దశ మహావిద్యలు - కాళి మహా విద్యా
"కాళి" కాల రూపంలో ఉన్న ఈశ్వర శక్తి. తాంత్రికుల దృష్టిలో, యావత్ ప్రపంచము, ఒక మహా శ్మశానము. కాళి, కాల గమనములోని అనంతమైన కదలికలను, అనంత వేగముతో-తన సునిశితమైన నాట్య భంగిమలతో వ్యక్తము చేయును. ఆమె, సర్వమును కబళించు నిర్ధాక్షిణ్య మారణ ప్రక్రియకు సంకేతము.
అయితే, కాళి తత్వము నందు అనేక రూపాలు కలవు. దక్షిణ కాళి, భద్ర కాళి, శ్మశాన కాళి...ఇలా....
శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.
తంత్రంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాణ-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం, పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్కొంటాయి.
కాళీ తత్వాన్ని మనము విమర్శనాత్మకంగా పరిశీలిస్తే, ఆమె చర్యలలో దివ్యమైన విమర్శనాత్మక దృక్పథం దాగియున్నది. ఆమె చర్యలు సృష్టి కార్యక్రమానికి నాంది. ఆమె ఈ సృష్టి కార్యాన్ని తన అత్యంత పవిత్రము, శుభప్రదమైన భద్రకాళి రూపముతో నిర్వర్తించును. కాళి మహావిద్యా రూపము ఈ క్రింది విధముగా వర్ణించబడినది.
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీమ్ ।
చతుర్భుజాం ఖడ్గముణ్డవరాభయకరాం శివామ్ ॥
ముణ్డమాలాధరాం దేవీం లోలజ్జిహ్వాం దిగమ్బరామ్
చాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన సంవర్గ, ప్రాణ విద్యల ఆధారంగా కాళీ ఉపాసన జరుపవలెను. దేవతలలోని వాయువు, మానవులలోని ప్రాణము అనునవి రెండునూ ముఖ్యమైన సంవర్గములు. ఇవియే సకల ప్రాణికోటికి చైతన్య శక్తిని ఇచ్చునవి. ఈ ప్రాణవాయువు యొక్క వైశ్విక చైతన్య శక్తినే తాంత్రికులు "కాళి" గా ఉపాసిస్తారు.
కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.
ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.
కాళీమాతకు, కుండలినీశక్తికి సంబంధం ఉంది. ఎలాగంటే,ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే శక్తిలేక పోవటమే "నిద్రాణస్థితి" అంటే. కాళీమంత్రసాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.
కాళీ మాత మెడలో, పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలతో సమం. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుతమైన అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు. మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు. కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో, "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’ శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు. అంటే వాక్కు-దాని అర్థం అవిభాజ్యాలు కదా! అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.
పుర్రెలు శాశ్వతత్వానికి సూచన. ఎందుకని? మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్షకారాంతమయి. వర్ణమాల అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై SIR JOHN WOOD ROFFE (Arthur Avalon) ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు The Garland of Letters. అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.
ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి. కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు. మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు , 50 స్పందనలుగా (vibrations) ఉంటాయి. సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే. కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.
ఈ శరీరమందు, ఎడతెరపి లేకుండా జీవయాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణ వాయువును, ప్రతి గమనాగమన సంచారము నందు, చాంచల్యములేని ఏకాగ్రతతో పరిశీలించు వానిని కాళి రక్షించును. ఉచ్ఛ్వాస-నిశ్వాస గతులను అనుసరించుచూ, శ్వాస మూలమును పొందుచూ...ప్రాణాన్ని ఉపాశించువాడు కాళీప్రసాద పాతృడగును.
No comments:
Post a Comment