ఆ పరమేశ్వరి యొక్క నాలుగవ మహా విద్యయే భువనేశ్వరి దేవి. భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భుః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః స్వర్గము ఈ మూడింటిని యేలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనే పేరు కూడా ఉంది.
ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడివుంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయనారంభించాడు. సృష్టి లో తాను కోరుకున్న ప్రతీ వస్తువునీ, ప్రతీ ప్రాణినీ బ్రహ్మ సృజించాడు. కానీ ప్రాణులలో క్రియా శక్తిని మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో, అరుణవర్ణంలో, కమలాసనయై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. అపై బ్రహ్మచే స్తుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టి లోని అణువణువులో క్రియా శక్తిగా ప్రవేశించింది.
పూరీలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరి దేవి అవతారంగా కొలవడం అక్కడి సంప్రదాయం. ఈ లోకాలన్నింటిని కాపాడేది ఆ తల్లే. దశమహావిద్యలలో కాళీ మాత మరియు భువనేశ్వరిదేవి అతిముఖ్యమహావిద్యలు. నారదపాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది. షోడశి మాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ. మహానిర్వాణతంత్రం ప్రకారం ఏడు కోట్ల మంది మహామంత్రిణులు ఈమె సేవలో సదా ఉంటారు.
దశమహావిద్యల వరుస క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభం అని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక ఐతే, తారా మాత ప్రారంభానికి ప్రతీక. షోడశిమాత నిర్మాణానికి ప్రతీక ఐతే, భువనేశ్వరి దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక. ఈ సృష్టి పరిణామక్రమమే ముందుకు సాగుతూ కమలా దేవి వద్ద
పూర్ణత్వాన్ని అందుకుంటుంది. బృహన్నీలతంత్రంలో అమ్మవారికి ఉన్న మూడు నేత్రాలు సృష్టి,స్థితి,లయాలకు ప్రతీకలని వివరించబడింది. సృష్టిలో అవ్యక్తరూపంలో భువనేశ్వరి దేవి ఉంటే, వ్యక్తంగా కాళీ మాత ఉంటుంది. అందుకే ఇద్దరికీ భేదమే లేదు.
పూర్వం దుర్గమాసురుడు క్రూరుడై, అభేద్య వరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను, దేవతలను బాధించసాగాడు. వాడి ప్రకోపం వలన భూమిపై జలధారలు ఎండిపోయి కరువు ఏర్పడింది. ఎంతో మంది తమ ప్రాణాలు విడిచారు. అప్పుడు ఋషులు, దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారికై ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారి కష్టాలను విన్న మాత తన సహస్ర అశ్రుధారలతో భూమిపై నదులను ప్రవహింపచేసి దుర్గమాసురుడి వలన ఏర్పడిన క్షామాన్ని తరిమికొట్టింది. వెంటనే భూమిపైన జీవకళ ఉట్టిపడింది. అమ్మ స్వయంగా తన చేతులతో శాకములను, కందాదిమూలాలను సృష్టించింది. అందువల్లనే అమ్మవారికి 'శాకంబరి' మరియు శతాక్షి అనే పేర్లు కూడా కలవు. అప్పుడు భువనేశ్వరి దేవి బాణములు, పాశము, అంకుశము మొ|| ఆయుధాలు ధరించి దుర్గమాసురుడిని సంహరించింది.
సంతానం కొఱకై భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది. రుద్రయామల అను గ్రంథంలో అమ్మవారి కవచము, నీలసరస్వతి తంత్రంలో అమ్మవారి హృదయము మరియు సహస్రనామాలు సంకలనం చేయబడి ఉన్నాయి. శ్రీలంకలోని నైనాతివులో, తమిళనాడులోని పుదుక్కొట్టైలో, ఒడిషాలోని కటక్ లో,గుజరాత్ లోని గోందల్ లో మరియు హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో అమ్మవారి ఆలయాలు కలవు.
No comments:
Post a Comment