Tuesday, August 7, 2018

రాధాయ నమః " మహా మంత్రం

రాధాయ నమః " మహా మంత్రం
అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలోపరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.
అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన
లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం. వృషభానుడు,
కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు.
బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.
పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.
రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.
రాధాకృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS