Thursday, March 17, 2022

హోలీ

 #🚩హోలీ🚩 



హోలీ పండుగ వేద కాలం నాటిది. హోలాలతో చేసే హోమం లేదా యజ్ఞమే హోలీ. సగం పండిన ధాన్యాన్ని గడ్డిమంటలో కాలిస్తే హోలాలు అవుతాయి. వాటితో చేసిన యజ్ఞం నుంచి వెలువడే వాయువు ఆరోగ్యకరమని ఆయుర్వేదం చెబుతుంది. ప్రకృతి పరిణామంతో పాటు, పౌరాణిక గాథలతో ముడివడిన ఉత్సవంగానూ హోలీకి ప్రత్యేకత ఉంది. ఇది ‘నవ సస్యేష్టి’. అంటే, కొత్త ధాన్యాల్ని రైతులు హోమంలో వేయడం. పంటల్ని ప్రసాదించిన ప్రకృతికి కృతజ్ఞత తెలియజేయడమే హోలీ పండుగ విశేషం!

ఫాల్గుణ పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను- వసంతోత్సవం, మదనోత్సవం, కాముని పున్నమి, కామ దహనం అనే పేర్లతో పిలుస్తారు. ఈ ఉత్సవాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, పంజాబ్‌, బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, జమ్ము ప్రాంతాల్లో; పొరుగు దేశమైన నేపాల్‌లోనూ ఘనంగా చేసుకుంటారు. గోపికలతో కృష్ణుడు రంగోలి ఆడటాన్ని స్మరిస్తూ, బృందావనంలో ఈ సంబరాన్ని ఉత్సాహంగా జరుపుతారు. కామదహనాన్ని కొన్ని ప్రాంతాల్లో, వసంతోత్సవాన్ని మరికొన్ని ప్రాంతాల్లో విశేషంగా నిర్వహిస్తారు.

హోలీ పండుగ మరుసటి రోజు నుంచి కొత్త సంవత్సరాన్ని ఒడిశా ప్రజలు పాటిస్తారు.

ఇది రంగుల పండుగ. ఈ వేడుకలో భాగంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ఈ మాఘ శుద్ధ పంచమి వసంత రుతువు రాకను సూచిస్తుంది కనుక, ఇది వసంత పంచమి. మన్మథుడి అనుచరుడే వసంతుడు. ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంత రుతువు శోభ అంతటా వెల్లివిరుస్తుంది.

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడే కృష్ణుణ్ని ఉయ్యాలలో వేశారట. అందుకే దీన్ని ‘డోలీ ఉత్సవం’ అంటారు.

పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగేలా, దేవతలు మన్మథుణ్ని ప్రయోగించారు. శివుడికి తపోభంగం కలిగించడానికి మన్మథుడు పుష్ప బాణం వేశాడు. ఆగ్రహించిన ఆయన మన్మథుణ్ని భస్మం చేశాడు. అతడి భార్య రతీదేవి ప్రార్థనను మన్నించి, మన్మథుణ్ని శివుడు తిరిగి ‘అశరీరి’గా బతికించాడని పురాణగాథలు చెబుతాయి. మన్మథుడు పునర్జీవుడైన రోజు కాబట్టి, ఇది ‘కాముని పున్నమి’ అయింది.

ఇంకో ముఖ్యమైన గాథ ప్రహ్లాదుడికి సంబంధించింది. అతణ్ని చంపడానికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు ‘హోలిక’ను ప్రయోగిస్తాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మన్నించి, ఆ హోలికను విష్ణువు వధిస్తాడు. దుష్టురాలైన హోలిక హతమైనందుకు గుర్తుగా, ప్రజలు ఏటా హోలీ ఉత్సవం చేసుకుంటారని ప్రతీతి.

ఫాల్గుణ మాసంలో ప్రకృతి నూతన శోభ సంతరించుకొంటుంది. ఆ రుతు పరివర్తనకు మానవాళి రంగులతో స్వాగతం పలుకుతుంది. భోగి మంటల్ని తలపించేలా జ్వాలలు రగిలించడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. రైతులు పంటల్ని కోస్తూ ‘హో...హో...’ అంటూ చేసే సందడే కాలక్రమంలో ‘హోలీ’ పేరిట ప్రజల పండుగగా పరిణమించింది.

ఇదే హోలీ సందర్భాన్ని రెండు వేల సంవత్సరాలనాటి కావ్యాల్లోనూ కవులు వర్ణించారు. ‘గాథా సప్తశతి’లో పేర్కొన్న ఫాల్గుణోత్సవం ఇదే, మదనోత్సవమూ ఇదే! ‘దశకుమార చరిత్ర’లోనూ వసంతోత్సవ వర్ణన కనిపిస్తుంది. వసంతోత్సవం రెడ్డి రాజులు, విజయనగర రాజుల కాలంలో మహా వైభవంగా సాగినట్లు చరిత్రకారులు చెబుతారు.

హోలీ రంగుల్ని పరిచయస్థులు, బంధువులపైనే కాక- కొత్తవారిమీదా చల్లుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి, శత్రుత్వాల్ని దూరం చేసుకోవడానికి ఈ ఉత్సవాన్ని వినియోగించుకుంటారు. నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వ పత్రాలు, మోదుగ పూలు ఉపయోగించి తయారుచేసిన రంగులు ప్రమాదకరం కావు. హానికరమైన రసాయనాలతో చేసిన రంగుల్ని ఉపయోగించడం సరికాదు. మంచి సంప్రదాయాలే ప్రజలందరికీ సంతోషం, ఆరోగ్యం కలిగిస్తాయి!

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS