దత్తాత్రేయస్వామి యొక్క అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన పుణ్యస్థలం పిఠాపురం.
లోకకల్యార్థమై భగవద్రూపమైన అతీంద్రియ పరమాత్మ శక్తి దుష్టశిక్షణకు, సత్ పదార్థ రక్షణకు అవతారాలు స్వీకరిస్తుంది. అట్టి అవతారాలు స్థూలంగా మూడురకాలని చెప్పవచ్చు. అవి అంశావతారాలు, పూర్ణావతారాలు, జ్ఞానావతారాలు. ఇందులో దక్షిణామూర్తి, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు అనేవారు జ్ఞానావతారలని శాస్త్రాలు చెప్తున్నాయి.
దత్తాత్రేయుడు గురుస్వరూరం, మానవునిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయుని లక్ష్యం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనామార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తిసోపానాన్ని అధిరోహిస్తాడు. దత్తాత్రేయుడు స్మర్తృగామి అనగా సాధకుడు మనస్సులో తలచిన వెంటనే వచ్చి ఆదుకుని, ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు.
కలియుగంలో ప్రజలు ధర్మాన్ని విడచి, ఆచారహీనులై వ్యసనములకు బానిసలై శరీరసుఖమే పరమార్థంగా భావిస్తూ పతనమైపోతున్న దశలో భగీరథుడు పితృవిమోచనమునకై సురగంగను భూమిమీదకు తెచ్చినట్లుగా దత్తాత్రేయుడు తన అవతారమైన శ్రీ పాదవల్లభులను భూమిమీద అవతరింపజేసారు.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా పీఠికాపురంలో 1320 – 1350 మధ్యకాలంలో శ్రీ పాదవల్లభులు జన్మించినట్లుగా ఆధారాలున్నాయి.పిఠాపురం దత్తక్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం, శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.
పిఠాపురంలో రాజశర్మ సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. రాజశర్మ ఆపస్తంబగోత్రీకుడు, ధర్మకార్యతత్పరుడు. అతిథి అభ్యాగతులకు సేవచేసే స్వభావం కలవాడు. ఆయన ధర్మపత్ని సుమతి కూడా అన్నివిధాల తనభర్తకు అనుకూలవతి. ఇరువురూ దత్తాత్రేయుని భక్తులే.
ఇట్టి పుణ్యదంపతుల భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఒక అమావాస్య రోజున అనగా రాజశర్మ పితృకర్మచేయవలసి వచ్చిన రోజున అవధూతవేషములో వచ్చి భిక్షను అడిగాడు. బ్రాహ్మణ భోజనం పూర్తికాకుండా సాధువులకు భిక్షపెట్టే ఆచారము లేకపోయినా సుమతి ఆ అవధూతకు భిక్షను ఇచ్చుటచే, సంతోషించిన దత్తాత్రేయుడు తన నిజరూపాన్ని ధరించి సుమతిని ఏదైనా వరం కోరుకోమని ఆదేశించాడు.
దత్తాత్రేయ దర్శనంతో ఆనందసాగరంలో మునిగిన ఆమె దత్తుని అనేక విధాలుగా స్తోత్రం చేసి తనకు చాలామంది పుత్రులు కలిగి చనిపోయారని, మిగిలిన ఇద్దరు పుత్రులలో ఒకరు గ్రుడ్డివాడు, మరియొకడు కుంటివాడని, అందువలన తనకు యోగ్యుడైన దత్తుని వంటి కుమారుని అనుగ్రహించమని ప్రార్థించింది. దత్తాత్రేయుడు ప్రసన్నుడై తథాస్తు అని అనుగ్రహించాడు.
శ్రీపాదునికి 16 సంవత్సరాల వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు వివాహం చేయాలని సంకల్పించారు. తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గ్రహించిన శ్రీపాదుడు తండ్రిని సమీపించి, తనకు వైరాగ్యకన్యయందు మాత్రమే మనస్సు లగ్నమైందని, ఆమెతప్ప మిగిలిన స్త్రీలందరూ తనకు తల్లితో సమానమని, కాన విరక్తి స్తీని తెచ్చినచో స్వీకరించెదనని తెలియపరిచాడు. విరక్తిని సంపాదించడానికి యోగస్త్రీని స్వీకరించాలి. యోగానికి శ్రీ అనే పేరుంది కాబట్టి యోగవల్లభుడైన శ్రీపాదునికి శ్రీ వల్లభుడు అనే పేరు సార్థకమైంది.
చివరకు తల్లిందండ్రులను ఓదార్చి అమృతమైన చూపులతో తన సోదరులకు గల గ్రుడ్డితనాన్ని–కుంటితనాన్ని పోగొట్టి వారిని సంతోషపెట్టాడు. వారిరువురు కృతజ్ఞతతో శ్రీపాదుని పాదములు తాకగా వారు వేదశాస్త్రముల యందు పండితులైనారు. అప్పటినుండి వారందరూ శ్రీపాదవారై వేదశాస్త్రములయందు సంపూర్ణ పాండిత్యాన్ని సంపాదించి ప్రజాగౌరవాన్ని పొందసాగారు.
తల్లిదండ్రుల అనుమతితో అచటి నుండి ఉత్తర ముంఖంగా బయలుదేరి కాశీక్షేత్రాన్ని సందర్శించి, అచటి నుండి బదరికాశ్రమాన్ని చేరి నరనారాయణ దర్శనం చేసుకుని భక్తులకు దత్తదీక్షను అనుగ్రహించారు. నెమ్మదిగా పశ్చిమ సముద్రతీరమందున్న గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి అచటి నుండి కర్ణాటక రాష్ట్రంలోని కురుపురంలో కొంతకాలం భక్తులను అనుగ్రహించారు.
తన భక్తురాలికిచ్చిన వరం ప్రకారం శ్రీపాదవల్లభులు మహారాష్ట్రమునందలి కరంజియా గ్రామంలో నృసింహసరస్వతిగా అవతరించారు. వీరు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తూ కృష్ణపంచ గంగా సంగమమైన సరసోబావాడి అనే గ్రామంలో నివసించి అనేకమంది భక్తులను రక్షించి దత్తదీక్షను అనుగ్రహించారు. అచటి భక్తులయందలి వాత్సల్యంతో నిర్గుణపాదుకలు ప్రతిష్ఠచేసి సాంగ్లీజిల్లాలోని ఔదుంబర క్షేత్రంలో కొంతకాలం నివాసముండి మరికొంతకాలమైన తరువాత సమీపంలో గాణుగాగ్రామంలో గురుపాదుకలను ప్రతిష్ఠచేసారు. కొంతకాలం దేశసంచారం చేస్తూ చివరకు శ్రీ శైలఅడవుల యందలి కదళీవనంలో అంతర్థానమయ్యారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది.
అప్పటినుండి పీఠికాపురం, కురుపురి, కరంజియా, సరసోబావాడి, గాణగాపురం అనబడే అయిదు గ్రామాలు దత్తక్షేత్రాలుగా ప్రసిద్ధిపొందాయి. వీటిలో పీఠికాపురం ప్రధాన దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది
No comments:
Post a Comment