Wednesday, March 25, 2020

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం
పరబ్రహ్మ స్వరూపం

దానం చేయడానికి ఎన్ని వస్తువులున్నా.. అన్నమును దానం చేస్తే మాత్రం విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. జన్మజన్మలకూ ఆ పుణ్యం సంప్రాప్తిస్తుంది. పరబ్రహ్మ స్వరూపమైన అన్నం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా గౌరవించాలి. అవసరంలో ఉన్న ఆకలిగొన్నవారికి దానం చేయాలి. అన్నం వండేటప్పుడు కూడా మంచి మనసుతో, సత్సంకల్పంతో ఉండాలి. లేకుంటే కలి ప్రభావానికి లోనవుతారంటున్నది అన్నసూక్తము. అందుకే మంచి మనసులో వండి, మంచి దాతగా అన్నమును దానం చేద్దాం.

అన్నమ్ న పరిచక్షీత అన్నమును దొంగిలించకు. ఎందుకనగా, అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్నము పరమాత్ముని రూపం. అన్నములో అతని తేజస్సు నిండి ఉన్నది. అన్నమును ఒకరి నుండి దాన రూపంలో స్వీకరించాలే గానీ దొంగిలించరాదు. ఇక్కడ మరొక విశేషం తెలుసుకోవాలి. అన్నమును దొంగిలించుటతో పాటు అమ్మడం కూడా పాపకరమైన కార్యమే. నేడు వీధికి వందల సంఖ్యలో అన్న విక్రయశాలలు ఉన్నవి. ఇందులో వండబడినవి రుచికరమైనప్పటికీ మంచి జ్ఞానమును పెంపొందింపలేవు. ఎందుకనగా మొదటగా ఆ వంటలు భగవంతునికి నివేదింపబడవు. రెండవది వంట వాళ్లు దేహశుచిని పాటిస్తారేమో గానీ ఆత్మశుచిని పాటించడం అరుదే.

కల్మషమైన మనసుతో వండే పదార్థాలలో సూక్ష్మమైన రూపంలో కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అలాంటి అన్న పదార్థాలు తిన్నవారిలో కూడా కలిపురుషుని ప్రభావం ఎక్కువ అవుతుంది. వాటి ప్రభావ తీవ్రతతో మనుషుల్లో కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలు పెరిగి, చివరికి మొత్తం సమాజం కలుషితమై, కష్టాల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనలను కలిబాధ నుండి తప్పించేందుకే వేదాలు పాకులాడుచున్నవని అన్నసూక్తం ద్వారా ప్రజలు గ్రహించాలి. వేదజ్ఞానం ప్రజాహితాన్నే కోరుతున్నది గానీ, ప్రజలను మూఢులను చేయడం లేదు కదా.


అన్నోపాఖ్యానం

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం, వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించరు కూడా. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది. వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తే, దానికి రుచితో పాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా ఉంటాయన్నది పూర్వీకుల విశ్వాసం. లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా ఉంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయ బ్రాహ్మణం వివరిస్తుంది. దాత, అదాత ఇద్దరూ అన్న సంపాదనకు ప్రయత్నిస్తారు. కానీ దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైంది. అదాత తాను తినడం కోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడని శ్రుతి పేర్కొంటోంది.



అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైందికూడా. మనం తినే అన్నాన్ని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెబుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమ గల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒకరకంగా విషాన్ని భుజిస్తున్నట్టే. యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నికి ఆహుతి చేసే అన్నం మేఘం అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమి మీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు. పరిశుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు గలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి. కాబట్టే ఇన్నింటిని సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది. 
-తపోఋషి రాజశేఖర శర్మ

అన్నమునకు గౌరవం
అన్నమ్ బహు కుర్వీతా అన్నమును అనేక విధాల సన్మానించాలి. ఎందుకనగా అన్నము పంచ భూతాలూ, పంచతన్మాత్రలనూ తనలో ఇముడ్చుకొన్నది. అన్నము భూమిలో పండుతుంది. అది పండడానికి వర్షం కావాలి. వాతావరణంలో సరైన వేడి ఉండాలి. అన్నము వలెనే పంచప్రాణాలూ (పంచవాయువులూ) తృప్తినొందును. అన్నములో చక్కటి గంధము (వాసన) ఉన్నది. అన్నములో రుచియనే స్పర్శ విశేషమున్నది. అన్నములో పరమాత్ముని రూపమున్నది. అన్నములో అమృతము అనే రసమున్నది. ఈ విధంగా పంచభూతాలు, తన్మాత్రలను కలిగిన అన్నమును మనం పవిత్ర భావనతో చూడాలి. లోకంలో ఏ వస్తువునైనా దానం చేయవచ్చు. కానీ అన్నం శ్రేష్ఠమైనది. ఓ వ్యక్తి ఉపవాసం ఉండి, పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచి పెడతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. ధనం, బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింత అధికంగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికంగా ఆశించడు. అన్నదానాన్ని చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలకు శుభ ఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అందుకే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వంటి శుభకార్యాల్లో అన్నం పెడతారు. అలా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు కొత్త వధూవరులకు ఆశీర్వాదంగా మారుతాయని పండితులు చెబుతున్నారు.

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.



ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS