Wednesday, March 25, 2020

పన్నెండు జ్యోతిర్లింగాలతో కొలువైన లలితా సోమేశ్వరుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం ఉన్నది.

పన్నెండు జ్యోతిర్లింగాలతో కొలువైన
లలితా సోమేశ్వరుడు

తెలంగాణలో చరిత్ర, ఆధ్యాత్మికతలు మిళితమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రాచీన ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయ క్షేత్రం ఒకటి. సహ్యాద్రి కొండల్లో పుట్టిన కృష్ణమ్మ పడమర నుంచి తూర్పునకు వేల కిలోమీటర్లు పయనించి సప్తనదులు కలిసే సోమశిల దగ్గర తూర్పునుంచి ఉత్తరానికి పయనిస్తుంది. అలాంటి అరుదైన, అద్భుతమైన ప్రదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం ఒకటి ఉన్నది. పచ్చని ప్రకృతి, సహజసిద్ధ వనరులకు నెలవై కృష్ణమ్మ పరవళ్లకు వాకిలి లాంటి శ్రీశైలానికి సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్ర విశిష్టతే ఈవారం దర్శనం.

ఎక్కడ ఉన్నది?: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం ఉన్నది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే జడ్చర్ల, మహబూబ్‌నగర్ మీదుగా నాగర్ కర్నూల్ వెళ్లాలి. నాగర్ కర్నూల్-హైదరాబాద్ మధ్య 135 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాగర్ కర్నూల్ నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగర్ కర్నూల్ నుంచి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.

విశిష్టత: ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయంలో ఒకే మండపంలో 12 గుడులలో 12 శివలింగాలు ఉంటాయి. మరోవైపు సప్తనదులు కలిసి పారే కృష్ణమ్మ ఉంటుంది. ఇంత సుందరమైన అద్భుత పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. నిండుగా పారుతున్న కృష్ణమ్మ తాకిడికి తట్టుకోలేక దండకారణ్యం సైతం దారి వదిలితే రెండుగా చీలిన నల్లమల కొండ గట్టులకు సాక్ష్యంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కలిపి ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసే ్త సోమశిల గ్రామంలో 13వ శతాబ్దిలోనే కాకతీయులు ఈ 12 జ్యోతిర్లింగాలను ఒకే మంటపంలో ప్రతిష్టించడం విశేషంగా చెప్పుకుంటారు స్థానికులు. శ్రీ లలితా సోమేశ్వర దేవాలయంగా దీనిని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీ లలితాంబిక అమ్మవారి విగ్రహం దగ్గర శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడం మరో విశిష్టత.
ఉత్సవాలు
ప్రతియేటా తొలి ఏకాదశి, మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలతోపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. 4 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు జాతర భక్తుల సందడితో కోలాహలంగా జరుగుతాయి. కార్తీకమాసంలో ఆలయ ఆవరణంలోని ఉసిరిచెట్ల కింద ప్రత్యేక పూజలు, వనభోజనాలు చేస్తారు. ఇక్కడ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిళ్వపత్రి వృక్షాలున్నాయి.

తవ్వకాల్లో ఆనవాళ్లు: సోమశిల పరిసర ప్రాంతాల్లో పురావస్తు శాఖ వారు తవ్వకాలు చేపట్టారు. ఆలయాల పునర్నిర్మాణం కోసం తీసిన పునాదుల్లో బృహత్ శిలాయుగం నాటి నలుపు, తెలుపు రంగుల మట్టి పాత్రలు, మానవ అస్థి పంజర శకలాలు, ముడి ఇనుపఖనిజం రాళ్ళు లభించాయి. ఈ దేవాలయాన్ని పెకిలించేటప్పుడు సోమసూత్రం కింద విష్ణుకుండినుల రాజుల కాలానికి చెందిన ఇటుకలు బయటపడ్డాయి. దీని ప్రకారం ఇక్ష్వాక్షుల తర్వాత ఈ ప్రాంతం విష్ణుకుండినుల ఆధీనంలో ఉండేదని చెప్తారు. సప్తనదులు సోమశిలలో కలిసే ఈ ప్రాంతానికి చక్రతీర్థమనే మరో పేరు కూడా ఉంది. నైమిశారణ్యంలోని చక్రతీర్థానికి సమానమైన మహిమ కలదిగా ఈ చక్రతీర్థం ఖ్యాతి గడించింది.
స్థలపురాణం: ఇంద్రుని కోరికపై విశ్వకర్మ చక్రతీర్థ సమీపంలో నిర్మించిన శ్వేతశిఖరి అనే పట్టణమే ఈనాటి సోమశిల అని, అక్కడ చంద్రుడు రాజుగా ఉంటూ సోమేశ్వరుణ్ని పూజించి దానికి సోమేశ్వరమని పేరు పెట్టాడని, అదే క్రమంగా సోమశిలగా మారిందని చరిత్ర. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుని శాసనాల ఆధారంగా వారి కాలంలో ఈ ప్రాంతం గొప్ప పుణ్యక్షేత్రంగా విలసిల్లినట్లు ఆధారాలున్నాయి.

ఆలయ తరలింపు: శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో కృష్ణానది జలాశయంలో నీటి ముంపునకు గురైన గ్రామాల్లో సోమశిల ఒకటి. ప్రాచీన దేవాలయ చరిత్ర, శిల్పకళా ప్రాభవాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ గ్రామంలోని ద్వాదశ జ్యోతిర్లింగ సోమేశ్వరాలయాన్ని 1982లో అక్కడి నుంచి కృష్ణా నది ఒడ్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో డా.వి.వి. కృష్ణశాస్త్రి, ఎన్.ఆర్.వి. ప్రసాద్, డా.బి.సుబ్రహ్మణ్యం ప్రభృతుల కృషి మరువలేనిది. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఈ దేవాలయ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
టూరిజం: పర్యాటకశాఖ వారు సందర్శకుల కోసం సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 5గంటలపాటు సాగే ఈ ప్రయాణంలో పాపికొండలను తలదన్నేలా సుందరమైన, సహజసిద్ధమైన పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. నీటివెంట అలసట లేని ఈ ప్రయాణంలో కొండకోనలు, లోయలు, వాగులువంకలతో ప్రకృతి సౌందర్యం మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంకా రకరకాల గిరిజన జాతుల తెగలను, మల్లయ్యసెల కోటను తిలకించేందుకు రెండు కళ్ళూ చాలవనే చెప్పాలి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS