకోవలసి వస్తుంది. అంతేగాక నిత్యమూ ఇంటి పనులు, వంట పనులు, పాత్రలు తోమడం, బట్టలుతకడం, ఇల్లలకడం వంటి పనులన్నీ నీళ్లలోనే చేసుకుంటూ ఉండడం వల్ల కాలిగోళ్లు, చేతిగోళ్లు పుచ్చిపోయి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుండి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా గోరింటాకు పెట్టుకునే ఆచారం ప్రవేశపెట్టారు. వర్ష బుుతువుకు ముందు వచ్చే ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్లు పుచ్చిపోయి పిప్పిగోళ్లు అయ్యే ప్రమాద ముండదు.
తరువాత భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ల తద్ది పండుగ-ఆశ్వీయుజ బహుళ తదియ అట్లతద్ది పండుగ. ఈ పండుగ రోజులలో తప్పనిసరిగా ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పాటు చేశారు. ఒకసారి వర్ష బుుతువు ముందు, మరోసారి వర్షబుుతువు మధ్యలో ఇంకోసారి వర్ష బుుతువు అనంతరం ఇలా మూడు పర్యాయాలు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యకరమని చెప్పారు. హిందువుల ఆచారాలు ఎంత వైజ్ఞానికంగా ఆరోగ్య ప్రధంగా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూడు పర్యాయాలే పెట్టుకోవాలనే నియమం లేదు. అవకాశం ఉన్నప్పుడు అవసరం అయినప్పుడు దీనిని పెట్టుకుంటూ ఉండవచ్చు.
క్రిముల బారి నుండి గోళ్లను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమైనప్పటికీ ఎర్రగా పండి అత్యంత ఆకర్షణీయంగా అందంగా ఉండడం వల్ల కూడ ఒక సౌందర్య సాధనంగా కనిపిస్తుంది.
తెల్లని జుట్టును కూడా నల్లబరిచే ఔషదగుణం గోరిం టాకులో ఉన్నదని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. గోరింటాకు పొడిని నూనెలో కలిసి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్లజుట్టు కూడా నల్లబడుతుంది. కళ్ల మంటలు తగ్గుతాయి. ఒక టీ స్పూను గోరింటాకు పొడిని నిమ్మరసంతో కలిపి ప్రతి రోజూ త్రాగితే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగు వస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కృత్రిమ గోరిటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకును వాడటం ఎంతైనా మేలు.
No comments:
Post a Comment