Tuesday, August 14, 2018

శ్రీ కాంచీ క్షేత్రం

శ్రీ కాంచీ క్షేత్రం
*అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా!*
*పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః౹౹*
భారతదేశంలో గల సప్త మోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. అది మోక్ష విద్యకు మూల పీఠం. అద్వైత విద్యకు ఆధార స్థానం. ఆదిశంకరులు అధిష్టించిన కామకోటి పీఠ వైభవంతో ఆ నగర శోభ మరింత దేదీప్యమానమయింది. ఆదిశంకరుల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురు పీఠానికి ఇది ఆవాస భూమి.
'కాంచీ' అనగా మొలనూలు. వడ్డాణం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహముక్తి నొందిన పుణ్యస్థలం.
దేవర్షి అయిన అగస్త్యుడు తీర్ధాటనం చేస్తూ కాంచీ క్షేత్రానికి విచ్చేసి శ్రీ కామాక్షి దేవి ని పూజించాడు. "కామాక్షీ సదృశీదేవీ, నాస్తి మంగళ దేవతా."
శ్రీరామచంద్రుడు సీతా వియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచీ పట్టణానికి వచ్చి, అగస్త్య మహాముని వాక్యాన్ని పాటించి, ఇచట ఈశ్వరార్చన చేశాడు.
సర్వతీర్థం - కంచికి పశ్చిమంగా 'సర్వతీర్థం' సరస్సు ఉన్నది. ఇది సర్వ తీర్థాలకు సమాహారరూపమైన, సార్ధకమైన పేరు కలిగి ఉన్నది.
ఆమ్రవృక్షం - కంచిలో ఉన్న ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. దీనివల్లనే ఇచటి ఈశ్వరునికి 'ఏకామ్రేశ్వరుడు' అనే పేరు ప్రసిద్ధమైంది. ఈ వృక్ష దర్శనం సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. నేటికి ఈ వృక్షాన్ని కనులారా కాంచి సేవించుకోవచ్చు. శ్రీఏకామ్రేశ్వరుడు పృధివీ లింగరూపంలో ఉంటాడు.
*శ్రీ కామాక్షి అమ్మవారు*
కాంచీ క్షేత్రం చక్రాకృతిలో నిర్మితమైంది. ఈ క్షేత్రం మధ్యభాగాన బిందు స్థానీయంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారే ఇచ్చటి ప్రధాన దేవత. కంచిలోని దేవాలయం విమాన గోపురాలన్నీ కామాక్షి దేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి.
శ్రీ రాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన ఈ తల్లి ఇక్కడ సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చతుర్భుజ. కుడివైపు వెండి చేతిలో పంచపుష్పబాణాలు, పై చేతిలో పాశం, ఎడమవైపు వెండి చేతిలో ఇక్షుధనస్సు, పై చేతిలో అంకుశం.
ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్టించిన శ్రీ చక్ర అధిష్టాత్రి గా ఆ పరాశక్తి సూక్ష్మ రూపం గా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం.
ఇచట చిదాకాశ రూపమే అమ్మవారి కారణ రూపము. అఖండ సచ్చిదానంద రూపిణి అయిన ఆ పరదేవత యొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపాలను ఇక్కడ మనం దర్శించవచ్చు.
కంచిలోని ఏకామ్రనాథుని రథోత్సవం, శ్రీ వరదరాజ స్వామి రథోత్సవం మొదలైనవి, కంచిలోని ఏ దేవునికి ఏ ఉత్సవం జరిగిన అది శ్రీ కామాక్షి దేవి ఆలయ ప్రదక్షిణ రూపంగా అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు ప్రధాన వీధుల గుండా వెళ్లడం ఇప్పటికి సంప్రదాయసిద్ధమైన ఆచారం.
కంచిలోని వరదరాజ స్వామి ఆలయంలో కూడా ఎనిమిది స్తంభాల మంటపంలో వేదవ్యాస, శంకరుల శిల్పాలు ఉన్నవి.
ఇతిహాస ప్రశస్తి - కాంచీ క్షేత్రం వైదిక ధర్మ పోషణ,ప్రచారాలకు కేంద్ర స్థానమై సింహళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది. ప్రాచీన పురాణాల్లో 'బ్రహ్మశాల', 'దివ్యక్షేత్రం' అని ఈ పట్టణం వర్ణించబడింది. 'నగరేషు కాంచీ' అని కూడా ప్రసిద్ధిగాంచింది.
శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య గారి రచించిన 'నడిచే దేవుడు' పుస్తకం నుంచి సేకరణ.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS