Tuesday, March 24, 2020

విచిత్ర_వినాయక_దేవాలయాలు

విచిత్ర_వినాయక_దేవాలయాలు


తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.
వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం: ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

తెలంగాణలో తొలి సిద్ధి వినాయక క్షేత్రం: తెలంగాణ రాష్ట్రంలోని తొలి సిద్ధివినాయక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న రేజింతల్ గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహార్రాష్టల నుంచి ఎందరో భక్తులు వస్తూంటారు. గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఈ స్వామికి సింధూరవర్ణం పులమడంవల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. దాదాపు 208 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది.
స్థల విశేషాలు: ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి శివరాం పంతులు అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ, ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట. అందుకే ఆయన చాలాకాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధివినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి, పూజాదికాలు నిర్వహించమని ఆదేశించాడు. శివరాం పంతులు ఆ ప్రాంతం అంతా అన్వేషించి స్వయంభువుడుగా వెలసిన సిద్ధివినాయకుని ప్రతిమను దర్శించి బాహ్య ప్రపంచానికి తెలియజేసాడు. అప్పటి నుంచీ రేజింతల్ సిద్ధివినాయకుడు మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ సిద్ధివినాయకుడు ఏటేటా పెరుగుతూంటాడని భక్తుల నమ్మకం. ముందు రెండున్నర అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తూ, ఆరడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు అంటారు.

సకల విఘ్నాలను తొలగించి, భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధివినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహస్తారు. సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. పుష్య శుద్ధ పాడ్యమి నుంచి... పుష్య శుద్ధ చతుర్దశి వరకూ శ్రీ సిద్ధివినాయక స్వామివారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 451 గణేశ హవనాలూ, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రీ హవనాలతో నిర్వహిస్తారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ఆది మంగళ వారాలలో వచ్చే అంగారక చతుర్థి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి శ్రీ స్వామివారిని దర్శిచుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత.ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలిపూజ చెయ్యడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సింధూరవర్ణ గణపతి భక్తజన పూజ్యనీయుడూ, ప్రేమపాత్రుడు అయ్యాడు.
పశువుల కాపరి వేషంలో వినాయకుడు: ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళరాడు రాష్ట్రంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు.

ఈ ఆలయాన్ని ఉచ్చ పిళ్ళైయార్ ఆలయం అంటారు. తమిళ భాషలో ఉచ్ఛ అంటే ఎత్తునఅని అర్థం. ఇక పిళ్ళై..యర్ అంటే పిల్లవాడు ఎవరు అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాప లాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు. శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న పిళ్ళైయార్. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆనాటి నుండి వినాయకునకు పిళ్ళైయార్ అనే పేరు స్ధిరపడిపోయింది. అందుకు ఈ ఆలయాన్ని ఉచ్చ పిళ్ళైయర్ ఆలయం అంటారు. ఈ ఆలయం ఉన్న కొండ సుమారు 3800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయానికీ..శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దానికి సంబంధించిన కథ ఏమిటంటే.... త్రేతాయుగ కాలంలో, శ్రీరామచంద్రుడు వానరులతో కలసి రావణుని మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సాయం చేసాడు. ఫలితంగా శ్రీరాముడు రావణుని సంహరించాడు. అందుకు కౄఎతఙ్ఞతగా శ్రీరాముడు.. విభీషణునకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని బహూకరిస్తూ విభీషణా.., లంకలో ఈ విగ్రహం ప్రతిష్ఠిచే వరకూ ఈ విగ్రహాన్ని నేలమీద పెట్టవద్దు అని చెప్పాడు. ఆ విగ్రహం తీసుకుని విభీషణుడు లంకకు బయలు దేరాడు. అయితే విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడం దేవతలకు ఇష్టం లేదు. అందుచేత దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక చెప్పారు.
వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకుని, విభీషణునికి ఎదురుగా వస్తున్నాడు. అది సాయం సమయం. అస్తమయ సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలోనున్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని, తనకు ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి, తన చేతిలోనున్న విగ్రహాన్ని ఆ పిల్లవాని చేతిలో ఉంచి నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకూ ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకు అని చెప్పాడు. మాయా గణపతి సరే అన్నాడు. విభీషణుడు కావేరీనదిలో దిగి సంథ్యావందనం చేస్తున్నాడు.

ఆ సమయం చూసి, విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా, ఆ విగ్రహాన్ని నేలమీద ఉంచి పరుగు తీసాడు. విభీషణుడు ఆ బాలుని తరుముతున్నాడు. ఆ బాలుడు కావేరీనది ఒడ్డున ఉన్న కొండ ఎక్కాడు. విభీషణుడు ఆ బలుని పట్టుకుని నుదుటి మీద గట్టిగా కొట్టాడు. (ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ఉచ్చ పిళ్ళైయార్ విగ్రహానికి ఉండడం భక్తులు గమనించవచ్చు) అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణునికి దర్శనమిచ్చి, శ్రీరంగనాథస్వామి విగ్రహం శ్రీరంగ క్షేత్రంలో ప్రతిష్ఠితమౌ గాక. మన ఇద్దరి కలయికకూ గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటాను అని వరమచ్చి సూక్ష్మ గణపతిగా ఆ కొండమీద వెలిసాడు. విభీషణుడు ఆ సూక్ష్మ గణపతికి ఆలయం నర్మించాడు. ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివౄఎద్ధి చెందింది. అదే ప్రపంచంలోని అతి ప్రాచీన వినాయక దేవాలయం. తిరుచ్చిలోని రాక్ ఫోర్ట్ మీదవున్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే 437 మెట్లు ఎక్కి వెళ్లాలి. ఈ మెట్లుకూడా చాలా ఎత్తుగా ఉంటాయి. రాక్ హిల్ ఎక్కి,ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే, తిరుచ్చి నగరం, కావేరీనది, శ్రీరంగం లోని శ్రీరంగనాథస్వామి ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, వినాయకుడు నేలమీద ఉంచిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని చోళరాజు కనుగొని ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో ప్రతిష్ఠిచాడు. అదే శ్రీరంగం లోని శ్రీరంగనాథస్వామి ఆలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే..ఉచ్చ గణపతి దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ రెండు దేవాలయాలే ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు.
పెన్నులతో పూజలందుకునే వినాయకుడు: అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు.
ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కౄఎపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ... ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్క­ృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాం తులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభుడు జన్మిం చారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ.., వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వంనుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుదభ్రిషేకాలు, అష్టోత్తపుష్పార్చన, పుస్తకపూజ, అన్నప్రాశన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి.
సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహో త్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభి షేకం చేస్తారు. ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో...అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.

అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే..., తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదిశలు వ్యాపించడంతో.. ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS