Wednesday, August 15, 2018

మహా సంప్రోక్షణం.. సకల శుభప్రదం శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణం

మహా సంప్రోక్షణం.. సకల శుభప్రదం
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణం

*తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనమాత్రం చేత అనుగ్రహాన్ని కురిపించే దేవదేవుడు.*
*ఆ కలియుగ దైవం విగ్రహాన్ని ఆగమానుసారం* *పున:తేజోవంతం చేయడానికి*
*పుష్కరానికి ఒకసారి నిర్వహించే క్రతువు అష్టబంధన మహా సంప్రోక్షణం.*
*ఈ కార్యక్రమానికి శ్రీవారి ఆలయం సిద్ధమైంది.*

శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు అరవయ్యేళ్ళ క్రితం మొదలైంది. అప్పటినుంచి నిరాఘాటంగా పన్నెండేళ్లకొకసారి ఈ ఉత్సవాన్ని టిటిడి (తిరుమల- తిరుపతి దేవస్థానాలు) వేడుకగా నిర్వహిస్తోంది. ఈసారి ఆగస్టు 12 నుంచి 16 వరకు ఆ కార్యక్రమాలు ఉంటాయి.

*అష్టబంధనం, మహాసంప్రోక్షణం అంటే...*
శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహం, పద్మపీఠం స్థిరంగా ఉండడం వెనుక దివ్య విశేషం ఉందని పెద్దలు చెబుతారు. స్వామి విగ్రహం అచంచలంగా ఉంటుంది. విగ్రహం చుట్టూ ఎనిమిది దిక్కులు స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి అష్టదిగ్బంధనం చేస్తారు. దీన్ని ‘అష్టబంధనం’ అంటారు. అష్టబంధన ద్రవ్య కాఠిన్యం పుష్కర కాలమే ఉంటుందనీ, ఆ తర్వాత స్వామి విగ్రహానికి దివ్యశక్తినీ, తేజస్సునూ మళ్ళీ ఆవాహన చేయాలనీ, సువర్ణాన్ని తిరిగి తేజోవంతం చేయాలని, అష్టబంధనం నశిస్తే దేశానికే అరిష్టమనీ ఆగమాల మాట! అందుకని 12 ఏళ్ళకొకసారి స్వామి గర్భాలయంలో మరమ్మతులు, పీఠానికి బంధనం, విమాన నవీకరణ తదితర జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

*ఏం చేస్తారు?*
స్వామి బింబాన్నీ, ఆనంద నిలయాన్నీ తేజోవంతం చేయడం కోసం అష్టబంధన మహాసంప్రోక్షణను ఆగమోక్తంగా- పంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తారు.
స్వామి, బింబాన్నీ కళలనూ కలశంలోకి ఆవాహన చేస్తారు. కలశాన్ని బాలాలయానికి తీసుకువెళ్తారు.
యాగాలతో నవీకరణ నిర్వహించి, విగ్రహాల్లో శక్తిని ద్విగుణీకృతం చేస్తారు.
పవిత్ర ద్రవ్యాలైన శంఖచూర్ణం, మధూచ్ఛిష్టం, లాక్ష, త్రిఫలం, కాసీనం, గుగ్గిలం, చూర్ణం, రక్తశిలలను సమభాగాలుగా చేసి, వెన్నతో కలిపి, గోరువెచ్చని నీటితో మిశ్రమం చేసి స్వామి పద్మపీఠం వద్ద ఎనిమిది దిక్కులల్లో వేస్తే విగ్రహబంధం అవుతుంది. ఇందులో శంఖ చూర్ణానికి చంద్రుడు, మధూచ్ఛిష్టానికి రోహిణి, లాక్షకు అగ్ని, చూర్ణానికి స్కందుడు, గుగ్గిలానికి చండదీధితి, త్రిఫలానికి హరి, కాసీనానికి వాయువు, రక్తశిలకు పృధ్వి అధి దేవతలు.
అష్టబంధనం తరువాత తేలికపాటి మరమ్మతులతో ఆనంద నిలయ విమానాన్ని తేజోవంతం చేస్తారు.
గర్భాలయంలోని గచ్చుకూ, అభిషేక జలం బయటకు పోయే దారులకూ, పైకప్పుకూ మరమ్మతులు చేస్తారు. మలినాలను తొలగిస్తారు.
గర్భాలయంలో చేయవలసిన ఈ కార్యక్రమాలు ఆచార్య ఋత్విక్కులు నిర్వహిస్తారు. ఆచార్య ఋత్విక్కులు కాని వారికి గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.
*ఇది ఐదోసారి*
శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల- తిరుపతి దేవస్థానాలు (టిటిడి) చేపట్టిన తరువాత, పన్నెండేళ్ళకు ఒకసారి ఆనంద నిలయ విమాన జీర్ణోద్ధరణ చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. దాంతో తొలిసారిగా 1958లో మహాసంప్రోక్షణ కార్యక్రమానికి నాంది పలికారు. ఆ ఏడాది ఆగస్టు 9 నుంచి 27 వరకు ఆనందనిలయ నవీకరణ, మహా సంప్రోక్షణ జరిగాయి. అప్పట్లో 12 టన్నుల రాగి, 12 వేల తులాల మేలిమి బంగారాన్ని వినియోగించారు. అప్పటి లెక్కల ప్రకారం దీని విలువ సుమారు రూ. 18 లక్షలు. ఆ తరువాత 1970లో జూన్‌ 24 నుంచి 28 వరకు, 1982లో మార్చి 1 నుంచి 5 వరకు, 1994 లో ఆగస్టు 8 నుంచి 12 వరకు, 2006లో ఆగస్టు 21 నుంచి 25 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ జరిగింది.

*ఎక్కడెక్కడి నుంచో...*
మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి 30 మంది ఉద్దండులైన వైఖానస పండితులను రప్పిస్తున్నారు. వీరు అర్చక నిలయంలో ఉంటూ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు యాగశాలలో హోమాదులు చేస్తారు. చివరిరోజున ఉదయం 6గంటల నుంచి 9.30 గంటల మధ్య శుభముహూర్తాన మహాసంప్రోక్షణ కార్యాన్ని పూర్తి చేస్తారు. వీరందరు కఠోర దీక్షతో, గృహస్థ ధర్మానికి దూరంగా ఉంటూ ఈ కార్యంలో పాల్గొంటారు.

*ప్రధాన కలశం విశిష్టత:*
మహాసంప్రోక్షణ కార్యంలో 20కి పైగా కలశాలను ఏర్పాటు చేస్తారు. అందులో ప్రధాన కలశం బంగారం బిందె రూపంలో ఉంటుంది. ఇందులో స్వామి, అమ్మవార్ల బంగారు డాలర్లు, నవరత్నాలు, శంఖం, చక్రం, గద, ధనస్సు, ఖడ్గం, శ్రీవత్సం, పూర్ణకుంభం, భేరి, అద్దం వంటి బంగారు ప్రతిమలను వేస్తారు.

*దర్శనం యథాతథం:*
స్వయం వ్యక్తమూర్తి అయిన స్వామి తేజస్సు ఈ క్రతువు కారణంగా ఏమాత్రం తగ్గదు. అందువల్ల పూజా
కైంకర్యాలు, భక్తులకు దర్శనం యథాతథంగా ఉంటాయి. అయితే మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది.

*సర్వదేవతా స్వరూపం... శ్రీవారి ఆనంద నిలయ విమానం*
శ్రీనివాసుని ఆలయ గోపురాన్ని ‘ఆనందనిలయ విమానం’ అంటారు. ఆనంద నిలయంపై విశేషమైన కొలతలతో విమానం నిర్మితమైంది. ఇందులో ఆరు వర్గాలుంటాయి. అవి: అధిష్ఠానం, పాదవర్గు, ప్రస్తరం, కంఠం, శిఖరం, స్తూపిక. ఈ ఆరూ మన శరీరంలో ఉండే షట్చక్రాలకు ప్రతీక. ఈ విమానం మూడు భాగాలుగా నిర్మితమైంది. మొదటిది కలశం. రెండవ భాగం 40 బింబాలు, మూడవ భాగం 19 బింబాలు. ఇందులో విష్ణుమూర్తి అవతార బింబాలు, ద్వారపాలకుల బింబాలు కూడా ఉన్నాయి. ఉత్తర భాగాన విమాన వేంకటేశ్వరస్వామి అత్యద్భుత బింబం ప్రతిష్ఠితమై ఉంది.

*ఇది విశేష ఫలదాయకం*
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసునికి నిర్వహిస్తున్న ఈ అష్టబంధన మహాసంప్రోక్షణం విశేష ఫలితాన్నిస్తుంది. గ్రామాభివృద్ధి, సస్యవృద్ధి, పశువర్ధన సౌభాగ్యం, జ్ఞానవృద్ధి, లోక శాంతి, దేశ సుభిక్షత, ప్రకృతి శాంతి, భక్తులకు శుభపలితాలు సమకూరుతాయి. స్వామివారు నూతన దివ్యతేజస్సు పొంది పరమానందంతో అందరినీ అనుగ్రహిస్తారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS