Wednesday, March 25, 2020

కర్నూలు జిల్లా పర్యాటక స్థలాలు బెలూం గుహలు శిలావనాల ఓర్వకల్లు కనువిందు చేసే కేతవరం గుహలు చరిత్రకు సాక్షి కొండారెడ్డి బురుజు అరుంధతి (పాతపాడు) బంగ్లా ఆదోని కోట నల్లమలలో జంగిల్‌ సఫారీ!

.
కర్నూలు జిల్లా
పర్యాటక స్థలాలు


ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని పంచే సహజసిద్ధమైన వనాలూ, ప్రదేశాలతో పాటు పెద్దలకు ఆధ్యాత్మికంగా స్వాంతననిచ్చే పర్యాటక స్థలాల సమాహారంగా భాసిల్లుతోంది కర్నూలు జిల్లా. ముఖ్యంగా వేసవి సెలవుల్లో యాత్రలకు అనుకూలమైన ప్రదేశాలెన్నో ఈ జిల్లాలో ఉన్నాయి.
మల్లన్న చెంత కృష్ణమ్మ పరవళ్ళు


కృష్ణా నదిపై శ్రీశైలం మల్లన్న ముంగిట పాతళగంగకు అడ్డుకట్ట వేస్తూ శ్రీశైలం జలాశయం నిర్మించారు. జలాశయం ఇరువైపులా పచ్చదనంతో విలసిల్లే నల్లమల కొండలనూ, ఆ కొండల మధ్య నుంచి పరుగులు పెట్టే కృష్ణమ్మ పరవళ్లనూ చూడడానికి రెండు కళ్ళూ చాలవు. జులై, ఆగస్టు మాసాల్లో వరదలకు జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోగానే 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతారు. ప్రాజెక్టు ఎగువన జలాశయంలో విహరించేందుకు బోటింగ్‌ సౌకర్యాన్నీ, పాతాళగంగలో దిగేందుకు రోప్‌వేనీ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.

ఎలా వెళ్ళాలి?: కర్నూలు నగరం నుంచి ఆత్మకూరు, దోర్నాల, సున్నిపెంట మీదుగా రోడ్డు మార్గంలో సుమారు రెండు వందల కి.మీ. ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి దోర్నాల మీదుగా వెళ్లాలి. హైదరాబాద్‌ నుంచయితే కల్వకుర్తి, దిండి, మున్ననూరు మీదుగా రావలసి ఉంటుంది.
వసతి: శ్రీశైలంలో దేవస్థానం కాటేజీలు, వివిధ సామాజిక వర్గాల కాటేజీలు ఉన్నాయి.
ప్రకృతితో మమేకం
 మైమరపించే బెలూం గుహలు
కర్నూలు జిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన బెలూం గుహలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ గుహల్లో పాతాళగంగ, ఊడలమర్రి, కోటి లింగాలు, సప్తస్వరాలు, మాయ మందిరం, ధ్యానమందిరం, సన్యాసిపాన్పు తదితర అద్భుతమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని ఏపీ టూరిజం సంస్థ అభివృద్ధి చేస్తోంది. సందర్శకుల కోసం గుహల్లో దీపాలూ, పంకాలూ తదితర సౌకర్యాలున్నాయి. గుహల బయట ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నుంచి బేతంచెర్ల, బనగానపల్లె మీదుగా 110 కి.మీ. ప్రయాణించి బెలూం గుహలకు చేరుకోవచ్చు. అనంతపురం నుంచి వచ్చే పర్యాటకులు తాడిపత్రి మీదుగా 80 కి.మీ., కడప నుంచి వచ్చే పర్యాటకులు నంద్యాల మీదుగా 180 కి.మీ., హైదరాబాదు నుంచి వచ్చే పర్యాటకులు కర్నూలు మీదుగా 280 కి.మీ., బెంగుళూరు నుంచి వచ్చే పర్యాటకులు అనంతపురం, తాడిపత్రి మీదుగా 280 కి.మీ. ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
వసతి: పర్యాటకుల కోసం ఏపీ టూరిజం శాఖ వసతి సౌకర్యాలను కల్పించింది. మూడు డార్మెటరీలు, ఇరవై నాలుగు పడకలు, స్నానపు గదులు ఉన్నాయి.
శిలావనాల ఓర్వకల్లు
కర్నూలు నగరానికి చేరువలో సహజసిద్ధమైన రాతి వనాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. కోట్ల సంవత్సరాల క్రితమే ఇవి ఏర్పడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ రాక్‌ గార్డెన్‌ చరిత్ర పాతరాతి యుగంతో ముడిపడి ఉంది. ఓర్వకల్లు సమీపంలో గార్గేయాపురం, పూడిచెర్ల, కన్నమడకల తదితర ప్రాంతాల్లో ఎరుపు, పసుపు రంగుల్లో లేఖనాల్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో తుంగభద్ర నదీలోయ నాగరికత విలసిల్లి ఉంటుందని పరిశోధకులు వాటి ఆధారంగానే నిర్ధారణకు వచ్చారు. ఆసియాలోనే తొలి రాతి వనాలుగా వీటికి పేరుంది. పర్యాటకంగా ఈ రాక్‌ గార్డెన్స్‌ దినదినాభివృద్ధి చెందుతున్నాయి.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నగరానికి 20 కి.మీ. దూరంలో ఈ రాతి వనాలున్నాయి. కర్నూలు నగరం నుంచి గార్గేయపురం మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వసతి: పర్యాటకులు బస చేయడానికి ఏపీ టూరిజం నిర్వహణలో సౌకర్యాలు ఉన్నాయి.
కనువిందు చేసే కేతవరం గుహలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో కేతవరం రెండు కిలోమీటర్ల పొడవైన గుహలు ఉన్నాయి. వీటిలో రాళ్ళపై చెక్కిన చిత్రలిపి, ఎరుపు, పసుపు రంగుల్లో లేఖనాలు ఉన్నాయి. అవి ఈ ప్రాంతంలో విలసిల్లిన పురాతన నాగరికతకు చిహ్నాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆ లేఖనాలూ, లిపీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఈ గుహల్ని పర్యాటకులు వీక్షించడానికి వీలుగా పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తోంది.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నగరానికి 20 కి.మీ. దూరంలో కేతవరం గుహలు ఉన్నాయి. కర్నూలు నగరం నుంచి గార్గేయపురం మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
ఆనాటి ఆనవాళ్లు
 చరిత్రకు సాక్షి కొండారెడ్డి బురుజు
కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు ఒక చారిత్రక నిర్మాణం. అంతేకాదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు సుమారు మూడేళ్ళ పాటు కర్నూలు రాజధానిగా సాగిన పాలనకు ఈ బురుజు సాక్షిగా నిలిచింది. ఇక్కడికి నగరంలో ఎక్కడి నుంచైనా చేరుకునేలా మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక గొప్ప చారిత్రక కట్టడం. కొండారెడ్డి బురుజు కర్నూలు కోటలో ఒక భాగంగా ఉంది. ఈ కోటను విజయనగర పాలకుడు అచ్యుతరాయలు కాలంలో పదహారో శతాబ్దంలో నిర్మించారు. కోటలో దుర్భేద్యమైన కారాగారం ఉంది. కర్నూలు నుంచి గద్వాల్‌కు చేరుకోడానికి 52 కిలోమీటర్ల సొరంగ మార్గం ఇక్కడి నుంచి ఉందని చెబుతారు.
ఎలా వెళ్ళాలి?: కొండారెడ్డి బురుజు కర్నూలు నగరం మధ్యలో ఉంది.
అరుంధతి (పాతపాడు) బంగ్లా
కర్నూలు జిల్లాలోని యాగంటి సమీపంలో ఉన్న పాతపాడు బంగ్లా అపురూపమైన కట్టడం. బనగానపల్లె నవాబుల కాలంలో ఇది నిర్మితమయింది. ఎటువైపు చూసినా ఒకేలా ఉండేలా ఉండడం దీని ప్రత్యేకత. నిత్యం సందర్శకులతో కళకళలాడే ఈ బంగ్లా సినిమా షూటింగ్‌లకు కూడా పేరుపొందింది. ‘అరుంధతి’ తదితర చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నుంచి బేతంచెర్ల, బనగానపల్లె మీదుగా 70 కి.మీ. దూరంలో యాగంటి ఉమామహేశ్వరస్వామి క్షేత్రం ఉంది. అక్కడికి దగ్గర్లో పాతపాడు బంగ్లా ఉంది.
ఆదోని కోట
ఒకప్పుడు ఆదోని పట్టణాన్ని నవాబులు పరిపాలించేవారు. ఆ కాలంలో వారు నిర్మించిన ఈ కోటను వశపర్చుకోవడానికి ఎందరో రాజులు ప్రయత్నించారు. మొదట ఈ కోట విజయనగర రాజుల పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత నవాబులపరమైంది. చివరికి ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కోటను పురావస్తు శాఖవారు చారిత్రక కట్టడంగా గుర్తించారు.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నగరానికి వంద కి.మీ. దూరంలో ఉన్న ఆదోనికి రోడ్డు మార్గంలో చేరుకోడానికి సౌకర్యాలు ఉన్నాయి.
నల్లమలలో జంగిల్‌ సఫారీ!
పచ్చని చెట్లు.. లేళ్ళ పరుగులు.. పక్షుల కువకువలు... దూరం వినిపించే పులుల శబ్దాలు.. అందమైన అడవిలో మట్టి పుట్టలు... ఇలా ఎన్నో ఆహ్లాదకరమైన విశేషాలతో- ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమించే ప్రతి ఒక్కరినీ అలరించే ప్రదేశం నల్లమల అటవీ ప్రాంతం. ఎకో టూరిజం కేంద్రంగా నల్లమలను అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి దగ్గర, నంద్యాల మండలంలోని పచ్చర్ల దగ్గర నల్లమల పచ్చని అందాలను తిలకించడానికీ, అడవి మధ్యలో బస చేసేందుకు సౌకర్యాలున్నాయి. అడవి అందాలనూ, పక్షులనూ, వన్య ప్రాణులనూ జంగిల్‌ సఫారీ ద్వారా- సుమారు 15 కి.మీల మేర ప్రత్యేక వాహనంలో ప్రయాణించి- వీక్షించవచ్చు. తుమ్మలబైలు వద్ద జంగిల్‌ సఫారీ కేంద్రం ఉంది. ప్రయాణ సమయంలో నల్లమల ప్రాధాన్యం, ఇక్కడ ఉండే వృక్షాలు, పక్షులు, కీటకాల ప్రత్యేకతల గురించి గైడ్‌ వివరిస్తారు. బైర్లూటీ జంగిల్‌ సఫారీ మార్గమధ్యంలో ప్రాచీనమైన దేవాలయాలనూ, కోనేర్లనూ సందర్శించవచ్చు. ట్రెక్కింగ్‌ కూడా చెయ్యవచ్చు. బైర్లూటిలో ఏర్పాటు చేసిన ఎకోటూరిజం కేంద్రానికి జాతీయ స్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ గుర్తింపు ఇచ్చింది.
ఎలా వెళ్ళాలి?: కర్నూలు నుంచి 85 కి.మీ., దోర్నాల నుంచి 45 కి.మీ. దూరంలో బైర్లూటీ ఉంది. శ్రీశైలం నుంచి 27 కి.మీ., దోర్నాల నుంచి 23 కి.మీ. దూరంలో తుమ్మలబైలు జంగిల్‌ సఫారీ కేంద్రం ఉంది. రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
వసతి: బైర్లూటి దగ్గర 2.5 హెక్టార్లలో నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, రెస్టారెంట్‌, ఫైర్‌ క్యాంప్‌, నేచర్‌ స్టడీ సెంటర్‌, బట్టర్‌ఫ్లై పార్క్‌, ఆయుర్వేద వన ప్రదేశం, యోగా కేంద్రం, ధ్యాన మందిరం వంటివి పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. http://nallamalaijunglecamps.com  వెబ్‌సైట్‌లో కాటేజీలను బుక్‌ చేసుకోవచ్చు.
పుణ్యక్షేత్రాల ఖిల్లా
కర్నూలు జిల్లాలో జగద్విదితమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.
దక్షిణ కాశిగా పేరు పొందిన శ్రీశైలం, యాగంటి, అహోబిలం, మహానంది, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS