Monday, March 23, 2020

శ్రీ కన్యతీర్థం / సప్త మాతృకా క్షేత్రం .

శ్రీ కన్యతీర్థం  / సప్త మాతృకా క్షేత్రం  .
కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్దదండ్లూరు గ్రామ పొలిమేరల్లో పినాకినీ నది తీరాన భానుకొండల మధ్య అతి పురాతన శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కన్యతీర్థం పుణ్యక్షేత్రం.


సప్తమాతృకా క్షేత్రంగా, దేవ తీర్థంగా, అగస్త్యాశ్రమంగా కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంలా పురాణ కాలం నుండి విరాజిల్లుతున్నది ఈ పుణ్యక్షేత్రం.
దేవ కన్యకలు, దేవాది దేవతలు, మునులు, సిద్ద పురుషులు, మహాపురుషులు, చక్రవర్తులు, రాజులు ఈ క్షేత్రంలోని విజయదుర్గా అమ్మవారిని సేవించుకొన్నట్లు పురాణాలు, చారిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
స్థల పురాణం
మండలంలోని పెద్దండ్లూరు గ్రామం వద్ద పినాకినీ నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే దేవేండ్రు మొదలుకొని దేవతలు క్షేత్రంలో అమ్మవారిని సేవించుకొన్నందువల్ల దేవతీర్థం అని కూడా పేరుంది. కన్నెతీర్థమందు కొలువై ఉన్న విజయ దుర్గా మాత వెలసి ఇప్పటికి సుమారు 5 వేలు సంవత్సరాలకు పైగా అయినట్లు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తున్నది.

ఈ గుడి సమీపంలోనే అగస్త్యాశ్రమం ఉన్నది. వింద్య పర్వతాల మదమణచడానికి వచ్చిన అగస్త్య మహాముని చాలా కాలం జమ్మలమడుగు మండలంలోని చారిత్రక ప్రాంతం అయిన గండికోటకు ప్రక్కనున్న కోనలో నివాసం ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్ల ఆ కోనకు అగస్త్యేశ్వర కోన అనే పేరు వచ్చింది. అగస్త్యుడు ప్రతి రోజూ గండికోట నుండి కన్నెతీర్థం వచ్చి దుర్గామాతను కొలిచివేళ్లే వాడని ప్రతీతి.
క్షేత్రంలో నేటికి శ్రీ అగస్త్య ఆశ్రమం వుంది. దేవతలు, మహాపురుషులు, సిద్ద పురుషులు, మునులు అమ్మవారిని సేవించుకున్నారు. అలాగే క్రీ.పూ ఆచార్య సిద్ద నాగార్జునుడు, వౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్తు డు, అశోక చక్రవర్తి అమ్మవారిని దర్శించుకొని సేవించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే క్రీ.శ 2 నుండి 7వ శతాబ్దం కాలంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు, శాతవాహనులు, చౌళులు, హర్షవర్ధనుడు శ్రీ త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. క్రీ.శ.11వ శతాబ్దంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ఆంధ్రభోజుడుగా పేరొందిన శ్రీ కృష్ణదేవరాయులు క్షేత్రంను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఆ తరవాతి కాలంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, కాలజ్ఞాన బ్రహ్మ పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మవారిని సేవించినట్లు తెలుస్తోంది.
క్షేత్రం విశేషాలు: కన్యతీర్థం పుణ్యక్షేత్రంలో సప్తమాతృకా క్షేత్రం అత్యంత పురాతనమైనది. క్షేత్రంలోని అమ్మవారు బ్ర హ్మణి, మహేశ్వరి, కౌమారి, వారిహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి అనే పేర్లతో వృక్షాలు వున్నాయి. క్షేత్రంలో విఘ్నేశ్వర స్వామి, కాదంబరేశ్వరి దేవి, శక్తేశ్వరి, సుబ్రమణ్యం స్వామి, సప్తమాతృకలు, నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. క్షేత్రం మహిమలు గురించి పరాశర మహాముని రాసిన స్కంద పురాణంలోనూ, జైమిని భారతంలోనూ, శ్రీశైల పురాణంలోనూ గొప్పగా వివరించారు. కన్యతీర్థంలోని శ్రీత్రిపుర సుందరీ దేవి రూపంలో వున్న విజయదుర్గ అమ్మవారి మహిమలు విని జైనులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకున్నారు. దీనికి తార్కాణంగా జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రూటులో నాటి దేవనహళ్లి అయిన నేడు దేవగుడి వద్ద బాహుబలి విగ్రహం వుంది. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి గుడి పైభాగాన సిద్ద, బౌద్ద అస్తికల గూళ్లు చూపరులకు దర్శనమిస్తాయి.
విజయదుర్గా అమ్మ వారిని ఎందరో మునులు, మహర్షులు, సిద్ధులు, యోగులు, మహనీయులు, చక్రవర్తులు, రాజులు వచ్చి దర్శించినట్లు తమ తమ చారిత్రక గ్రంథాలలోను, శిలాశాసనాల్లోనూ రాసుకోవడం జరిగింది. కాగా అమ్మ వారికి సంబంధించిన శాసనాలు అగస్త్యేశ్వరకోనలోను, చెన్నై, తంజావూరులోని తెలుగు లైబ్రరీల్లోను, లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోను భద్రపరచి ఉన్నాయి. అమ్మ వారి గుడిలో గీర్వాణ భాషలో రాయబడిన శాసనం ప్రకారం కన్నెతీర్థం చుట్టు ప్రక్కల గ్రామాల్లో 18 పురాతన దేవాలయాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ఇక్కడికి సమీపంలో ఉన్న దేవగుడి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కూడా గీర్వాణ భాషలో రాయబడిన అనేక శాసనాలు నేటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శ్రీ కన్యతీర్థంనకు మరొక ప్రత్యేకత ఉంది. ఈ తీర్థం తిరుపతి, శ్రీశైల క్షేత్రాలకు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో అమరి ఉండడం ఒక విశేషం. ఈ మూడు ఆలయాల్లో ఒకే ఆచారం, పోలికలూ ఉండడం మరో విశేషం.
ఆలయ పునరుద్దరణ
పరరాజుల దండయాత్రలతో ధ్వంసమైన ఈశ్వర ఆలయాల ఉద్దరణకు 1954లో శివభారత గ్రంథకర్త గడియారం వేంకట శాస్ర్తీ, బ్రహ్మశ్రీ గోపయ్య స్వామితో కలిసి ఆలయ అభివృద్ధి చేశారు. నిత్యం జపతపాలతో స్వామిని అమ్మవారిని సేవించేవారని వారి శిష్యబృందం చెబుతున్నారు. జిల్లాలోని అతిపురాతన శైవ క్షేత్రాల్లో శ్రీకన్యతీర్థం కూడా ఒకటిగా విరాజిల్లుతున్నది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో పర్వదినాలు, శివరాత్రి రోజుల్లో కన్నుల పండువుగా వేడుకలు జరుగుతాయి.

Sivaratri special Telugu news papers. 
And courtesy with మా రాయల సీమ .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS