Wednesday, February 12, 2020

భానువిద్య

భానువిద్య 

శ్రీవిద్యను అనేకమంది ఉపాసనచేసి తరించారు. వారిలో మనువు, చంద్రుడు మొదలైన 12 మంది శ్రేష్ఠులు అని గతంలో చెప్పుకున్నాం.
శ్రీవిద్య చంద్రకళా  విద్య. చంద్రుని యొక్క వృద్ధి క్షయాలనుసరించి దీనిని ఉపాసన చేసే సంప్రదాయం ఒకటి ఉంది. అలాగే శుక్లపక్షరాత్రులందు చివరిభాగంలో మాత్రమే దేవిని ఉపాసన చెయ్యాలి. అని సుభగోదయస్తుతిలోను, సౌందర్య లహరిలోను కూడా చెప్పబడింది.

అయితే శ్రీవిద్య చంద్రవిద్యయే కాదు భానువిద్య కూడా. ఆధారస్వాధిష్టానాలు అంధకారబంధురాలు. వాటిలో సమయులకు ప్రవేశం లేదు. సమయులు మణిపూరం దగ్గర నుంచే పరమేశ్వరిని ధ్యానించాలి అని శాస్త్రం చెబుతున్నది. ఆధారస్వాధిష్టానాలు అగ్నిమండలం. మణిపూరఅనాహతాలు సూర్యమండలం. విశుద్ది ఆజ్ఞలు చంద్రమండలం. ఇక్కడ పరమేశ్వరినిసూర్యమండలం నుంచే అర్చించాలి. చంద్రజ్ఞానవిద్యలో

*సూర్యమండలమధ్యస్తాం దేవీంత్రిపురసుందరీం 
పాంశాంకుశ ధనుర్బాణహస్తాన్ ధారయంతీం ప్రపూజయేత్*

సూర్యమండలంలో పాశము అంకుశము ధనుర్బాణాలు ధరించిన పరమేశ్వరిని అర్చించాలి. గౌడపాదులవారు దేవిఅర్చనను వివరిస్తూ

*సూర్యమండలమధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం 
పాశాంకుశధనుర్బాణ హస్తాం ధారయంత్రీం ప్రపూజయేత్ 
త్రైలోక్యం మోహయేదాసునరనారీ గణైర్యుతామ్*

సూర్యమండలంలో దేవిని అర్చిస్తే సకల జనవశ్యం కలుగుతుంది. కాళిదాసు తనచర్చాస్తవంలో

*యే చింతయం త్యరుణమండలమధ్యవర్తి 
రూపం తవాంబ నవయావక పంకరమ్యమ్ 
తేషాం సదైవ కుసుమాయుధబాణ భిన్న
వక్షస్థలా మృగదృశో వశగా భవన్తి*

అన్నాడు. ఈ రకంగా పరమేశ్వరి భానుమండలంలో ఉంటుంది. అంచేత అది భానువిద్య కూడా.పంచదశీ మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో సూర్యుడు ఒకడు. 

*అస్యశ్రీ సూర్యవిద్యాంబా మహామంత్రస్య | దక్షిణామూర్తి ఋషిః | పంక్తిచ్ఛందః సూర్యవిద్యాంబా దేవతా | హ సకల హ్రీం బీజం | హ స కహల హ్రీం శక్తిః | సకహల హ్రీం కీలకం | జపే వినయోగః* 
*న్యాసము : కూటత్రయముతో రెండు ఆవృత్తులు న్యాసము చెప్పాలి*.
*ధ్యానము : సకుంకుమవిలేపనా*........
*మంత్రము : హ స క ల హ్రీం | హ స క హల హ్రీం | సకహల హ్రీం*

పరమేశ్వరి భానుమండలంలో ఉంటుంది. అందుచేతనే ఆమెను సంధ్యాసమయంలో భానుమండలంలో ఉపాసించాలి. బ్రహ్మలోకానికి తలవాకిలి సూర్యమండలం. ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం చేసినవాడు అర్చిరాది మార్గం గుండా బ్రహ్మలోకంచేరి, కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంతాన కర్మబ్రహ్మతో కలిసి పరబ్రహ్మలో లీనమవుతాడు. అయితే బ్రహ్మలోకానికి తలవాకిలి సూర్యమండలం. అక్కడి దాకా వెళ్ళాడు జీవుడు. ఆ ద్వారాన్ని కొన్నివేలకోట్ల సూర్యులకాంతి కప్పి ఉంచుతుంది. అందుకని జీవి పరమేశ్వరుణ్ణి ఈశావాశ్యోపనిషత్తులో చెప్పినట్లుగా 

*హిరిణ్మయేన పాత్రేణ సత్య స్యాపిహితం ముఖమ్త
తత్ త్వం పూష న్న పాత్రుణు సత్యధర్మాయ దృష్టయే*

ఓ సూర్యుడా ! ప్రజాపతి పుత్రుడా ! స్వర్గవీధిలోని బహుదూరపు బాటసారీ ! సర్వపోషకా ! నీ కిరణాలను కాస్త తొలగించు. నీ కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహంతో నీరూపాన్ని చూడటానికి వీలుగా నీ తేజస్సును ఉపసంహరించుకో.
సత్యము యొక్క ద్వారాన్ని మెరుస్తున్న నీ బంగారు బింబం మూతలాగా కప్పి ఉన్నది. సత్యదర్శనం చెయ్యటానికి వీలుగా ఆ మూతను తొలగించు అంటాడు. ఆ రకంగా పరమేశ్వరుడు భానుమండల మధ్యవర్తి. భానుమండలమంటే మణిపూర అనాహతాలు. హృదయస్థానమే అనాహతం. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఈ విషయం వేదంలో చెప్పబడింది. ఇక ఆ దేవి భైరవి. అంటే భైరవునిశక్తి. ఆమె భగమాలిని. జగత్సృష్టికర్త. సుఖస్వరూపిణి. ఆనందరూపిణి ఐశ్వర్యప్రదాత. ఆమె పద్మాసనమనే యోగాసనంలో ఉంటుంది. ఆ పరమేశ్వరి పద్మనాభుని సహోదరి. ఆమె కనులు తెరిస్తే సృష్టి జరుగుతుంది. కనులు మూస్తే ప్రళయం సంభవిస్తుంది. ఆ పరమేశ్వరి చరాచరజగత్తంతా నిండి ఉంటుంది. అనేక శిరస్సులు, కనులు, కాలుచేతులు ఉంటాయి. జగత్తులో బ్రహ్మ నుంచి స్తంభం దాకా సృష్టించినది ఆమె. వర్ణాశ్రమాలను నిర్ణయించింది ఆమె. ఆమె మాటలే వేదాలు. లోకంలోని జీవులకు వారివారి కర్మలననుసరించి వారితో పాపపుణ్యాలనుభవింపచేస్తుంది. కర్మ శేషం అనుభవించటానికి ఉత్తరజన్మలు ప్రసాదిస్తుంది.

అవస్థాపంచకము, చంద్రవిద్య, భానువిద్య, భువనేశ్వరీ విద్య,కాత్యాయనీవిద్య, వాగ్వాదినీవిద్య, శివదూతీవిద్య, గాయత్రీమంత్రం, ఆత్మవిద్య. ఈ రకంగాఅనేకానేకమైన విషయాలను లలితాసహస్రంలో వివరించారు..

సూర్యుడు చేసిన ఉపాసన హాది విద్య అంటారు.. విషయ జ్ఞానం కోసం ఇక్కడ ఇవ్వబడినది కానీ గురువు ఉపదేశం లేకుండా ఈ మంత్రాన్ని సాధన చేయాకుడదు..

🌷శ్రీ మాత్రే నమః🌷

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS