Wednesday, March 25, 2020

సంతాన దేవత... ద్రౌపదమ్మ! పుత్తూరులో కొలువైన ద్రౌపదీ సమేత ధర్మరాజు ఆలయం విశిష్టమైంది

సంతాన దేవత... ద్రౌపదమ్మ! 
చిత్తూరు జిల్లాలోని దాదాపు ప్రతి గ్రామంలో పాండవుల గుడి, ధర్మరాజు ఆలయం, ద్రౌపదమ్మ కోవెల... ఇలా అనేక పేర్లతో పాండవులకు ఆలయాలు ఉన్నాయి. వీటిలో పుత్తూరులో కొలువైన ద్రౌపదీ సమేత ధర్మరాజు ఆలయం విశిష్టమైంది. పురాణాల ప్రకారం సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి ఛాయా రూపమైన ద్రౌపది ఈ క్షేత్రంలో భక్తులపాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది.

    అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా। పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌।। అంటే, అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ ఈ అయిదుగురు పుణ్యమూర్తులనూ ప్రతిరోజూ స్మరించినంతనే పాపాలు నాశనమవుతాయని భావం. అంతేకాదు ఇక్కడ వెలసిన ద్రౌపదిని అర్చిస్తే సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తెల్లదొరలు సైతం పూజించిన తల్లిగా పుత్తూరులోని 

ద్రౌపదీదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది.స్థలపురాణం 

సంతాన దేవత... ద్రౌపదమ్మ!

నాలుగు వందల సంవత్సరాల కిందట పుత్తూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కరవుకాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే పుత్తూరు సమీపంలోని చైటూరు గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి బావి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ద్రౌపది దేవి చెక్క విగ్రహం బయటపడింది. అదే రోజు రాత్రి వారిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపదీమాత కలలో కనిపించి తనకు దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించింది. మర్నాడు నిద్ర లేచిన చినతంబి తన స్వప్న వృత్తాంతాన్ని అన్నలకు చెప్పగా, వాళ్లు ‘మన దగ్గర ఆలయాన్ని నిర్మించేంత ధనం లేదు కాబట్టి, ఆ అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు సేకరించు’ అని చెబుతారు. అన్నల మాట ప్రకారం చినతంబి ద్రౌపది దేవి విగ్రహాన్ని నెత్తిమీద పెట్టుకుని, కొరడాతో కొట్టుకుంటూ, కత్తి సాము చేసుకుంటూ ఊరూరా తిరుగుతాడు. కార్వేటి నగర మహారాజు సాల్వవెంకట పెరుమాళ్ల దగ్గరకు వెళ్లి తన విద్యను ప్రదర్శించి, విరాళం అడుగుతాడు చినతంబి. కత్తితో కోసుకున్నా గాయాలు కాకపోడం చూసిన మహారాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అతడి దగ్గరున్న పదునైన కత్తిని ఇచ్చి, మళ్లీ కోసుకోమని చెబుతాడు. చినతంబి మహారాజు ఇచ్చిన కత్తితో కోసుకున్నా ఒంటి మీద ఒక్కగాయం కూడా కాదు. అది చూసి ముచ్చటపడిన రాజు ‘నీకు ఏం కావాలో కోరుకో’మని అడుగుతాడు. ద్రౌపదీదేవికి ఆలయాన్ని నిర్మించమని కోరతాడు చినతంబి. అందుకు అంగీకరించిన రాజు పుత్తూరులో ఆలయాన్ని నిర్మిస్తాడు. పుత్తూరు అంటే తమిళంలో కొత్త ఊరు అని అర్థం. ఈ ప్రాంతంలో పుట్టలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పుట్టల ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అది పుత్తూరుగా మారిపోయింది.ఏటా ఉత్సవాలు 
ఈ ప్రాంతం బ్రిటిష్‌ పాలన కింద ఉన్నరోజుల్లో ఒక తెల్లదొర పుత్తూరులో పర్యటించాడు. ద్రౌపది దేవి ఆలయాన్ని చూసి హేళనగా మాట్లాడాడు. ఫలితంగా ఆ అధికారికి చూపు పోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న అధికారి అమ్మవారిని క్షమించమని ప్రార్థించగా తిరిగి చూపు వచ్చింది. ఆ సందర్భంగా బ్రిటిష్‌ అధికారి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను జరిపించాడు. అప్పటి నుంచి ఏటా శ్రావణ మాసంలో ధర్మరాజు సమేత ద్రౌపదీదేవికి 18 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో కుతమత భేదం లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రతి నెలా అమావాస్య రోజున అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. సంతానంలేనివారు ఇందులో పాల్గొంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలోని ద్రౌపదమ్మను సంతాన లక్ష్మిగానూ అర్చిస్తారు. 
చూడదగ్గ ప్రదేశాలు 
పుత్తూరుకు చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం వేదనారాయణస్వామి, సురుటుపల్లి పల్లికొండేశ్వరస్వామి, అప్పలాయిగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, కార్వేటి వేణుగోపాలస్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. వీటితోపాటు రాజులనాటి కోట, కొలనును చూడొచ్చు. కైలాసనాథకోన, మూలకోన, శింగిరికోన మొదలైన ప్రాంతాలు పర్యటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 
ఇలా చేరుకోవచ్చు 
పుత్తూరు ద్రౌపదీదేవి సమేత ధర్మరాజు ఆలయం తిరుపతి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పుత్తూరు మీదుగా వెళ్లే తిరుత్తణి, అరక్కోణం, కంచి, సత్యవేడు, చెన్నై బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు. తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్ల నుంచి పుత్తూరుకు రైలు సౌకర్యం ఉంది. సప్తగిరి, గరుడాద్రి, చెన్నై - ముంబయి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు లోకల్‌ రైళ్లూ అందుబాటులో ఉన్నాయి.
- ఈ.శివరామ ప్రసాద్‌

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS