Friday, August 17, 2018

కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో పాపఘ్ని నదీతీరాన గండి క్షేత్రం వెలసింది.


“త్రేతా యుగంలో దశరధ నందసుడైన శ్రీ రామ చంద్రమూర్తి తన వనవాసకాలంలో స్వాహాస్తమూలతో తన నిశీత శిలీ ముఖంతో బాణపు కొనతో గిచిన  ఆంజనేయ స్వామి నేడు గండి క్షేత్రం”
కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో పాపఘ్ని నదీతీరాన గండి క్షేత్రం వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయస్వామికి పవిత్ర క్షేత్రాలు చాలా ఉన్నా వాటిలో గండి క్షేత్రం అత్యంత పురాతనమైంది. భక్తుల పాపాలను హరించి వేసే పాపఘ్ని నదికి సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారి కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం.
పాపఘ్ని నది గురించి పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వం వేటకు వచ్చిన ఒక రాజు బాణానికి చెంచు తెగకు చెందిన వ్యక్తి మరణించాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్న నానుడి ప్రకారం ఆ రాజు కుష్టురోగి అయ్యాడు. ఆ రోగం నుంచి విముక్తి కోసం ఆ రాజు ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. అయినప్పటికీ అతడు రోగవిముక్తుడు కాలేదు. అతడి అంతరాత్మ ప్రబోధం మేరకు గండి క్షేత్రానికి వచ్చి పాపఘ్ని నదిలో స్నానం చేయగానే అతడు రోగ విముక్తుడవుతాడు.
పాపఘ్ని నందికొండలో పుట్టి కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా ప్రవహించి రాయచోటి తాలూకాలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత అది పెన్నాఘ్నిలో కలుస్తుంది.పెన్నాఘ్నినే ఇప్పుడు పెన్నా నదిగా పిలుస్తున్నారు. పాపాఘ్ని నది కుడి ఒడ్డున వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు.
రామాయణ కాలంలో వాయుదేవుడు ఇక్కడ తపస్సు చేశాడు. శ్రీరాముడు సీతాన్వేషణ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయనకు వాయుదేవుడు ప్రణమిల్లి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరాడు. సీతను తీసుకుని అయోధ్య తిరిగి వెళ్ళేటప్పుడు వస్తానని శ్రీరాముడు వాయుదేవునికి మాట ఇచ్చాడు.  శ్రీరాముడు తన పరివారంతో తిరిగి వస్తున్నాడన్న వార్తను భరతునికి తెలియజేయడం కోసం ఆంజనేయుడు వెళ్ళాడు. లంకలో రావణ సంహారానంతరం శ్రీరాముడు వానరసేనతో కలిసి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలోకి వస్తున్నాడని తెలిసుకున్న వాయుదేవుడు రెండుగా చీలి, నదికి దారినిస్తూ ఆకాశమంత ఎత్తున కన్పి స్తూ దివ్య కాంతులను వెదజల్లుతున్న కొండ  శిఖరాలను చూసి నానా రత్నమణి గణఖచితమైన దివ్యమైన స్వర్ణతోరణం రెండు కొండల శిఖరాలనూ కలుపుతూ శ్రీరామ పరివారానికి స్వాగత సూచకంగా తోరణం కట్టాడు.
ధర్మస్వరూడు, సత్య వాక్పరిపాలనాదక్షుడు, ఏకపత్నీవ్రతుడు, రావణ కుంభ కర్ణాది దుఫ్ట రాక్షస నిర్మూలనాదురంధరుడూ, మహావీరు డు, ధశరథ తనయుడు, లోకాలకు ప్రాణదాత అయిన రాముడు ఈ గండి ప్రాంతంలో బస చేశాడు. హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపై ఆంజనేయుని ఆకారాన్ని తన బాణంతో గీశాడట. తిరిగి వెళ్ళే హడావుడిలో శ్రీరాముడు ఆంజనేయుని రూపాన్ని అంతా గీసినా ఎడమ చేతి చిటికెన వ్రేలుని మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయింది. మరలా శిల్పితో ప్రయత్నించిన తరుణంలో ఉలి మొన సోకినంతనే రుధిరం (రక్తం ) స్రవించుట జరిగినది. ఈ యొక్క సంఘటన వాయు పురాణమందు ప్రస్తావించుట జరిగినది. దీనిని బట్టి స్వామివారు సజీవమూర్తిగా కోలువైనట్లు విశిదమవుతున్నది.
అలా పరమపురుడైన శ్రీరామునిచే చిత్రింపబడి, ప్రకృతి స్వరూపమైన సీతమ్మచే జీవింపోయబడ్డ హనుమద్రూపం ‘శ్రీ వీరాంజనేయస్వామి’గా ‘గండిక్షేత్రం’లో నెలకొని నేటికీ భక్తజన కల్పతరువుగా పూజలందు కుంటున్నాడు. ఆ స్వామి దర్శనమాత్రంతోనే సమస్త దోషాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయని అంటారు.హనుమ పాదాలను అభిషేకిస్తూ, ప్రజల పాపాలను పోగొట్టే పాపహారణియై ‘పాపఘ్నీ’ అనే సార్థక నామ ధ్యేయంతో ఆ నదీమతల్లి గౌరవించబడుతోంది.
సీతా, శ్రీరామచంద్రులకూ, లక్ష్మణ, సుగ్రీవాది వానర భల్లూక వీరులకూ స్వాగతం పలుకుతూ, వాయుదేవుడు నిర్మించిన ‘ఆకాశతోరణం’ అదృశ్యరూపంలో శాశ్వతంగా నిలిచి వుంటుందనీ, తపోధనులూ, జీన్ముక్తులైన మహాజ్ఞానులకూ భక్తియుతులకూ మాత్రమే ఆ తోరణ దర్శనభాగ్యం కలుగు తుందనీ, ఆ తోరణాన్ని దర్శించిన వారు జన్మాంతరంలో శాశ్వత విష్ణుసాయుజ్యం పొందుతారని సీతారాములు దీవించారు.ఇలా సీతారాములచే గండిక్షేత్రంలో చిత్రహనుమ ఉద్భవం సర్వమంగళకరంగా జరిగింది.
రెండు కొండల మధ్య ఆ తోరణం 1914లో అప్పటి కడప జిల్లా కలెక్టర్‌ సర్‌ ధామస్‌ మన్రోకి కనిపించినట్టు కడప జిల్లా గురించి మద్రాసు ప్రభుత్వం ప్రచురించిన గెజిట్‌లో పేర్కొనబడింది. మధ్వ సంప్రదాయానికి చెందిన వసంతాచార్యులు గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయన ఆంజనేయస్వామి భక్తుడు. ఉద్గవి గండి ఆచార్యగా ఆయన పేరొందారు. ఆయన పట్ల గౌరవ సూచికంగా కడ మధ్వసంఘం వారు గండి ఆలయంలోని ప్రధాన హాలులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఆంజనేయస్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని వసంతాచార్యుల వారికి కూడా నివేదన చేయడం ఇప్పటికీ సంప్రదాయంగా సాగుతోంది. గండి ఆంజనేయ స్వామి మూర్తి తేజోమయమైనది. సూర్యభగవానుని సదృశంగా ఆయన నేత్రాలు అత్యంత ప్రకాశవంతంగా, ధార్మిక కిరణాల సోకిన చందంగా ఉంటాయి. ఇక్కడి ఆంజనేయుని రూపం అభయ హస్తంతో ఉంటుంది. తనను భక్తితో కొలిచిన వారికి అభయం ఇవ్వడమే కాకుండా, వారిని ఆయన రుజుమార్గంలో నడిపిస్తాడన్నది తరతరాలుగా భక్తుల నమ్మకం.
ఆంజనేయ స్వామి ఆలయం కడపజిల్లా చక్రాయపేట మండలంలో నెలకొని ఉంది.ఈ ఆలయం నెలకొన్న గ్రామం వీరన్నగట్టుపల్లి అయినా, గండిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వేంపల్లి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో రాయచోటి రోడ్డులో నెలకొని ఉంది. రాయచోటి, వేంపల్లిల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. గండి ఆంజనేయ స్వామికి ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల నుంచి 8 గంటల వరకూ పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళ, శనివారాల్లో తమలపాకుల పూజలు జరుగుతాయి.


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS