Saturday, August 18, 2018

నవరాత్రుళ్ళల్లో అమ్మవారిని దుర్గగా పూజిస్తుంటాము. ఆ పేరు వెనక కథ దేవీభాగవతంలోని సప్తమ స్కందంలో ఉంటుంది.

ఓం  శ్రీ  దుర్గాయై  నమః .
దుర్గ
లలితసహస్రనామాలలో ఈ రోజుదుర్గాయైనమః ..ఆ నామం వెనక ఉన్న వృత్తాంతము.
"నవరాత్రుళ్ళల్లో అమ్మవారిని దుర్గగా పూజిస్తుంటాము.  ఆ పేరు వెనక కథ దేవీభాగవతంలోని సప్తమ స్కందంలో ఉంటుంది.
హరిశ్చంద్రుడి వృత్తాంతం విన్న  జనమేజయుడు, "హరిశ్చంద్రుడు శతాక్షి పాదభక్తుడని చెప్పావు. అమ్మవారు శతాక్షిగా ఏ విధంగా ఆవిర్భవించింది?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శతాక్షి శాకంబరి దుర్గ అన్న పేర్ల వెనక ఉన్న కథ వివరిస్తాడు వ్యాసుడు.
రురుడు అనే దానవుడు త్రిమూర్తులను గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు నిరంతరం అతనికి, అతని కుటుంబానికి తమ రక్షణ ఉంటుందని రురుడిని ఆశీర్వదిస్తారు.
రురుడికి దుర్గముడు అనే కొడుకు ఉంటాడు. అతను చాలా శక్తివంతుడుగా ఉంటాడు. దేవలోకం కూడా స్వాధీన పరుచుకోవటానికి తపస్సు చేయమని శుక్రాచార్యుడు ఆదేశిస్తాడు.
కాని తారకాసురుడు మహిషాసురుడు వరాలు పొంది తమ నాశనం తామే కొని తెచ్చుకున్న విషయం వివరించి, ఏదైనా వరం కోరుకునే సమయంలో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు.
సృష్ఠికి మూలమైన సర్వ విఙ్ఞానం పొందు పరిచి ఉన్న వేదాలను గురించి విని ఉన్న దుర్గముడు ఎట్లాగైనా వేదాలను హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో బ్రహ్మను గురించి తపస్సు చేయటానికి ఉపక్రమిస్తాడు.
యధాప్రకారం అతని తపస్సుకు మెచ్చి  ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడితో, తనకు మరణం లేకుండా వరమయినా, లేదా వేదాలనైనా ఇవ్వమని అడుగుతాడు. గత్యంతరం లేని బ్రహ్మ దుర్గముడికి వేదాలను ఇచ్చేస్తాడు.
వేదాలు లేని బ్రహ్మ సృష్టి కార్యం చేయలేక నిస్సహాయుడు అవుతాడు. మానవులకు ఆధ్యాత్మికత లోపించి నిత్య అనుష్టానాలు చేయటం కూడా మానేస్తారు. ఆ కారణంగా దేవతలు శక్తిహీనులౌతారు.
ఆ అదును చూసుకొని దుర్గుడు దేవలోకం మీదకు దండెత్తుతాడు. శక్తిహీనులైన దేవతలు ఆ దానవుడిని ఎదుర్కోలేక దేవలోకం వదిలి పారిపోతారు. ఆ నాటి నుండి అతను దుర్గమాసురుడు అన్న పేరుతో చెలామణి అవసాగాడు. భూమి మీద పరిస్థితి ఇంకా హీనంగా మారిపోయింది. వరుణదేవుడి శక్తిహీనత కారణంగా వర్షాలు లేక తీవ్రమైన క్షామం ఏర్పడి ప్రజలకు ఆహారం కూడా లేకుండా పోతుంది.
రక్షణ ఇస్తామని రురుడికి ఇచ్చిన వరం ఫలితంగా త్రిమూర్తులు దుర్గమాసురుడిని నిలవరించలేని నిస్సహాయులై ఉండిపోతారు.
ఆ విపత్కర సమయంలో, నారదుడు, శక్తిస్వరూపిణి పార్వతీదేవి ఒక్కతే తమను కాపాడ గలుగుతుందని సూచిస్తాడు. త్రిమూర్తులతో సహా దేవతలందరూ ఆదిశక్తిని ప్రార్ధిస్తారు.
పార్వతీదేవి తనలోని కాళీ మాతను దుర్గమాసురుడి వద్దకు వెళ్ళి వేదాలను తిరిగి తీసుకొని రావలసిందిగా ఆఙ్ఞాపిస్తుంది. కాళి తన వద్దకు వస్తున్న సమాచారం తెలిసిన దుర్గముడు ఆమె మీదకు పెద్దఎత్తున సైన్యాన్ని పంపిస్తాడు.
ఆ సైన్యాన్ని ఎదుర్కోవటానికి కాళి తనలోని నవమహావిద్యలను ప్రేరేపించి భీకర పోరాటం జరుపుతుంది.
అక్కడ హిమాలయాలలో తన గురించి ప్రార్ధిస్తున్న దేవతల వద్దకు చేరిన పార్వతికి భూమి మీద ఏర్పడ్డ క్షామం గురించి తెలుస్తుంది. వెంటనే దేవి శతాక్షిదేవి రూపంలో అనంతమైన నేత్రాలనుండి అశ్రువులు ధారాపాతంగా కార్చి భూమి మీద నదీనదాలన్ని జలాలతో నిండి పోతాయి. 
తరువాత శాకంబరీదేవి అవతారం దాల్చి తిరిగి భూమి మీద పచ్చదనం ఏర్పడి క్షణాలలో ధాన్యాలు ఫలాలు మొదలైన ఆహారం ప్రజలకు అందచేస్తుంది.
ఈ లోగా అక్కడ కాళిమాతకు దుర్గమాసురుడితో హోరాహోరీగా జరుగుతున్న పోరు గురించి తెలిసి కాత్యాయని రూపం, అంటే అష్టదశభుజ రూపంలో పార్వతి రణరంగానికి చేరుకుంటుంది. అత్యంత మనోహర రూపంలో ఉన్న పార్వతిని చూసిన ఆ దానవుడు ఆమెను మోహించి తనను పెళ్ళి చేసుకోమని వేడుకుంటాడు.
పట్టరాని ఆగ్రహంతో పార్వతీ దేవి తను పరమేశ్వరుడి పత్నిని అని తెలిపి, దానవుడు తస్కరించిన వేదాలని తిరిగి ఇచ్చేసి, అతను ఆక్రమించుకున్న దేవలోకాన్ని వదిలి పొమ్మంటుంది.
మాటామాటా పెరిగి తిరిగి యుద్దానికి దారి తీస్తుంది. శత్రువులతో పోరాడుతున్న నవమహావిద్యలు వారిని హతమార్చి కాత్యాయనిలోకి ప్రవేశిస్తారు. అన్ని శక్తులు కూడగట్టుకున్న కాత్యాయని దుర్గమాసురుడి సంహారం చేస్తుంది.
అట్లా నూరు నేత్రాలతో శతాక్షి అని, కూరలు పండ్లతో ప్రజలను కాపాడి శాకంబరి అని దుర్గమాసురుడిని వధించి దుర్గ అన్న పేర్లతో పూజలందుకుంటున్నది. సర్వం శ్రీ దుర్గా దివ్య మంగళ చరణ కమలే బ్య్యో నమో నమఃశారద పోలంరాజు గారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS