Thursday, July 12, 2018

బాబా...... ఊదీ కథ భక్తుల కష్టాలను తీర్చడంలో ఊదీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


బాబా...... ఊదీ కథ
బాబా తన జీవితకాలంలో భక్తులతో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎంచుకున్న ప్రత్యక్ష మార్గాలు రెండు.
ఒకటి- వారి మోహాన్ని త్రుంచివేసేందుకు దక్షిణను కోరడం. రెండు- వారి కష్టాలను తీర్చేందుకు ఊదీని అందించడం. 
డబ్బు మనిషికి ఉన్న మోహానికి చిహ్నమైతే, విభూతి ఈ ప్రపంచం నశ్వరం అన్న సందేశానికి ప్రతీక.
ఈ రెండింటి ద్వారా బాబా తన భక్తులకు అపూర్వమైన అనుభవాలను అందించేవారు. భక్తుల కష్టాలను తీర్చడంలో ఊదీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఊదీని తన ఆస్తిగా, భక్తులకు ఇచ్చే కానుకగా బాబా చెప్పేవారు. అంతటి ఊదీ మహిమను వివరించేందుకు హేమాడ్‌పంత్ తను రాసిన సాయిచరిత్రలో ఒకటికాదు, రెండుకాదు.... ఏకంగా మూడు అధ్యాయాలను కేటాయించారు. వాటిలోంచి కొన్ని కథలు....
ఊదీనే కానక్కర్లేదు:  ఊదీ అంటే బాబా ధునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. అవసరమైనప్పుడు బాబాను తల్చుకుని దాల్చినదేదైనా ఊదీ సమానమైన మహిమతో నిండిపోతుంది. బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది? 
అందుకే బాబాభక్తుడైన నారాయణరావు, తన స్నేహితుడు తేలుకాటుతో విలవిల్లాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊదీ కోసం వెతికాడు. కానీ ఎంతకీ ఊదీ కనిపించకపోవడంతో... అగరువత్తి నుంచి రాలిన బూడిదనే ఊదీగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు. నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి, అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది.
 ఇలాంటి సంఘటనే నానాసాహెబు హయాంలోనూ జరిగింది. నానాసాహెబు ఒకనాడు ఠాణా రైల్వేస్టేషనులో నిల్చొని ఉండగా, తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకుని, సాయిని తల్చుకుని, తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు. అంతే! ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగలక్షణాలు సద్దుమణిగిపోయినట్లు తెలిసింది.
జామ్నేర్‌ లీల:
బాబా మహిమలలోకెల్లా మహిమాన్వితం జామ్నేర్‌ వృత్తాంతం. బాబా పరమభక్తుడైన నానాసాహెబ్ కూతురు మైనతాయి పురిటినొప్పులతో సతమతమైపోతోంది. తాను ఎంత బాబాభక్తుడైనప్పటికీ, నానాసాహెబ్‌కు ఆమె స్థితిని చూసి భయం మొదలైంది. అందుకే ఈ పరిస్థితిని స్వయంగానే చక్కదిద్దుదామనుకున్నారు బాబా. 
శిరిడీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరుతున్న రామ్‌గీర్‌బువా అనే భక్తుని చేతికి ఊదీని, హారతి పాటను ఇచ్చి, వాటిని నానాసాహెబుకి అందించమన్నారు.
రామ్‌గీర్‌బువా వద్దనేమో నానాసాహెబు ఇంటికి చేరుకునేంత డబ్బు లేదయ్యే! అయినా ఓ ఆగంతుకుడు రామ్‌గీర్‌బువాను జలగామ్‌ నుంచి జామ్నేర్‌కు తన టాంగాలో తీసుకుని పోవడం; జామ్నేర్‌ దగ్గరలో రామ్‌గీర్‌బువా టాంగాను దిగగానే, అది అదృశ్యం కావడం తరచూ వినే ఘట్టమే! బాబా స్వయంగా పంపిన ఊదీని మైనతాయికి అందించి, హారతిని పాడిన కొద్ది నిమిషములలోనే సుఖప్రసవం జరిగిన వార్త నానాసాహెబ్ చెవినపడుతుంది. ఇంతకీ రామ్‌గీర్‌బువాను గమ్యాన్ని చేర్చిన ఆ ఆగంతకుడు ఎవ్వరో, ఆ టాంగా ఎక్కడిదో ఎవ్వరికీ అంతుచిక్కకుండా పోతుంది.
ఈ జామ్నేర్‌ లీల గురించి తరువాత కాలంలో తమిళనాడుకు చెందిన బి.వి. నరసింహస్వామి కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ ఘట్టానికి ప్రత్యక్ష్య సాక్షులైన మైనతాయి, రామ్‌గీర్‌బువాలతో మాట్లాడి సచ్చరిత్రలో ఉన్నదంతా నిజమేనని ధృవీకరించారు.
సర్వరోగనివారిణి!
బాబా చరిత్రలో ఊదీకి సంబంధించి మహిమలు అడుగడుగునా కనిపిస్తాయి. ఊదీని కలిపిన నీటితో మూర్ఛరోగం తగ్గడం, ఊదీతో ప్లేగు వ్యాధి ఉపశమించడం, రాచకురుపుతో బాధపడుతున్నవారు సైతం ఊదీతో స్వస్థత చెందడం... ఇలా సచ్చరిత్రలో అడుగడుగునా ఊదీ వైభవం కనిపిస్తుంది. కానీ దానికి కారణం తాను కాదంటూ వినమ్రంగా చెబుతారు బాబా. 
‘నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు’ అన్నది బాబా మాట.
సర్వ కష్ట హరణం!  ఊదీతో నయమయ్యే రోగాల గురించే కాదు, ఆపత్కాలంలో ఊదీతో తీరిన కష్టాల గురించి కూడా సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది. 
ఉదా॥ బాలాజీ నేవాస్కరు అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ, కొలుచుకుంటూ గడిపేశాడు. అలాంటి బాలాజీ సంవత్సరీకాన్ని అతని కుటుంబం శ్రద్ధగా నిర్వహించాలనుకుంది. కానీ నేవార్కరు కుటుంబం ఊహించినదానికంటే మూడురెట్లు బంధువురు ఆ సంవత్సరీకానికి వచ్చారు. వారిలో వంటకాలు చూస్తేనేమో వారిలో మూడోవంతుకి మాత్రమే సరిపోయేట్లు ఉన్నాయి. ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాభరాపడిపోయింది. కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నింటి మీదా కాస్త ఊదీని చల్లి, వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. ఇది సాయి ఆహారమేననీ! ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడనీ... అభయమిచ్చింది. బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా... ఇంకా మిగిలిపోయాయి కూడా!
బాబా సచ్చరిత్రలోనూ, ఆయన గురించి ఇతరత్రా ఉన్న సాహిత్యంలోనూ ఇలాంటి మహిమలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇక భక్తుల వ్యక్తిగత అనుభవాల గురించైతే చెప్పనే అవసరం లేదు.
జై సాయి రాo

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS