Tuesday, March 24, 2020

వేద స్వరూపిణిగా త్రిసంధ్యల్లో జపించే మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీ దేవిని కొలుస్తారు

వేద స్వరూపిణిగా త్రిసంధ్యల్లో జపించే మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీ దేవిని కొలుస్తారు. 

                             ఆ శక్తి స్వరూపిణి పంచముఖాలతో మహాశ్రీచక్ర మేరువుపైన కొలువైన క్షేత్రం రాజమహేంద్రవరంలోని అక్షర కోటి గాయత్రీ పీఠం. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలకు ప్రతీకలుగా ఇరవైనాలుగు రూపాల్లో అమ్మవారు పూజలందుకుంటున్నారిక్కడ.
‘న గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌’ అనేది పురాణవచనం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రంలేదని దీని అర్థం. రుగ్వేదంలో మొదట లిఖించిన మంత్రంగా గాయత్రీ మంత్రాన్ని చెబుతారు. గాయత్రి అన్న పదానికి ‘గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ’ అని ఆదిశంకరాచార్యులు భాష్యం చెప్పారు. అంటే... ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రమని భావన. అలాగే వాల్మీకి రామాయణానికీ మూలాధారం గాయత్రీ మంత్రమేనని పేర్కొంటారు. ఈ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో రామాయణ మహాకావ్య రచన జరిగిందని చెబుతారు. అటువంటి వేద స్వరూపిణికి నెలవైన ఆలయం రాజమండ్రిలోని అక్షరకోటి గాయత్రీ పీఠం. నగరానికి చెందిన సవితాల చక్రభాస్కరరావు ఆధ్వర్యంలో అఖండ గోదావరీతీరంలో కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రం ఎత్తయిన గాయత్రీ పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.అద్భుత నిర్మాణం
ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా ఉండే ఈ ఆలయ గోపుర నిర్మాణం ఆద్యంతం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. షడ్చక్రారంలో మొదటి ఆరు అంతస్తులూ, వాల్మీకి రామాయణంలోని ఆరు కాండలకు ప్రతీకలుగా మిగిలిన ఆరు అంతస్తులూ నిర్మించారు. ఆలయం కింద భాగంలో సుమారు వెయ్యి శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మేరువును ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలోనే నవగ్రహాలూ, సహస్రలింగేశ్వరుడి విగ్రహాలూ ఉన్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న ఇరవైనాలుగు అడుగుల కార్తికేయుడు, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి అంతస్తుని మూలాధార చక్రంగా పేర్కొంటారు. రెండో అంతస్తులో అయిదు శిరస్సులతో బ్రాహ్మి అవతారంలో గాయత్రీదేవి ఆశీనురాలై దర్శనమిస్తుంది. మూడో అంతస్తును మణిపురగా పిలుస్తారు. ఇందులో గాయత్రీ మంత్రంలోని మొదటి పాదంలో ఉన్న ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా అష్ట లక్ష్ముల రూపాలను ప్రతిష్ఠించారు. దాని పైఅంతస్తులో గాయత్రీ మంత్రంలోని రెండో పాదంలో ఉండే ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా మరో ఎనిమిది శక్తిస్వరూపాలను ఏర్పాటుచేశారు. ఆరో అంతస్తులో తుర్య గాయత్రీ మంత్రం ప్రకారంగా ఆజ్ఞాచక్రంలో చతుర్వేద మాతలను ప్రతిష్ఠించారు.రామాయణ శిఖరంగా...
వాల్మీకి రామాయణంలోని ఆరుకాండలకు సంకేతంగా ఆలయంలోని మొదటి ఆరు అంతస్తులనూ తీర్చిదిద్దారు. ఏడు, ఎనిమిది అంతస్తుల్లో అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్ఠించగా తొమ్మిదో అంతస్తులో నవ దుర్గలు, పదిలో దశ మహావిద్యలు, 11లో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలు, 12వ అంతస్తును ధ్యానమందిరాన్నీ నిర్మించారు. 144 అడుగుల ఎత్తున నిర్మించిన ఆలయ శిఖరాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణం గాయత్రీ మంత్రంతో ముడిపడి ఉంటుంది. రామాయణ మహా కావ్యంలో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలున్నాయి. గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరంతో రామాయణంలోని మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. అంతేకాదు ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక్కో అక్షరం చొప్పున మొత్తం ఇరవైనాలుగు వేల శ్లోకాల్లో గాయత్రీ మంత్రంలోని ఇరవైనాలుగు అక్షరాలు పొందుపరిచి ఉంటాయి. అందుకే అమ్మవారి ఆలయ శిఖరాన్ని రామాయణ శిఖరంగా తీర్చిదిద్దారు. వాల్మీకి విరచిత రామాయణ శ్లోకాలను ఆలయం గోడలమీద ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఒక్కో శ్లోకాన్నీ రాగి రేకుమీద ముద్రించి వాటిని గోడలకు తాపడం చేస్తున్నారు.
ఇలా చేరుకోవచ్చు
గోదావరి తీరంలో నిర్మించిన గాయత్రీ పీఠాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి బస్‌ స్టేషన్‌కి చేరుకుని అక్కడి నుంచి ఆటోరిక్షాల్లో ఈ పీఠానికి వెళ్ళొచ్చు. దేశం నలుమూలల నుంచీ రాజమండ్రికి రైలు సదుపాయం ఉంది. రైల్వే స్టేషన్‌కి అతి సమీపంలో ఉన్న ఈ పీఠానికి స్టేషన్‌ నుంచి నేరుగా నడిచి వెళ్లొచ్చు. రాజమండ్రి విమానాశ్రయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందీ పీఠం. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి గాయత్రీ మాతను దర్శించుకోవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS