Friday, March 18, 2022

లక్ష్మీప్రియం...ఐశ్వర్య ప్రదం

 లక్ష్మీప్రియం...ఐశ్వర్య ప్రదం



నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి.. 


చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. 


లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. 


సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి.


 అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. 


చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. 


ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...


రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.


 అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. 


నరకుడు చస్తే పండుగ ఎందుకు?


నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు.


 దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. 


వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. 


ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు.


 యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. 


అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. 


ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. 


లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 


అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.


దీపావళి నాడు ఏం చేయాలి?


ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. 


స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. 


ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. 


దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట.


 అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి.


దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?


దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది.


 వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.


అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి.


 అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. 


నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా.


 దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు.


 ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. 


తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి.


 దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.


లక్ష్మీపూజ ఇలా చేయాలి...


ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. 


అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. 


కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. 


ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. 


వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. 


మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. 


లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. 


లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.  


ఎన్నో కథలు... మరెన్నో కారణాలు..


లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది.


 భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. 


అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. 


దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. 


దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.


ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS