Monday, August 6, 2018

బుద్ద నీలకంఠ ఆలయం ఇక్కడ విష్ణుమూర్తే నీలకంఠుడు




ఇక్కడ విష్ణుమూర్తే నీలకంఠుడు!






విష్ణుమూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. కానీ, స్వామి యోగ నిద్ర భంగిమలో, నింగివైపు చూస్తున్నట్లుగా విగ్రహం ఉండే క్షేత్రం నేపాల్‌లోని ఖాట్మండు లోయలోని బుద్ధనీలకంఠ ఆలయం. అయిదు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత.


బుద్ధనీలకంఠ ఆలయం... ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. ఇది మూడుమూర్తులా ఆ నారాయణమూర్తి క్షేత్రమే. బుద్ధనీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. నేపాల్‌ రాజధాని ఖాట్మండు లోయలో ఉందీ క్షేత్రం. స్వామి పేరుమీదుగానే బుద్ధనీలకంఠ అనే ఊరిపేరు కూడా స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని నారాయణంతన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆది శేషువు మీద యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తి రూపాలు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉన్నట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం వెల్లకిలా పడుకొని నింగివైపు చూస్తున్నట్టుగా ఉండే బుద్ధనీలకంఠుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, సుమారు అయిదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటమే. ఈ కారణంగానే భక్తులనే కాకుండా పర్యటకులనూ ఎక్కువగా ఆకర్షిస్తోందీ బుద్ధనీలకంఠ క్షేత్రం.


స్థలపురాణం


ఈ భారీ రాతి విగ్రహం వందల సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతూ ఉందని ఈ ఆలయం మీద జరిగిన అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిదాని ప్రకారం... ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా, ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం కనిపించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వగా, భారీ విగ్రహం బయట పడింది. ఆ తర్వాత గ్రామస్థుల సహాయంతో ఈ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం... ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఇతడికి సామంత రాజూ, ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు.


హరిబోధిని...






విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తిక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ రెండింటినీ కలగలుపుతూ బుద్ధనీలకంఠ ఆలయంలో కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి, కొంతసేపు సేదతీరాడనీ భక్తుల విశ్వాసం. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తిక మాసం మొత్తం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నెలరోజులూ ఈ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కార్తిక శుద్ధ ఏకాదశి రోజున హరిబోధిని మేళాను నిర్వహిస్తారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం నిద్రపోతున్న మహావిష్ణువును మేల్కొల్పడం. ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మేళతాళాలతో భజనలతో ఆ రోజు ఈ ప్రాంతమంతా విష్ణునామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. బుద్ధనీలకంఠ ఆలయంతోపాటు పశుపతినాథ్‌ ఆలయం, స్వయంభూనాథ్‌ స్తూపం, మహాదేవ్‌ టెంపుల్‌, జానకీ మందిర్‌, వాల్మీకి ఆశ్రమాలు కూడా నేపాల్‌లో ప్రసిద్ధ హిందూ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.


ఇలా వెళ్లాలి...


బుద్ధనీలకంఠ ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు విమాన సదుపాయాలూ ఉన్నాయి. భారతదేశం నుంచి నేపాల్‌ చేరుకోవడానికి వివిధ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నేపాల్‌ పర్యటక శాఖ ఆలయానికి ప్రత్యేక బస్సులు


నడుపుతోంది. రైలుమార్గం ద్వారా... ఖాట్మండు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS