Saturday, August 18, 2018

వడమాల – జాంగ్రి మాల

వడమాల – జాంగ్రి మాల
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం ||
వాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ||

ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు. అతను కొంచం సంకోచిస్తూ ఉన్నట్టు కనపడ్డాడు. మహాస్వామి వారు అతన్ని తన సందేహమేంటో అడగమన్నారు. అతను గొంతు సవరించుకొని ఆంజనేయస్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు కాని ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు. ఉత్తర భారతంలో మమూలుగా జాంగ్రితో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారికి విన్నవించాడు.
మహాస్వామి వారు హనుమంతుని గురిన్చి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాల హనుమంతుడు ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు.
అదే సమయంలో సూర్యున్ని మ్రింగాలని రాహువు కూడా వస్తున్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహు దేవుడు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహు దోషము నుండి విముక్తి కలుగుతుంది మరియు రాహువు వారిని బాధించదు. ఆ చేసిన వంటకమును హారముగా కాని లేదా రాహు స్వరూపమైన పాముగా కాని చేసి హనుమంతునికి నివేదన చేయవలెను. రాహు గ్రహము యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థము రాహువుకు అత్యంత ప్రీతిపాత్రము.
మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాది వారు దక్షిణాది వారు ఎందుకు వేరేగా మాల సమర్పణం చేస్తారో వివరించారు.
దక్షిణాన ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు. ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారము అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయం.
ఉత్తరభారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రి కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహువు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపములో హనుమంతునికి నివేదిస్తారు.
ఈ విషయమును విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరచిన ఆ ఉత్తరభారతీయుడు పరమానందముతో మహాస్వామి వారి పాదములపై పడి ప్రణమిల్లారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
చిత్రలేఖనం - సుతన్ కాళిదాస్ (హరిహర సుతన్), చెన్నై

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS