Thursday, March 26, 2020

అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌

అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌


ఆంధ్రప్రదేశ్‌లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా అయిన అనంతపురం చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జాలువారే జలపాతాలకూ, ఆధ్యాత్మిక పరిమళాలను పంచే ఆలయాలకూ అనంతపురం పెట్టింది పేరు.ఘన చరితకు ఆనవాళ్ళు

లేపాక్షి బసవయ్య
విజయనగర రాజుల కాలంనాటి శిల్ప కళాచాతుర్యానికి మచ్చుతునక అనంతపురం జిల్లాలోని లేపాక్షి. దేశంలోని నూట ఎనిమిది శైవ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ గ్రామం బయట 9 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు ఉన్న నంది విగ్రహం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఒకేరాతిలో ఏడు పడగల నాగేంద్రుడు. నాగేంద్రుడి పడగ నీడలో పాణిపట్టంపై శివలింగం చెక్కి ఉన్నాయి. పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తోంది.

 
ఎలా వెళ్ళాలి?: విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి హిందూపురానికి నేరుగా రైళ్ళు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 14 కి.మీ. దూరంలో, అనంతపురం నుంచి 120 కి.మీ. దూరంలో లేపాక్షి ఉంది. లేపాక్షికి ఆ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలున్నాయి
వసతి: లేపాక్షిలో ప్రభుత్వ అతిథి గృహం ఉంది. ఫలహారశాలలు, భోజన హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి.
 
రాయలవారి రెండో రాజధాని
అనంతపురం జిల్లాలో ప్రసిద్ధమైన పెనుగొండ, రత్నగిరి, రాయదుర్గం తదితర కోటలు ఉన్నాయి. వీటన్నిటికీ తలమానికమైనది పెనుగొండ దుర్గం. విజయనగర రాజుల చరిత్రలో ఈ గిరి దుర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పెనుకొండను గనగిరి, ఘనాద్రి అనికూడా పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు వేసవి విడిదిగా, తన రెండవ రాజధానిగా పెనుగొండ నుంచి పరిపాలించారు. ఇక్కడి గగనమహల్‌ ఈ కోటకే తలమానికం.
ఎలా వెళ్ళాలి?: అనంతపురం నుంచి 77 కి.మీ., హిందూపురానికి 37 కి.మీ. దూరంలో ఉన్న పెనుగొండకు ఆ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలున్నాయి.
 
నూటొక్క బావుల కోట
జిల్లాలో అతి పటిష్టమైన దుర్గంగా గుత్తి కోటకు ఎనలేని ఖ్యాతి ఉంది. ఇప్పటికీ గత వైభవాన్ని చాటి చెబుతూ విజయనగర రాజుల విజయ చిహ్నం, గజలక్ష్మి ఆకృతులు ఈ కోట గోడల మీద దర్శనం ఇస్తాయి. మూడువైపులా కొండలు ఆవరించి ఉన్న లోయలో గుత్తి పట్టణాన్ని నిర్మించారు. ఈ దుర్గం లోపల ఒకదాని తరువాత ఒకటిగా 15 కోటలు ఉంటాయి. ప్రతి కోటకూ ఒక సింహద్వారం ఉంటుంది. కోటలో మంచి నీటి సదుపాయం కోసం నూటొక్క బావులను ఆనాటి రాజులు తవ్వించారు.
ఎలా వెళ్ళాలి?: అనంతపురానికి 50 కి.మీ. దూరంలో, ముంబై, చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు నుంచి 20 కి.మీ. దూరంలో గుత్తికోట ఉంది.
 
శిల్పకళకు కాణాచి కంబదూరు
మండల కేంద్రమైన కంబదూరు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు, నిడిగల్లు చోళులు, విజయనగర రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కంబదూరు చెరువు జిల్లాలోని పెద్ద చెరువులలో ఒకటి. ఇక్కడ ప్రసిద్ధికెక్కిన మల్లికార్జున దేవాలయం, అక్కతంగేర దేవాలయం ఉన్నాయి. మల్లికార్జున దేవాలయ శిల్పకళ శోభాయమానంగా ఉంటుంది. ఆలయ ద్వార బంధం మీద గజలక్ష్మి, ఢమరు, త్రిశూలధారుడైన సదాశివుడు, శివగణం, శంఖ- చక్రధారి అయిన విష్ణువు, పద్మాసనుడైన బ్రహ్మ తదితర దేవతా రూపాలున్నాయి. ముఖ మండపాన్ని 12 స్థంభాలతో నిర్మించారు. ఆలయం పైకప్పు మీద చెక్కిన శిలా పద్మం అబ్బురపరుస్తుంది.
ఎలా వెళ్ళాలి?: అనంతపురానికి 88 కి.మీ., హిందూపురం నుంచి 82 కి.మీ. దూరంలో ఉన్న కంబదూరుకు బస్సు సదుపాయం ఉంది.
 
చిక్కవడియార్‌ చెరువు...అనంతసాగరం
అనంతపురం పట్టణంలో ఉన్న పురాతనమైన చెరువు అనంతసాగరం. ఈ చెరువు వల్లే ఈ నగరానికి అనంతపురం అనే పేరు వచ్చిందన్న కథనం ఉంది. క్రీ.శ. 1344 - 1377 మధ్య కాలంలో బుక్కరాయసముద్రం కేంద్రంగా తుళువ వంశస్థులైన హరిహరరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ సమయంలో వారి మంత్రి చిక్కవడియార్‌ ఈ చెరువును తాగు, సాగునీటి కోసం నిర్మించారు. దీనికి ఇరువైపులా అనంతసాగరం, బుక్కరాయ సముద్రం అనే గ్రామాలను ఆయన నిర్మించారని చరిత్ర చెబుతోంది. దీన్ని చిక్కవడియార్‌ చెరువు అని కూడా అంటారు. బుక్కరాయలు భార్య అనంతమ్మ పేరుమీద అనంతసాగరంగా, తరువాత అనంతపురంగా ఈ ఊరుకు పేరు వచ్చిందనేది మరో కథనం. చిక్కవడియార్‌ కణేకల్లు చెరువును కూడా తవ్వించారు. ఆయనకు కృతజ్ఞతగా నాటి ప్రజలు అక్కడ చిక్కణ్యేశ్వరుని పేరుతో ఓ గుడి నిర్మించారు. ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతున్నాయి.
ఎలా వెళ్ళాలి?: అనంతపురం పట్టణంలో ఈ చెరువు ఉంది.  
పర్యావరణ సౌందర్యం
జలపాతాల కోన
అనంతపురం జిల్లాలోని ఆలూరుకోన కొండలు, జలపాతాలతో అలరారుతోంది. రెండు కొండల నడుమ నుంచి ధారగా వచ్చే జలాలతో ఏడాదంతా జలపాతం కళకళళాడుతూ ఉంటుంది. ఇక్కడ నీరు దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇక్కడ ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం ఉంది. 14వ శతాబ్దంలో ఎర్రతిమ్మరాజు అనే రాజు ఆలయం నిర్మించినట్లు తాడిపత్రి కైఫీయతు ద్వారా తెలుస్తోంది. సుమారు 400 ఏళ్లపై బడిన చరిత్ర ఉన్న హజీ వలీ దర్గా కొండపై భాగాన ఉంది.
ఎలా వెళ్ళాలి?: ఆలూరు కోన తాడిపత్రికి 12 కి.మీ,. అనంతపురానికి 67 కి.మీ. దూరంలో ఉంది. తాడిపత్రి నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది.
 
బట్రేపల్లి జలపాతం...
అనంతపురం జిల్లాలో అతి పెద్ద జలపాతం బట్రేపల్లి జలపాతం. ఇది కదిరి రేంజ్‌ ఫారెస్ట్ లో ఉంది. సుమారు 80 అడుగుల ఎత్తైన కొండ నుంచి జలపాతం పడుతూ చూపరులను ఆకట్టుకుంటుంది. కొండల పైభాగంలో గుండాలున్నాయి. వర్షాకాలంలో ఆ గుండాలు నిండి, వాటి నుంచి పారే నీరు జలపాతంలా ఉరకలేస్తుంది. వర్షాలు ఆగిన తర్వాత కూడా సుమారు 15 నుంచి 20 రోజుల పాటు జల ధారలు ఉధృతంగా ఉంటాయి. దగ్గర్లో చూడదగిన మరో ప్రదేశం కటారుపల్లి యోగి వేమన సమాధి.
వసతి: స్థానికంగా వసతి సదుపాయాలు లేవు. సందర్శకులు కదిరిలో బస చేయవచ్చు.
ఎలా వెళ్ళాలి?: ఈ జలపాతం బట్రేపల్లికి ఒక కి.మీ., కదిరికి 15 కి.మీ., అనంతపురానికి 105 కి.మీ. దూరంలో ఉంది. కదిరి నుంచి తలుపుల వెళ్లే బస్సుల్లో కానీ, కదిరి- పులివెందుల వెళ్లే బస్సుల్లో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు.
 
గిన్నిస్‌కెక్కిన మర్రిమాను
మహా వృక్షంగా పేరుగాంచిన తిమ్మమ్మ మర్రిమాను ఈ జిల్లాలో పర్యాటకులు చూసి తీరాల్సిన మరో ఆకర్షణ. సుమారు 8.50 ఎకరాల్లో విస్తరించిన ఈ మర్రిమాను అనంతపురం జిల్లా గాండ్లపెండ మండలంలోని రెక్కమాను అనే గ్రామంలో ఉంది. ఇది పధ్నాలుగవ శతాబ్దం నాటిదనడానికి ఆధారాలు ఉన్నాయి. 1989లో తిమ్మమ్మ మర్రిమానుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. స్థానికంగా పక్షుల సందర్శన శాలనూ, శివ ప్రాజెక్టు, ఇక్కడికి 14 కి.మీ. దూరంలోని కటారుపల్లి యోగివేమన సమాధి చూడదగిన ప్రధాన ప్రదేశాలు.
వసతి: ఇక్కడ ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గెస్ట్‌ హౌస్‌ నిర్మించింది. ప్రస్తుతం రెస్టారెంట్‌ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన గెస్ట్‌ హౌస్‌ కూడా ఉంది.
ఎలా వెళ్ళాలి?: కదిరి- రాయచోటి జాతీయ రహదారి మార్గమధ్యంలో రెక్కమాను నుంచి 10 కి.మీ., కదిరికి 28 కి.మీ. దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఆ ప్రాంతాలనుంచి బస్సు సౌకర్యం ఉంది.
 
కుంభకర్ణ ఉద్యానవనం
జిల్లాలో శయన కుంభకర్ణుడి భారీ విగ్రహం సందర్శకులనూ, ముఖ్యంగా పిల్లలనూ ఎంతో ఆకట్టుకుంటోంది. పెనుకొండ మండలంలోని పెద్దచెరువుకట్ట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద 7.50 ఎకరాల్లో 2002లో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు 30 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో- నిద్రిస్తున్న కుంభకర్ణుడి విగ్రహం, అతన్ని నిద్ర లేపుతున్న రాక్షసుల ప్రతిమలు, ఏనుగుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి?: పెనుగొండ నుంచి రోడ్డు మార్గంలో పెద్దచెరువుకట్టను చేరుకోవచ్చు. 
 
ముగ్ధ మనోహరం ధర్మవరం పట్టు
పట్టుచీర అంటే వెంటనే గుర్తొచ్చేది అనంతపురం జిల్లా ధర్మవరం. అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరలు తయారు చెయ్యడం ఇక్కడి నేత కార్మికుల ప్రతిభకు నిదర్శనం. ఈ పట్టుచీరల ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ధర్మవరానికి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చింది. జిల్లాలో నెలకు దాదాపు 1.60 లక్షల పట్టుచీరలు తయారవుతున్నాయి. ఒక్కో చీర ఖరీదు రూ. 6 వేల నుంచి రూ. 70 వేల వరకూ ఉంటుంది.
ఎలా వెళ్ళాలి?: అనంతపురానికి 60 కి.మీ. దూరంలో ధర్మవరం ఉంది.
 
ఆధ్యాత్మిక ధామాల కొలువు
అనంతపురం జిల్లా ఆధ్మాత్మిక కేంద్రాలకు నెలవు. అనంతపురం నగర శివారులోని ఇస్కాన్‌ మందిరం, కదిరి నరసింహస్వామి దేవాలయం, సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి), చింతల వెంకటరమణస్వామి దేవాలయం (తాడిపత్రి), బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (తాడిపత్రి), కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెన్నహోబిలం నరసింహస్వామి దేవాలయం... ఇలా సందర్శనీయ ఆలయాలెన్నో ఈ జిల్లాలో ఉన్నాయి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS