Thursday, March 10, 2022

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!! ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!!
ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం 
అని వర్ణించారు . 

స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. 
ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి 
ఇదొక్కటి చాలు . 

గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీకి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది.వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. 

ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. 
కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాసేవారు. 
అది తరువాత ‘బవారస్’గా మారింది. 
వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.

సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 

కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. 
ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. 

ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . 
పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. 

కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. 

ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. 
దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 

వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. 
చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. 
ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. 
ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. 

అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. 
ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 
ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. 
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. 

ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. 

1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. 
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. 
విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. 
అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. 
ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు 
ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.

కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. 
గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. 
కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. 
అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. 
వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. 

ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. 
ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. 
వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. 
ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ‘సంకట్ మోచన్ హనుమాన్ మందిరం’ కూడా అతి ముఖ్యమైనది . 
ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. 
ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. 
తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. 
సీతారాముల ఆలయం కూడా ఉంది. 
కేవలం ఇవి మాత్రమే కాదు .. 

కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. 
ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. 
అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం .
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రం "వారణాసి"

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS