Sunday, April 26, 2020

అప్పన్న స్వామికి... చందన సేవ!



అప్పన్న స్వామికి...
           చందన సేవ!

ఏడాది పొడవునా చందనలేపనంతో దర్శనమిచ్చే ఆ స్వామి... అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆయనే సింహాచలం వరాహనరసింహుడు. చందనోత్సవం పేరుతో వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచలంలో ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమం భక్తజనావళికి కన్నులపండుగే!

ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే సుందర ప్రదేశం సింహాచలం. ఆ కొండల్లో వెలసిన స్వామే వరాహనరసింహుడు. అప్పన్నగా చందనలేపనంతో కనిపిస్తూ, ఆ పరిమళాలను వెదజల్లుతూ భక్తులను అనుగ్రహించే వరాహనరసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్యదైవం. పేరుకు ఉగ్రరూపుడే అయినా శాంతవదనంతో దర్శనమిస్తూ... కోరిన కోర్కెలు తీర్చే ఈ దేవుడు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంతో భక్తుల పూజలు అందుకుంటాడు. ఆ ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదియ. అంటే... అక్షయ తృతీయ. చందనోత్సవం పేరుతో జరిగే ఆ కార్యక్రమాన్ని ఆలయ పూజారులూ, పూసపాటి వంశస్థులూ కలిసి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఎందుకంత ప్రత్యేకత అంటే... ముందు స్వామి ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సిందే.


పురాణాల ప్రకారం... హిరణ్యాక్షుడిని వధించింది వరాహస్వామి. అలాగే ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుడిని సంహరించిన అవతారం నరసింహస్వామి. ఉగ్రరూపాలైన ఈ రెండు అవతారాల సమ్మిళితమే వరాహ నరసింహస్వామి. సింహాచలం కొండల్లో వెలసిన ఈ స్వామిని శాంతింపజేసేందుకే చందనలేపనాన్ని సమర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

చందనోత్సవం ఎందుకు.. ఎలా...
కొన్ని వందల ఏళ్లక్రితం అక్షయ తృతీయ నాడు పురూరవుడనే చక్రవర్తి వరాహనరసింహస్వామిని మొదటిసారి దర్శించుకున్నాడట. అప్పటినుంచే స్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనభాగ్యాన్ని ప్రసాదించడం ఓ సంప్రదాయంగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. వరాహ వదనంతో, మానవ శరీరంతో సింహాచల క్షేత్రంలో విలక్షణమూర్తిగా విలసిల్లిన స్వామి నిజరూపంతో దర్శనమిచ్చేది ఈ రోజే. సాధారణంగా మిగిలిన ఏడాదంతా స్వామికి పన్నెండు మణుగుల చందనాన్ని లేపనంలా అర్పిస్తారు. అక్షయ తృతీయ ముందురోజు ఆ చందనాన్ని తొలగించి, మళ్లీ కొత్త చందనాన్ని దశలవారీగా సమర్పించడం ఇక్కడ ఓ విశేషంగా జరుగుతుంది.

బంగారు గొడ్డలితో...
అక్షయ తృతీయకు వారం ముందునుంచీ ఈ చందనోత్సవం కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది. వారంముందుగా ఈ గంధాన్ని రంగరించే ప్రక్రియకు శ్రీకారం చుడతారు ఆలయ నిర్వాహకులు. స్వామికి సమర్పించే ఈ చందనాన్ని కేరళ నుంచి తెప్పిస్తారు. ఆ శ్రీగంధాన్ని మొదట ఆలయంలోని బేడా మండపంలో ఉండే రాళ్లపైన అర్చకులు నియమనిష్టలతో అరగదీసేందుకు ఉపక్రమిస్తారు. అక్షయతృతీయకు ముందురోజున బంగారుగొడ్డలితో స్వామిపైన ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. మర్నాడు స్వామికి సుప్రభాత సేవ చేసిన అనంతరం ఒక వెయ్యీ ఎనిమిది కలశాలతో సింహాచలం కొండలపై నుంచి వచ్చే గంగధార నీటితో అభిషేకిస్తారు. ఏకాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించలేకపోవచ్చు కానీ... అదయ్యాక స్వామి నిజరూపాన్ని దర్శించేందుకు భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. ఆ తరువాత ఆలయ స్థానాచార్యులు తూకం వేసి అరవైకిలోల వనమూలికలున్న సుగంధద్రవ్యాల్ని ముందుగా అరగదీసిన శ్రీగంధంతో మిళితం చేస్తారు. అలా మూడు మణుగుల చందనాన్ని స్వామికి అక్షయ తృతీయ రోజున సమర్పిస్తారు. అంటే దాదాపు ఇరవై కిలోల చందనం అన్నమాట. ఆ తరువాత మళ్లీ వైశాఖ పూర్ణిమ రోజున మరో మూడు మణుగులు సమర్పిస్తారు. మళ్లీ జ్యేష్ఠ పూర్ణిమ, అదయ్యాక ఆషాఢ పూర్ణిమరోజున మూడు మణుగుల చొప్పున గంధాన్ని స్వామికి అర్పిస్తారు. చివరకు శ్రావణ పూర్ణిమ నాడు మేలిముసుగు కరాళచందన సమర్పణతో ఈ క్రతువు ముగుస్తుంది. ఇందుకు మొత్తంగా దాదాపు 400 కిలోల చందనాన్ని వాడతారని చెబుతారు ఆలయ పూజారులు. చందనోత్సవం అయ్యాక మరుసటి రోజు నుంచే ఈ గంధాన్ని ప్రసాదంగా అందిస్తారు. స్వామిపైన ఉండే ఈ గంధానికి ఎన్నో ఔషధగుణాలున్నాయని భావించే భక్తులు.. దీన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే..
విశాఖపట్నంలో కొలువైన సింహాచలం అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. నగరానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు తిరుగుతుంటాయి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS