Wednesday, March 25, 2020

తిరుమల ఓ పూల మండపం

తిరుమల ఓ పూల మండపం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు... శ్రీ వేంకటేశ్వరుడు.. ఆయన పుష్పాలంకార ప్రియుడు. ఆయనకు తిరుమల పర్వత సానువుల్లో దొరికే రంగురంగుల పుష్పాలు, పరిమళపత్రాలతో నిత్యం పూజ చేసే సంప్రదాయం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని ‘పుష్పమండపం’ అని భగవద్‌ రామానుజలు అభివర్ణించారు. ఇక్కడ పుష్ప కైంకర్యం అత్యంత పవిత్రమైన కార్యం అని నమ్మాళ్వారు తన ‘తిరువాయ్‌ మొళి’ గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీరామానుజుల ప్రేరణతో ఆయన శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి రోజూ పుష్పార్చన చేస్తుండేవారు. అంతకు ముందే రామానుజుల గురువైన యమునాచార్యులు ఈ క్షేత్రంలో ఉంటూ స్వామివారిని పుష్పాలతో పూజించేవారు. అందుకే అనంతాళ్వారులు తాను చేస్తున్న కైంకర్యాన్ని ‘యామునాత్తురై’ అనే పేరుతో కొనసాగించినట్లు ‘శ్రీ వేంకటాచల ఇతిహాస మాల’ అనే గ్రంథంలో స్పష్టంచేశారు. ఇప్పటికీ శ్రీనివాసునికి అదే పేరుతో పుష్పార్చన జరుగుతోంది. ప్రస్తుతం స్వామి వారికి రోజూ ‘తోమాల సేవ’లో పుష్పాలంకరణ జరుగుతుంది. రుతువుల ప్రకారం ఆయా కాలాల్లో పూచే తాజా పూలను సేవలో వాడతారు.
శ్రీవారి సన్నిధిలో నిత్యకళ్యాణం పచ్చతోరణమే. అయితే వసంత, గ్రీష్మ రుతువులకు ఓ ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో పూలు ఎక్కువగా పూస్తాయి. ప్రకృతి సుగంధభరితంగా ఉంటుంది. స్వామివారి ఉద్యానవనాలు పరిమళించే కాలం కావడంతో స్వామికి పుష్పార్చన విశేషంగా జరుగుతుంది. జీవ వైవిధ్యాన్ని తెలుసుకోవడం, ప్రకృతి పరిరక్షణ కూడా స్వామి పూల అలంకరణ ఆంతర్యం అని కూడా చెప్పవచ్చు.శ్రీవేంకటేశ్వరునికి అలంకరించే పూలమాలలు కూడా ఒక క్రమపద్ధతిలో ప్రత్యేకంగా ఉంటాయి. శ్రీవారి మూలమూర్తికి రోజూ అలంకరించే దండలివీ...
* శిఖామణి: కిరీటంపై నుంచి రెండు భుజాల వరకు అలంకరించే ఒకే ఒక దండ. ఇది 8 మూరలు ఉంటుంది.
* సాలిగ్రామ మాలలు: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి. ఇవి రెండు పొడవైన మాలలు. ఒక్కోటి నాలుగు మూరలు ఉంటుంది.
* కంఠసరి: మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించి ఉండే దండ. ఒక్కోటి మూడున్నర మూరలు ఉంటుంది.
* వక్ష స్థల లక్ష్మీ: శ్రీవారి వక్ష స్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కోటి ఒకటిన్నర మూరలు.
* శంఖు చక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.
* కఠారి సరం: స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. రెండు మూరలు ఉంటుంది.
* తావళములు: రెండు మోచేతుల కింద మూడు మూరలు, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా మూడున్నర మూరల చొప్పున, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ నాలుగు మూరల పూల హారాలను అలంకరిస్తారు.
* తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.
ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి స్వామి వారిని నిలువెల్లా పూల మాలలతో అలంకరిస్తారు.
ఇక్కడ పూచే పూలన్నీ కొండలరాయుడికే. అందుకే భక్తులెవరూ ఇక్కడ పూలు ధరించకూడదు. అది క్షేత్ర సంప్రదాయం. శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యం జరిగే పుష్ప కైంకర్యంలో ప్రాచీన కాలం నుంచీ పేరిందేవితోట, అనంతాళ్వారు తోట, తాళ్లపాకం వారితోట, తరిగొండ వెంగమాంబ తోట, సురపురం వారి తోట, రాంబగీచ... ఇలా తిరుమల పర్వత శ్రేణుల్లోని పూలవనాల నుంచి తీసుకువచ్చిన పూలతో అర్చన జరిపించేవారు. అందుకే శ్రీనివాసుని పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ ‘పుష్పజాతుల విష్ణుబూజింపగల కొండ’ అని తిరుమల కొండ ప్రశస్తిని పేర్కొన్నారు.




స్వామివారికి అలంకరించిన పుష్పాలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. కానీ ఏడాదిలో ఒకసారి తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి పూలమాలలు, పసుపు కుంకుమలు, పరిమళద్రవ్యాలు, లడ్డూలు, వడలను అంగరంగ వైభవంగా, ఊరేగింపుగా కాలినడకన తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకెళ్లి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. మిగిలిన రోజుల్లో తిరుమలలోని పూల బావిలో నిర్మాల్యాన్ని పడేస్తారు.
తిరుమల క్షేత్రంలోని తులసి, చామంతులు, గన్నేరు, మల్లెలు, సన్నజాజులు, మొగలి, తామర, కలువ, రోజాలు, సంపెంగలు, కనకాంబరం, మరువం, దవనం, మారేడు, మాచీపత్రం, మామిడాకులు, తమలపాకులు ఇలా రంగురంగుల పూల, పత్రాలను స్వామివారి కైంకర్యంలో వాడతారు. సిద్ధంచేసిన పూలను పూల అర నుంచి జియ్యంగార్లు నెత్తిపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకునివస్తారు.
- గంధం బసవ శంకరరావు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS