Wednesday, April 15, 2020

మాణిక్య ప్రభువు అవతారం :

మాణిక్య ప్రభువు అవతారం :
శ్రీ మాణిక్య ప్రభువు ఈశ్వరనామ సంవత్సరం 22-12-1817 మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు జన్మించారు.వీరి తండ్రిగారు మనోహర నాయకుడు, తల్లిగారి పేరు బయాదేవి. వీరిది కళ్యాణి నగరం ఇది గుల్బర్గాకు 50 మైళ్ల దూరంలో ఉంది.ప్రభువుల వారు చిన్నతనం నుండే మానవాతీత శక్తులను ప్రదర్శించేవారు, ఒక్కక్కప్పుడు మహారణ్యంలో మధ్యభాగానికి వెళ్లి అక్కడ పశుపక్షులు, జంతువులతో కాలము గడుపేవారు, ఒక్కోసారి కళ్యాణినగరం చుట్టుపక్కలవున్న తీర్ధక్షేత్రాలని సందర్శించేవారు. శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధములో శ్రీ అవధూతలీలలు ఏవైతే చర్చించారో అవన్నీ శ్రీ ప్రభువులవారు చేసి చూపేవారు.బాల్యంలోనే వారి అవధూతస్థితిని తెలియజేసే లీలలు ఎన్నో.
భీమాబాయి కథ :
అప్పారావు అనే బ్రాహ్మణుడు నిజాము సైన్యానికి చెందిన ఒక అరబ్బుల కంపెనీలో జమాదారుగా పనిచేసేవాడు.ఇతను మహాభాగ్యవంతుడు,ఇతని భార్యే భీమాబాయి. వీరికి సంతానం లేకపోవడంతో భీమాబాయి ఎన్నో నోములు,వ్రతాలు, ఉపవాసాలు చేసేది. అయినా ఫలితం లేకపోయింది. ఈమెకు ఒకరోజు కళ్యాణినగరమందున్న మాణిక్యప్రభువు మహిమల గురించి తెలిసింది. వెంటనే భర్త ఆఙ్ఞ తీసుకొని ప్రభువువద్దకు బయలుదేరింది. ధనవంతురాలు కావడంతో ఈమె వెంట దాసదాసీ జనం, కొంతమంది సిపాయిలు, గుఱ్ఱపురౌతులు వున్నారు. కళ్యాణినగరం ఒకమైలు దూరంలో ఉందనగా వీరికి కొంతమంది బాలురు కలిసి ఒక పిల్లవాడ్ని కొడుతున్న దృశ్యం కంటపడింది.ఆ దృశ్యాన్ని చూచిన భీమాబాయి ఒక సిపాయిని పిలిచి, పిల్లల తగవుకి కారణం ఏమిటో తెలుసుకుని పరిష్కరించమని ఆఙ్ఞాపించింది.
సిపాయి పిల్లల్ని గొడవకు కారణమేమిటని అడగ్గా, అంతవరకు దెబ్బలు తింటున్న బాలుడు ముందుకువచ్చి మేము బాలురము, తగవులాడుకొంటాం, ఈ వ్యవహారంలో నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావని ప్రశ్నించి - నిజంగా ఈ తగవులాటని పరిష్కరించాలనే కోరిక నీకున్నట్లయితే, వీరికి నేను ఎనిమిది గవ్వలు బాకీపడ్డాను, ఆ పల్లకీలోని స్త్రీ వీరికి ఎనిమిది గవ్వలను ఇచ్చినట్లయితే ఆమెకు ఎనిమిది మంది బిడ్డలు కలుగుతారని చెప్పాడు. ఆ సిపాయి పరుగునపోయి ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పాడు. భీమాబాయి వద్ద గవ్వలు లేకపోవడంతో పైకం ఇస్తానని చెప్పమంది. సిపాయి ఈ విషయం బాలునికి చెప్పగా - మాకు రూపయలక్కర్లేదు, గవ్వలు బాకీపడ్డాం గనుక గవ్వలే కావాలి అన్నాడు. ఎంత వెదికినా గవ్వలు దొరకలేదు, చివరికి ఒకసిపాయి తన పర్సుకి గవ్వలు కుట్టువుండటం చూచి అవి పనికివస్తాయేమోనని తలచి అవి పిల్లవాడికి ఇచ్చారు. ఆ గవ్వలు పుచ్చుకున్న పిల్లవాడు నీకు ఎనిమిదిమంది పిల్లలు కలుగుతారని చెప్పి మిగిలిన పిల్లలతో కలిసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.తాను గవ్వలిచ్చిన పిల్లవాడే ప్రభువు అని ఆమెకి తెలీదు.
వారు అక్కడ నుండి ప్రయాణం సాగించి చీకటిపడే సమయానికి ప్రభువు ఇంటికి చేరుకున్నారు. ఆమె ప్రభువు గురించి వాకబు చేయగా ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడూ తిరుగుతునే ఉంటాడని, ఎప్పుడు వస్తాడనేది ఎవరమూ చెప్పలేమని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రభువు దర్శనం అయ్యేవరకూ భోజనం చెయ్యడం భీమాజీకి ఇష్టంలేదు, కనుక రాత్రి భోజనం మానివేసి ప్రభువు కోసం ఎదురుచూస్తూ వుండిపోయింది.ఇలా మూడు రోజులు గడిచిపోయాయి, ప్రభువు రాలేదు భీమాజి ఉపవాసదీక్ష మానలేదు. చివరికి ఆమెపై ప్రభువుకు దయకలిగి హఠాత్తుగా ఇంటికివచ్చారు. వస్తూనే అమ్మా ఆకలిగావుంది నాకేమైనా పెట్టు అని అడిగి, భోజనం చేసిన తర్వాత ఇంటివద్దనే ఉన్న భీమాబాయిని చూచి నీకిదివరకే ఎనిమిది మంది సంతానాన్ని అనుగ్రహించాను, నన్ను ఇంకెందుకు బాధిస్తావు అన్నారు?. తాను గవ్వలిచ్చింది ఈ బాలునికేనని అప్పటికిగానీ ఆవిడ గుర్తించలేదు. ప్రభువు అనుగ్రహానికి సంతోషించి ఇంకొకదినం అక్కడే గడిపి తిరిగి హైదరాబాదు బయల్దేరింది.
బీదరు యవనులు :
బీదరులో తన శిష్యులను అనుగ్రహించి అనేక లీలలను చేసిన ప్రభువు ఒకనాడు ఒకే రూపంతో అనేక మంది శిష్యుల ఇళ్లకు వెళ్లి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విశ్వరూపదర్శనంతో ఆయన కీర్తి బీదరు అంతటా వ్యాపించింది. యవనులకు కూడా ప్రభువుపై భక్తివిశ్వాసాలేర్పడ్డాయి.కానీ కొందరు సంశయాత్మకులైన యవనులు మాత్రం ఆయన్ని పరిక్షించదలచారు. తాము పెట్టే పరిక్షలో ప్రభువు నెగ్గకపోయినట్లయితే ఆయన కీర్తికి భంగం కలుగుతుందని వారి ఆలోచన. అప్పటి హిందు, ముసల్మాను సంగమంలో అనేకమంది బైరాగులు, ఫకీరులు ఉన్నారు, అక్కడున్న వారిలానే ప్రభువు కూడా ఒక సాధారణ ఫకీరేనని నిరూపించాలని వారి తాపత్రయం. తమ ఆతిధ్యం నిరాకరించి, తాము పెట్టిన పదార్ధాలన్నిటినీ ఆయన స్వీకరించనట్లయితే ఆయన మీద హిందూ పక్షపాతి అనే ముద్రవేయాలనేది వారి ప్రణాళిక. దీంతో ఆయన హిందూ,ముస్లీంలు ఒకటే అని చెప్పే మాట ఒక బూటకంగా ప్రజలు గుర్తిస్తారని తలచారు. ఈ విధమైన అంచనాలతో ఒకరోజు ప్రభువుని తమ ఆతిధ్యం స్వీకరించవలసిందిగా అర్ధించారు, ప్రభువు అంగీకరించారు. ఆతిధ్యం స్వీకరించే రోజు రానే వచ్చింది, ఆతిధ్యం ఇచ్చే స్థలాన్ని వైభవంగా అలంకరించి, ప్రభువు కూర్చోవడానికి సభ మధ్యలో సింహాసనం ఒకటి ఏర్పాటుచేసారు. ప్రభువు రాగానే వారి మెడలో పూలమాల వేసి అలంకరించారు, వారి గౌరవమర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా ఏర్పాట్లు జరిగాయి.ప్రభువు సింహాసనం అలంకరించారు. భోజనపదార్ధాలు ఎవరి ఆసనం ముందు వారికి ఏర్పాటుచేసారు,పళ్లెముల్లో వున్న భోజనపదార్ధాలపై శుభ్రమైన గుడ్డలు కప్పారు, వాటిల్లో మాంసంతో తయారుచేసిన వంటకాలే ఎక్కువగా వున్నాయి.
భోజన సమయమైంది, ప్రభువు తన శిష్యునితో పళ్లెము పైనున్న గుడ్డను తొలగించమని ఆఙ్ఞాపించారు. గుడ్డతీయగానే పళ్లాలలో మాంసపు వంటకాల స్థానే ఖర్జూరాలు, మిఠాయిలు, పుష్పాలు కనిపించాయి. విందులో పాల్గొంటున్న వారందరూ తమ తమ పళ్లాలపైనున్న గుడ్డలను తొలగించగానే వాటిల్లోనూ మాంసపు వంటకాల బదులు ఖర్జూరాలు, మిఠాయిలు, పుష్పాలు కనిపించాయి. ప్రభువును హేళన చెయ్యాలని తలచిన వారెవరైతే ఉన్నారో, వారికి భయం పట్టుకుంది. ప్రభువు సామాన్యమైన మానవుడు కాదని, గొప్ప ఔలియా (మహాత్ముడు) అని గుర్తించి తమ తప్పును క్షమించమని శరణువేడారు. దయాహృదయులైన ప్రభువు వారిని క్షమించారు. ముసల్మానులందరూ ప్రభువుకు బ్రహ్మరధం పట్టారు. వారు హిందువులకివ్వదగ్గ బిరుదుల్లోకెల్లా అత్యంత పెద్దదైన "పీరాన్‌ పీర్‌ దస్తగిర్" అనే బిరుదునిచ్చారు. ప్రభువు ఖ్యాతి హైదరాబాదంతటా వ్యాపించి అచ్చటినుండి కూడా పెక్కుమంది ముస్లీంలు ప్రభువు దర్శనార్ధం రాసాగారు. ఇక బీదరులోని హిందువులు,ముస్లీంలు ప్రభువు గాదీని ఆక్కడ ఏర్పాటుచేయవలసిందిగా కోరారు. ముసల్మానులు అధికంగా నివసించు ప్రాంతంలో ప్రభువు తన గాదీని ఏర్పాటుచేయడానికి అనుమతినిచ్చారు.
నిర్యాణం :
శ్రీ మాణిక్య ప్రభువు తన నిర్యాణానికి ఆరు నెలల ముందే ఈ విషయం తన ముఖ్య శిష్యులకి వెల్లడించారు. ఆ నలుగుర్ని తామున్న కుటీరంలోనే ఒక గోతిని తవ్వమని చెప్పి, ఆ గోతిలోనే కూర్చొవడానికి ఒక అరుగును ఏర్పాటుచేయవలసిందని చెప్పి, ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచాలని వారిని ఆఙ్ఞాపించారు. దత్త జయంతి సమీపించడం చేత భక్తులందరూ తండోపతండాలుగా మాణిక్య నగరానికి రాసాగారు, గ్యార్వీ పండుగ కూడా అదే నెలలో వుండటంతో ముసల్మానులు కూడా అనేక మంది ప్రభువు దర్శనార్ధం వస్తున్నారు. ప్రభువుల వారు మార్గశీర్ష శుద్ధ దశమినాడు దర్బారు చేసి, భక్తులందరినీ ఎంతో ప్రేమగా ఆదరించారు. ఉదయం నుండీ సాయంత్రం వరకూ దర్బారు నిర్విరామంగా సాగుతూనే వుంది. అడిగిన వారికి లేదనకుండా ప్రభువు దాన ధర్మాలు చేస్తూనే వున్నారు. రాత్రి అవగానే ప్రభువు విశ్రాంతి కోసం కుటీరంలోకి వెళ్లారు. అదే ప్రభువుల వారు చేసిన చివరి దర్బారు. 1865 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజున ప్రభువుల వారు సమాధిలో యోగాసనంలో కూర్చున్నారు. తాత్యా మహరాజు గారి కుమారులిరువురిని పిలిపించుకొని వారిని కొద్దిసేపు తమ సన్నిధిలో కూర్చుండ బెట్టుకుని వారికి ప్రసాదాలిచ్చి, వారి మెడలో పుష్పహారాలు వేసి వారిని వెళ్లిపొమ్మని ఆఙ్ఞాపించారు. వారి వెళ్లిపోగానే వెంటనే గొయ్యి ముందరి భాగాన్ని మూసివేయమని ఆఙ్ఞాపించారు. తమ సమాధి విషయాన్ని పౌర్ణమి వరకూ గోప్యంగా వుంచమని, పండుగలు, ఉత్సవాలు యధావిధిగా జరుపవలసిందని ఆఙ్ఞాపించారు. దత్త జయంతి యధాప్రకారం జరిగింది. ప్రభువ దర్శనార్ధం వచ్చిన వారందరూ వారి దర్శనం కోసం పట్టుబట్టారు, కానీ ప్రభువు ధ్యానంలో వున్నారని దర్శనం ఇవ్వరని చెప్పడంతో కుటీరానికే నమస్కరించి భక్తులందరూ వెళ్లిపోయారు.
తరువాతి రోజు కుటీరం తీసివేసారు. ప్రభువు కనిపించకపోవడంతో భక్తులందరికీ వాస్తవం తెలిసిపోయింది, దాంతో భక్తులు మాణిక్య నగరాని విపరీతంగా వచ్చారు. వచ్చిన వారిలో కొందరు ముసల్మానులు ప్రభువు దర్శనానికి గట్టిగా పట్టుబట్టారు. కానీ బాపాచార్య మొదలైన శిష్యవర్గం కోపోద్రిక్తులైన భక్తులని శాంతింపజేశారు.
సాయితత్త్వం :
---------------
బాబా ఒకరోజొక కథ చెప్పారు," ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు.బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు, అప్పుడు వంటాకలపై గుడ్డకప్పి భగవంతుని ప్రార్ధించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబి పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు." ఈ లీల మాణిక్యప్రభువు వారు చేసారని మనం తెలుసుకున్నాం.
శ్రీ సాయి పూర్ణ దత్తావతారం కనుక, ఆయన త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి, జగద్గురువు. సనాతన ధర్మమూర్తియైన దత్తస్వామి శ్రీ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు.దత్తస్వామి ఏకనాధునికి, ఆయన గురువైన జనార్ధనస్వామికీ గూడ దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుల వారిని మన హిందూదేవతలలో ఒకరిగా కాక అన్ని మతాల్లోను మహనీయులగా వెలసి, మానవాళికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశకత్వం చేసే సద్గురుతత్త్వంగా గుర్తించాలి. అందుకే ఏ మతంలో వెలసిన మహనీయుని చరిత్ర చదివినా, వారి చరిత్రలన్నీ ఒకేలా ఉంటాయి.అంతటా ఉన్నది ఒకే తత్త్వం కాబట్టి అన్నింటా అదే వ్యక్తమౌతుంది. హిందూధర్మంలో దత్త స్వామిగాను, బౌద్ధంలో పద్మసంభవుడిగానూ, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుభానిలుగా ప్రకటమైంది ఒకే తత్త్వం. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు.
భారతదేశంలో హైందవేతర మతాలు ప్రవేశించిన తర్వాత అన్ని మతాలు తనవే కాబట్టి, ఈ మతాల మధ్య సామరస్యతని ఏర్పాటుచేసి మానవులందరిలో ఐకమత్యాన్ని నెలకొల్పడమే దత్తప్రభువుల వారి సంకల్పంగా కనిపిస్తుంది.శిరిడీ సాయిబాబా గారి అవతారానికి వచ్చే సరికి ఆయన అన్ని మతాలని ఒక్కటిగా చేసి, ప్రతి మతంలోని అత్యున్నతమైన విలువలని గ్రహించి ఒక మతాన్ని ఏర్పాటు చేసారు.అదే సాయి తత్వం. భగవంతుడు స్వయంభూః అన్నారు దీనర్ధం ఆయన్ని ఆయనే సృష్టించుకునేవాడని, అలాగే తనని తానే సృష్టించుకొని,తన పరిపాలనకు ఒక స్థానం అవసరం కాబట్టి శిరిడీని కేంద్రంగా చేసుకొన్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS