Thursday, March 17, 2022

పరిషేచన ఎందుకు చేస్తారు?

 పరిషేచన ఎందుకు చేస్తారు?



పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు?


ఒక మహానుభావుడు “ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు. కాబట్టి మనకు ఇలా చెయ్యాలనిచెప్పారు. ఉత్తినే చేస్తే బావుండదని ఒక రెండు మంత్రాలు చెప్పారు” అని చెప్పాడు.


తమకు మాత్రమే తర్కం తెలుసు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలన్న తపన వలన ఇటువంటి అద్భుతమైన రత్నాల్లాంటి వాక్కులు అలా జాలువారుతూ ఉంటాయి.


నిజానికి భోజనం ముందు పరిషేచన చెయ్యడం లో ఒక పెద్ద రహస్యం దాగి వుంది.


”మనం తినే ప్రతీ మెతుకు మీదా మన పేరు రాసి ఉంటుంది”అంటారు పెద్దలు. అది నీకు ప్రాప్తం ఉండబట్టే తినగలుగుతున్నావు. 


సాత్వికాహారం  పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము.


తిన్న అన్నం జీర్ణం కావాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష.


”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (భగవద్గీత5-14)”


నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.


ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు. మనలో దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి.


ఇంటి ఇల్లాలు శుచి శుభ్రతలను పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, వంట చేస్తుంది.


శుచిగా ఉంటూ కేవలం భగవదారాధననే తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. 


వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని ఈమధ్యనే ఒక గొప్ప university వారు పరిశోధించి కనుక్కున్నారు.  ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం.


మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు నువ్వు నీ భోజనం అందిస్తే ) యజ్ఞం (మనం మామూలుగా యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ! “అదితే అనుమన్యస్వ. అనుమతే అనుమన్యస్వ. సరస్వతే అనుమన్యస్వ. దేవ సవితః ప్రసువ”అంటూ చేస్తున్న మనస్సుహోమగుండం చుట్టూ నీటితో పరిషేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్టు) తో పరిషేచన చేసి భోంచేస్తాడు. 


తానుతింటున్న ఆహారం కూడా ఒక పూజ, ఒక యోగం. నీలో ఉన్న దేవునికి నువ్వు హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది.


నువ్వు భోజనం ఒక పూజలా చేస్తే నీలో ఉన్న ఆ వైశ్వానరుడు తృప్తిచెంది నీకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS