Tuesday, April 7, 2020

గంగాహారతి తప్పక చూడండి తొలి సంధ్య వేళలోనూ..


గంగాహారతి

                        తప్పక చూడండి తొలి సంధ్య వేళలోనూ..



ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీక్షేత్ర దర్శనం దక్కదంటారు. విశ్వనాథుడి స్పర్శనం.. విశాలాక్షి అమ్మవారి అర్చనం.. అన్నపూర్ణమ్మ ప్రసాదం.. అక్కడి ఘాట్‌ల సందర్శనం.. వీటన్నిటికన్నా ముందు పాపాలు కడగంగ.. గంగలో మునకేయడం, అంతకు ముందే క్షేత్రపాలకుడు కాలభైరవుడి దర్శించి కాశీలో విహారానికి అనుమతి తీసుకోవడం.. వారణాసికి వెళ్లిన దాదాపు అందరి భక్తుల అనుభవాలివే. తరచి చూస్తే కాశీ వీధి వీధిలో అద్భుతాలు కనిపిస్తాయి. అలాంటివే ఇవి..


నిత్య హారతి..


కాశీపురికి వెళ్లిన భక్తులంతా సాయంత్రం గంగాహారతి చూడకుండా తిరిగిరారు. వెన్నెల వెలుగుల్లో మురిసిపోతున్న గంగమ్మతల్లికి అర్చకస్వాములు హారతినిచ్చే దృశ్యం మనోహరంగా ఉంటుంది. విశ్వనాథుడి ఆలయ సమీపంలోని దశఅశ్వమేథఘాట్‌ గంగాహారతికి వేదిక. అయితే గంగమ్మకు ఉదయం పూట కూడా ఈ క్రతువు నిర్వహిస్తారు. అస్సీఘాట్‌ వేదికగా తొలి సంధ్య వేళలో గంగానదికి హారతినిస్తారు. అస్సీఘాట్‌ సమీపంలో ‘సుబాహ్‌-ఎ-బనారస్‌’ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇక్కడే పలు సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతాయి. యోగాభ్యాసకులు ఉదయం అస్సీఘాట్‌ సమీపంలో సాధన చేస్తుంటారు. ఉదయం పూట ఇటుగా వెళ్తే.. ప్రశాంత కాశీని చూడొచ్చు.


ఊరంతా వేదిక

రామాయణ కావ్యాన్ని ఆవిష్కరించే ‘రామ్‌లీల’కు ఉత్తరభారతంలో ఎంతో పేరుంది. తులసీదాస్‌ విరచిత ‘రామచరిత మానస్‌’ ఆధారంగా కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు. అయితే అంతటా జరిగే రామ్‌లీలకు.. కాశీలో నిర్వహించే ప్రదర్శనకు చాలా తేడా ఉంది. ఎక్కడైనా ఒక వేదిక నుంచి నాటకాన్ని ప్రదర్శిస్తారు. వారణాసిలో మాత్రం సందర్భాన్ని బట్టి వేదికలు మారిపోతుంటాయి. కాశీపురిలో లంక, అశోకవాటిక, పంచవటి, జనకపురి ఇలా.. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాల పేరుతో పలు వేదికలు ఉన్నాయి. ఆయా ఘట్టాలను బట్టి వేదికలు ఎంచుకుంటారు కళాకారులు. ప్రదర్శనను చూసేందుకు వచ్చిన జనాలు సైతం.. ఒక ఘట్టం పూర్తయిన తర్వాత కళాకారుల వెంట బయల్దేరి మరో ప్రాంగణానికి చేరుకుంటారు. ఏటా దసరా పండగ సందర్భంగా ఆశ్వయుజ మాసంలో రామ్‌లీల ప్రదర్శన 7-31 రోజుల వరకు కొనసాగుతుంది. రామనగర్‌కు చెందిన కళాకారులు కాశీలో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతోంది ఈసారి వారణాసికి వెళ్లినప్పుడు ఆ కళాకారుల నైపుణ్యాన్నీ, కాశీపురిలోని రామ్‌లీల ప్రాంగణాలను తప్పక చూడండి.

- ఆచార్య యడ్ల వెంకటరావు

కేంద్రీయ విశ్వవిద్యాలయం, పుదుచ్చేరి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS