Thursday, March 17, 2022

* శ్రీ పంచమి* లేదా వసంత పంచమి

 * శ్రీ పంచమి*  లేదా వసంత పంచమి 🌹🌹🌹



            మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు


           జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి.


 యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.


                   యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.


        శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:


మాఘ శుక్ల పంచమ్యాం


 విద్యారంభే దినేపి చ


పూర్వేహ్ని సమయం కృత్యా


తత్రాహ్న సంయుతః రుచిః ॥


                   వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.


             చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.


    పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.


           సరస్వతీ కటాక్షం:


 బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.


గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు.


     సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.


 వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి.


  అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి.


  తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS