Wednesday, April 15, 2020

దత్తప్రభువు దినచర్య :

దత్తప్రభువు దినచర్య :


---------------------

దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -
ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.




శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.




శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్

తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II

V

తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.


దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!

ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’నందు చెప్పబడినది.

శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు.

శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది.
స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది.భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు. సర్ప,వృశ్చికాది జనిత విషబాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి. త్రికరణశుద్ధి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది.
శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం :

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే

మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

నాలుగు కుక్కలు:
నాలుగు వేదములు ఇవి.
శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.

ఆవు:
మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
మాల:
అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.

త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.

చక్రము:
అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

డమరు:
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

కమండలము:
సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును. 

 మార్గశిర పౌర్ణమి – దత్తాత్రేయ జయంతి




అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.

పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS