గుడిలో అర్చన చేయించుకుని హారతి ఎందుకు తీసుకుంటాము?
ఆలయంలో ప్రదక్షిణ చేసి గంట కొట్టి స్వామి వారికి భక్తుడు అర్చన చేయించుకుంటాడు. ఇక్కడ కొంత మంది మన గోత్రనామాలతో పూజ చేయించుకోవాలా? దేవునికి అన్నీ తెలుసు కదా మరల మనం మన గోత్రం, వగైరా చెప్పి పూజ చేయించుకోవాలా అని అడుగుతారు. నిజమే.భగవంతునికి అన్నీ తెలుసు. ఈ గోత్రనామాలు చేపుకోవడం మన ఆర్తి స్వామివారికి ఒక పద్ధతి ప్రకారం చెప్పుకోవడం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అక్కడ వరకు వచ్చి నీకు ఏమి కావాలో చెప్పుకోవడంలో తప్పేమిటి? అయినా అంతటా ఉన్న భగవంతునికి ఇక్కడకొచ్చి నువ్వేమి చెప్పాలి అంటే ఇక్కడ భగవంతుని శక్తి ప్రతిష్టితమై ఉంది. అసలు భగవంతుని ప్రాణప్రతిష్ట గురించి మరొక టపాలో వివరణ ఇతః పూర్వం ఇచ్చాను, తదుపరి టపాలో మరల ఇస్తాను. నీకు దేహభ్రాంతి ఉన్నంత కాలం, నీకు ఆకలిదప్పులు తెలిసినంత కాలం, నేను అనే స్పృహ ఉన్నంతకాలము నువ్వు నీ గురించి ప్రార్ధించాలి. కాబట్టి నీ గోత్రనామాలు చెప్పుకుని నీ పేర పూజ జరిపించుకోవాలి., సహకుటుంబస్య, సహబాంధవస్య అని చెప్పుకుంటే చాలు మొత్తం వంశవృక్షం చదవాల్సిన పని లేదు. దేవాలయంలో అష్టోత్తరమో, శతనామమో, సహస్రమో స్వామి వారికి అర్చన చేయిస్తాము. నవవిధభక్తి మార్గాలలో అర్చన చాలా విశిష్టమైనది. అర్చన మీద మరొక పోస్ట్ పెడతాను.
తీర్ధం ప్రసాదం గురించి ఎన్నో చర్చలు జరిగాయి. స్వామి అభిషేక తీర్థమో లేక తులసి దళాలు, కర్పూరం కలిపిన తీర్థం ఇవ్వడం సాంప్రదాయం. లోపలున్న దేవుని అభిషేక జలం సహజంగా శక్తివంతమైనది, మనలో ఉన్న పాపభారాన్ని దూరం చేసే ఈ తీర్థం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనల్ని ఆశ్రయించి ఉన్న పాపాలు, చెడు తలంపులు, నెగటివ్ ఎనర్జీ స్వామి తీర్థం తగలగానే తొలగుతాయి. సాంఘికంగా ఆలోచిస్తే తులసి, కర్పూరం కలిపిన తీర్థం మనలో ఉన్న కఫ పిత్త దోషాలను తీరుస్తాయి. అందరికీ ఈ విషయం చెప్పి వారి చేత తప్పక రోజు తాగించడానికి అందరినీ ఆలయ దర్శనం చేసుకుని తీర్థం తీసుకోమని చెప్పారు. అందువలన ఆ వైద్యలక్షణాలున్న తీర్థం వారిలో ఉన్న తాపాలను దూరం చెయ్యడానికి దోహదపడుతుంది. అదే విధంగా ఎన్నో ఆయుర్వేద లక్షణాలున్న తీర్థప్రసాదాలు భక్తులకున్న భౌతిక తాపాలు తీర్చగలవు.
పూర్తి అర్చన అయిన తరువాత దేవునికి హారతి ఇవ్వడం సాంప్రదాయం. ఏక వర్తి హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, లక్ష్మీ హారతి, కర్పూర హారతి ఇలా ఎన్నో రకాల హారతులు ఇవ్వడం సాంప్రదాయం. ఒకొక్క వర్తితో ఇచ్చే హారతికి ఒకొక్క గొప్పదనం. ఉదాహరణకు రెండు వర్తుల హారతి జీవాత్మ పరమాత్మ సంబంధితం అని చెబుతుంటే, త్రివర్తి హారతి మనకున్న సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలను తీర్చేది అని అనుకుంటే, నక్షత్ర హారతి ఏ మనిషైనా పుట్టే ఈ 27 నక్షత్రాల సాక్షిగా నిత్యం ఉన్న పరమాత్మ ఆ విగ్రహంలో ఉన్న దైవం అని చెప్పేది. ఇప్పటి విద్యుద్దీపాల వెలుగు లేని నాటికాలంలో ఈ హారతి ఇచ్చే సమయంలో విగ్రహాన్ని సంపూర్ణంగా దర్శించగలిగే అవకాశం కలిగేది. మరొక వివరణ ప్రకారం స్వామి వారి వైభవానికి కలిగే నరదృష్టి ఈ హారతిచ్చి తీసివేస్తారని చెబుతారు. దీప హారతి ఇవ్వడం అంటే అజ్ఞానతిమిరాంధకారాన్ని అంతం చేసే వెలుగును స్వామి అనుగ్రహంగా స్వామిని చూడడం అని. మనలో ఉన్న వాసనలు, ఇచ్చే హారతి వర్తి మన అహంకారం గా చెబితే అహాన్ని వెలిగించి అక్కడ వచ్చే దీపజ్యోతి లో పరమాత్మ దర్శనం చేసుకుని తరించడానికి ఈ హారతి తతంగం. స్వామికిచ్చిన హారతిని కళ్ళకు అడ్డుకోవడం ద్వారా స్వామి అనుగ్రహానికి నువ్వు పాత్రుడవు అయ్యావని చెప్పడం, ఆయన అనుగ్రహాన్ని గ్రహించడం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే, భౌతికంగా హారతి కర్పూరం కళ్ళకు మంచిది, ఒంటికి మంచిది.
గుడిలో మనం చేసే ప్రతీ విషయం సామాజికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా భక్తుడిని ఉన్నతి వైపు నడిపించేవే
No comments:
Post a Comment